TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ! | Telangana SSC Exam 2023: Science Exam Should Conduct Two Papers | Sakshi
Sakshi News home page

TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!

Published Thu, Jan 5 2023 2:33 PM | Last Updated on Thu, Jan 5 2023 2:53 PM

Telangana SSC Exam 2023: Science Exam Should Conduct Two Papers - Sakshi

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్‌సీ ఈఆర్‌టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్‌ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్‌ఎస్‌ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్‌లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. 

కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా మోడల్‌ పేపర్లను కూడా విడుదల చేసింది.

కానీ ఫిజికల్‌ సైన్స్, బయోలాజికల్‌ సైన్స్‌ రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. 

గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్‌ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్‌ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. 

అలాగే 2022 డిసెంబర్‌ 30 నాడు స్పెషల్‌ రివిజన్‌ క్లాసుల పేరిట ఎస్‌సీఈఆర్‌టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. 

పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్‌ ఎవరివ్వాలి? జాయిఫుల్‌ లర్నింగ్‌కు, ఆర్‌టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 

ఎస్‌సీఈఆర్‌టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్‌ క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్‌సీఈఆర్‌టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్‌ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు)


- డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement