ninth class
-
అతి తెలివి: తొమ్మిదో తరగతి చదవకుండానే నేరుగా టెన్త్ క్లాస్
సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్‌వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వయసు ఉంటేసరి... పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది. సిలబస్ అంతంతే.. పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం. సుమారు 2.90 లక్షల మంది.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి. పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
AP: ఇంటి దగ్గరే ‘ప్రాక్టికల్స్’
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్ ప్రయోగాల (ప్రాక్టికల్స్)లోనూ మార్పులు చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్‌లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది. ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటినుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాక్డౌన్ కారణంగా ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఓల్యాబ్స్టో’ ద్వారా సీబీఎస్ఈ కరిక్యులమ్‌ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మాన్యువల్ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అందుబాటులో ఉండే వనరులతోనే ప్రయోగాలు విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్ దీక్షా పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్‌ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్ఈలో ప్లస్ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో విద్యార్థిని మృతి
► హత్యచేశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు ► కేసు నమోదు చేసిన పోలీసులు ► వివాహేతర సంబంధమే కారణమా? ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పంచాయతీ నవభారత్‌కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని పైడి హారతి(15) ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రులు శ్రీరామూర్తి, లక్ష్మి మాత్రం తమ కుమార్తె హత్యకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎచ్చెర్ల పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పొందూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన పైడి శ్రీరాంమూర్తి నవభారత్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకొని గత 20 ఏళ్లగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న పరిశ్రమలో ఈయన పనిచేస్తుండగా, ఇతని భార్య స్థానికంగా ఉన్న హోటల్లో పనిచేస్తుంది. వీరికి హారతి అనే కుమార్తె, ఆరువ తరగతి చదువుతున్న కుమారుడు భరత్ ఉన్నారు. శ్రీకాకుళంలోని వరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హారతి తొమ్మిదవ తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం గణితం వార్షిక పరీక్ష సైతం రాయవల్సి ఉంది. ఈలోగా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రీరాంమూర్తి ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న కోరాడ గోవిందరావు అనే వివాహితుడు టాటా ఏస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు హారతితో గత ఏడాది నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ప్రచారం ఉంది. విజయనగరానికి చెందిన 35 ఏళ్లు ఉన్న గోవిందరావు గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థినితో వివాహేతర సంబంధం కొనసాగించటంతో తరచూ శ్రీరాంమూర్తి, గోవిందరావు కుటుంబాల మధ్య వివాదాలు జరిగేవి. గోవిందరావు అతని భార్య జ్యోతి సైతం తరచూ ఈ విషయంపై గొడవలు పడేవారు. భార్యకు విడాకులు ఇచ్చి మైనర్ బాలిక హారతిని వివాహం చేసుకునేందుకు గోవిందరావు సిద్ధపడ్డాడన్న ఆరోపణలు స్థానికంగా ఉన్నాయి. అయితే హారతి మంగళవారం మధ్యాహ్నం 9వ తరగతి గణితం పరీక్ష రాయవల్సి ఉంది. పరీక్షకు వెళతానని తల్లిదండ్రులకు ఉదయం చెప్పింది. తల్లిద్రండులు పనికి వెళ్లిపోయిన తర్వాత వరండాలో శ్లాబు హుక్కు ఉరివేసుకొంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు వేలాడివున్న హారతిని కిందకు దించారు. అప్పటికే మృతి చెంది ఉంది. గోవిందరావు లేదా ఆయన భార్య హత్య చేసి ఉరివేసుకున్నట్టు వేలాడదీసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ నిర్థారణ విభాగం, జేఆర్ పురం సీఐ రామకృష్ణ, ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీరాంమూర్తి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ గోవిందరావును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మృతిపై స్పష్టత వస్తుందని ఎస్ఐ సందీప్‌కుమార్ చెప్పారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.