Exam Paper
-
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీ ఈఆర్టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్ఎస్ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్సీఈఆర్టీ ద్వారా మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది. కానీ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. అలాగే 2022 డిసెంబర్ 30 నాడు స్పెషల్ రివిజన్ క్లాసుల పేరిట ఎస్సీఈఆర్టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఎవరివ్వాలి? జాయిఫుల్ లర్నింగ్‌కు, ఆర్టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీఈఆర్టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్ క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్సీఈఆర్టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు) - డాక్టర్ ఏరుకొండ నరసింహుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
అది కాంతార మ్యానియా.. గవర్నమెంట్ ఎగ్జామ్‌లో మూవీపై ప్రశ్న
ఈ ఏడాది వచ్చిన చిన్న చిత్రాల్లో కన్నడ మూవీ ‘కాంతర’ సృష్టించిన సన్సేషన్ అంతా ఇంత కాదు. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేజీఎఫ్‌ను బీట్ చేసేలా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 400కోట్లని రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి పెర్ఫామెన్స్కి ప్రేక్షకుల నుంచి స్టార్ హీరోల వరకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రిషబ్ ట్రాన్స్ఫార్మేషన్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ హవా కొనసాగింది. కన్నడ నుంచి బాలీవుడ్ వరకు కాంతార విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా కాంతార మ్యానియా విద్యారంగంలోనూ వ్యాపించింది. ఈ చిత్రం కర్ణాటక గ్రామ ప్రాంతాల్లో నిర్వహించే భూతకోల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎగ్జామ్ పేపరల్లో కాంతార మూవీపై ప్రశ్న అడిగారు. ఇందుకు క్వశ్చన్ పేపర్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇటీవల విడుదలైన కాంతార సినిమా దేని ఆధారంగా తెరకెక్కింది’ అంటూ జల్లికట్టు, భూతకోల, యక్షగాన, దమ్మామి అని ఆప్షన్లు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, హీరోయిన్ సప్తమి గౌడ్ ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ -
టెన్త్‌లో ఆరు పేపర్లే.. విద్యాశాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే జరగనున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నుంచే దీన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు పరీక్షల తీరుపై స్పష్టతనిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 9వ తరగతి పరీక్షలు కూడా ఇదే విధంగా ఉంటాయని తెలిపారు. ఆరు పేపర్లతో జరిగే పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రాంతీయ అధికారులు, పాఠశాలల హెచ్ఎంలు ఇప్పట్నుంచే ఈ దిశగా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. మొదట్నుంచీ గందరగోళం టెన్త్ పరీక్షలపై ఈ ఏడాది మొదట్నుంచీ గందరగోళం నెలకొంది. కోవిడ్‌కు ముందు వరకు 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు జరిగేవి. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. ఈ ఏడాది సకాలంలో బడులు తెరవడంతో గతంలో మాదిరిగానే 11 పేపర్లతో పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తొలుత పేర్కొంది. అయితే సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1) పరీక్షలకు సన్నద్ధమైన సమయంలో ఆరు పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. కానీ అప్పటికే 11 పేపర్లకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవడం, ప్రింటింగ్‌కు ఆర్డర్లు ఇవ్వడంతో.. మార్చేదెలా అని ఉపాధ్యాయ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనివల్ల ఎస్ఏ–1 పరీక్షను 11 పేపర్లతో నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు ఎస్ఏ–1 పరీక్షను 11 పేపర్లతో రాసిన తర్వాత.. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతో రాయాల్సి ఉండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని హెచ్ఎంలు, టీచర్లు విద్యా శాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 11 పేపర్లతో వార్షిక పరీక్ష నిర్వహించడంపై విద్యాశాఖ ఆలోచన చేసింది. కానీ తాజాగా ఆరు పేపర్లతోనే పరీక్షలంటూ ఆదేశాలు జారీ చేసింది. 11 పేపర్లకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదని, అందుకే ఈ ఆదేశాలు ఇచ్చామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇలా పరీక్షలు మార్చడం సరికాదు వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. సంవత్సరం మధ్యలో మార్పులు చేపడితే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. ఎస్ఏ–1 పరీక్షలు వార్షిక పరీక్షలకు ప్రిపరేషన్‌గా చూడాల్సి ఉంటుంది. ఇదే మాదిరి పరీక్షలు ఉంటే బాగుంటుంది. – రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
దుమారం రేపిన ఏడో తరగతి పరీక్ష పేపర్లోని ప్రశ్న!: నెటిజన్లు ఫైర్
బిహార్: ఏడో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ పరీక్ష పేపర్లోని ప్రశ్న ఏమిటంటే...నేపాల్, చైనా, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారత్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇందులో కాశ్మీర్‌ని వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదానికి దారితీసింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇది పొరపాటు కాదని కావలనే ఇలా చేశారంటూ ఆ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత గోపీ విమర్శలు గుప్పించారు. పిల్లలు మనసుల్లో కాశ్మీర్‌ను భారత్‌ని వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోంది నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పైగా రాజకీయంగా పట్టు సాధించాలనే నితీష్ కుమార్ కుట్రలోని భాగం ఇది అంటూ విమర్శులు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా...ఆ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్కే దాస్ ఈ విషయమై వివరణ ఇస్తూ...ఆ ప్రశ్న పత్రంలో ప్రశ్న కాశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానకి బదులు కాశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉంది. ఇది మానవ తప్పిదమే తప్ప మరోకటి కాదని వివరణ ఇచ్చారు. అంతేగాదు ఆ జిల్లా విద్యాధికారి సుభాష్ గుప్త అనవసరంగా ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారన్నారు. అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరం. ఈ మేరకు ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడటమే కాకుండా సదరు టీచర్ని తొలగించాలంటూ ట్వీట్ చేశారు. Kishanganj, Bihar | Class 7 question paper terms Kashmir as separate country Got this via Bihar Education Board. Ques had to ask what are people from Kashmir called? Mistakenly carried as what are people of country of Kashmir called? This was human error: Headteacher, SK Das pic.twitter.com/VVv1qAZ2sz — ANI (@ANI) October 19, 2022 (చదవండి: భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు) -
కరీనా కొడుకు పూర్తి పేరేంటి? విద్యార్థులను అడిగే ప్రశ్నలు ఇవా?
సైఫ్ అలీఖాన్- కరీనా కపూర్ దంపతుల కొడుకు పూర్తి పేరు ఏమిటి? ఇంతకీ ఫస్టా? సెకండా? అని అడగకండి. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది మేము కాదు మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూల్. ఆరవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో పై ప్రశ్న ఉంది. దాన్ని కొందరు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇవేం పిచ్చిప్రశ్నలని స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కరీనా కొడుకు పేరేంటి? అన్న పాఠశాల యాజమాన్యం ఆమెకు ఇద్దరు సంతానం అన్న సంగతి కూడా మరిచింది. కాగా బాలీవుడ్ జంట సైఫ్ - కరీనా దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్‌లు సంతానం. జెహ్ పూర్తి పేరు జెహంగీర్ అలీ ఖాన్. A private school in Khandwa asked the name of film actor Kareena Kapoor Khan and Saif Ali Khan's son in the examination paper of class 6th. The DEO said a show cause notice will be issued to the school @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/YkERwGYeMB — Anurag Dwary (@Anurag_Dwary) December 24, 2021 -
రోడ్డుపై దర్శనమిచ్చిన ప్రశ్నపత్రాలు
ద్వారకా తిరుమల: 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు మండలంలోని గుణ్ణంపల్లి వద్ద దర్శనమిచ్చాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ట్రక్కు ఆటోలో పరీక్ష ప్రశ్న పత్రాలను భీమడోలు మీదుగా తీసుకెళుతుండగా గుణ్ణంపల్లి వచ్చేసరికి కొన్ని ప్రశ్నపత్రాల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆసమయంలో అటుగా వస్తున్న విద్యార్థులు ఆ పేపర్లను ఏరి, వొబ్బిడి చేశారు. దీనిని గమనించి వెనక్కి వచ్చిన ఆటో డ్రైవర్‌కు వాటిని విద్యార్థులు అందజేశారు -
TS: ‘పది’లో ఆరు పేపర్లే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఇప్పటివరకు హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్టుకు ఒక్క పేపర్ మాత్రమే నిర్వహించనున్నారు. దీనితోపాటు పరీక్ష సమయాన్ని అరగంట పాటు పెంచారు. బహుళ ఐచ్చిక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో.. గత ఏడాది లాక్డౌన్ సమయం నుంచే పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు బోధన సరిగా జరగలేదు. దీంతో పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని గత ఏడాదే నిర్ణయించారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. ఈ ఏడాది మొదట్లోనూ అదే తరహా పరిస్థితి ఎదురైంది. కానీ కాస్త ఆలస్యంగానైనా ఆన్లైన్ క్లాసులు జరిగాయి. సెప్టెంబర్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు కూడా మొదలయ్యాయి. అయినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందని పరిస్థితి ఉందని ‘స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (టీఎస్‌సీఈఆర్‌టీ)’పేర్కొంది. పదో తరగతికి ఆరు పేపర్లే పెట్టాలని సిఫారసు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ.. 2021–22 ఏడాదికి సంబంధించి టెన్త్ పరీక్షలను కుదిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో సుమారు ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపశమనం కలుగనుంది. ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాటైంది. అప్పట్నుంచీ 11 పేపర్ల విధానమే కొనసాగుతోంది. వాటిని ఆరుకు కుదించడం బోర్డు చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తొలినాళ్లలో 9, 10 తరగతులు రెండింటి నుంచీ ప్రశ్నలిచ్చేవారు. దీనివల్ల విద్యార్థి సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, నైపుణ్యం తెలుసుకునే అవకాశం ఉండేదని చెప్పేవారు. తర్వాత ఆ విధానాన్ని సరళీకరించి పదో తరగతి పాఠాలకే పరిమితం చేశారు. కొన్నేళ్ల కింద మరోసారి పరీక్షల విధానాన్ని మార్చారు. పబ్లిక్ పరీక్షల ద్వారా విద్యార్థికి ఇచ్చే మార్కులను ఒక్కో సబ్జెక్టులో గరిష్టంగా 80కి పరిమితం చేశారు. మిగతా 20 మార్కులను ఇంటర్నల్స్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది. రెండు పేపర్లలో గతంలో ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చారో.. అదే తరహాలో ఇప్పుడూ ప్రశ్నల శాతాన్ని ఖరారు చేసేఅవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సిలబస్ గందరగోళం! కోవిడ్ నేపథ్యంలో మొత్తం సిలబస్ బోధించడం కష్టమని భావించిన విద్యాశాఖ దాన్ని 30 శాతం మేర తగ్గించింది. కానీ దీనిపై ఇంతవరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇంకా బోధించని పాఠాలను నిలిపివేస్తారా? ఎవైనా నిర్థిష్టమైన పాఠాలను ఎంపిక చేసి, కోత పెడతారా? అన్నది తేల్చాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ‘‘ప్రభుత్వ స్కూళ్లలో కొంత సిలబస్ పూర్తికాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకుని, రివిజన్ మొదలుపెట్టాయి. సిలబస్ కోత విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఇబ్బందులు ఉంటాయి’’అని యూటీఎఫ్ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. సిలబస్‌పై విద్యాశాఖ వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, నాణ్యతకు పదునుపెట్టే సబ్జెక్టుల్లో కోత పెట్టొద్దని మరో ఉపాధ్యాయ సంఘం నేత నర్సిరెడ్డి సూచించారు. -
‘పది’లో ఇక 6 పేపర్లే.. టీఎస్ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌గానే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడం గమనార్హం. చదవండి: భారత్: మన ఇంటర్నెట్ వేగం అంతంతే! -
టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్/మేలో నిర్వహించే టెన్త్ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ముందుగా 9, 10 తరగతులకు... పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించాలని భావించినా ప్రస్తుత చలికాలంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై నిర్ణయం తీసుకోలేదన్నారు. జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి తర్వాత 9వ తరగతి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. 9, 10 తరగతుల వారికి కనీసం మూడు నెలలపాటు ప్రత్యక్ష బోధన ఉండేలా చూస్తామన్నారు. వాటితోపాటు జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత దశలవారీగా కింది తరగతుల వారికి ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబం ధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో∙నియామకాలు చేపడతామన్నారు. (చదవండి: 33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్) ఆన్లైన్లో టెట్? టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈసారి టెట్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపామన్నారు. -
163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి డుమ్మా కొట్టిన టీచర్లపై జిల్లా విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ల మూల్యాంకనానికి గైర్హాజరైన 163 మంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేసింది. విద్యాశాఖ చర్యలతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 15న మూల్యాంకనం ప్రారంభంకాగా.. తొలిరోజు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ల మూల్యాంకనానికి 163 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (స్కూల్ అసిస్టెంట్లు) అనధికారికంగా గైర్హాజరయ్యారు. అన్ని పేపర్ల మూల్యాంకనం ఈనెల 26వ తేదీకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 రోజుల్లోనే ఆరు లక్షల జవాబు పేర్లను దిద్దాల్సిన బాధ్యతను సుమారు మూడు వేల మంది టీచర్లకు అప్పగించారు. స్వల్ప సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా.. టీచర్లు విధులకు గైర్హాజరయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన డీఈఓ కె.సత్యనారాయణరెడ్డి.. డుమ్మా కొట్టిన టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. సీసీఏ నియయ నిబంధనలు–1991 ప్రకారం సర్వీసు నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పేర్కొనాలని నోటీసుల్లో ప్రస్తావించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, వికలాంగులు, ఏడాదిలోపు శిశువు ఉన్న టీచర్లకు మూల్యాంకన విధులకు సాధారణంగా గైర్హాజరవుతారు. దీన్ని ఎవరూ తప్పబట్టరు. అయితే ఒక్క సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లే భారీగా డుమ్మా కొట్టిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే వారు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌లో రిపోర్టు చేయలేదని తెలుస్తోంది. వాస్తవంగా జవాబు పత్రాల మూల్యంకనం.. టీచర్ల విధుల్లో భాగం. పైగా ఈ విధులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన ఉపాధ్యాయలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా విద్యాశాఖ ఉపేక్షించడం లేదు. వాస్తవంగా గతంలో పోల్చుకుంటే మూల్యాంకనం ఈసారి కొంత ఆలస్యమైంది. అంతకుముందు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ముందే వాల్యుయేషన్ ముగిసేది. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికలు రావడంతో మూల్యాంకనానికి ఆలస్యమైంది. సెలవు రోజుల్లో మూల్యాంకనం చేస్తే ఉపాధ్యాయులు సంపాదిత సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సంపాదిత సెలవులకు బదులుగా పాత ఉత్తర్వుల ప్రకారం టీఏ, డీఏలు ఇస్తోంది. కచ్చితంగా సంపాదిత సెలవులే ఇవ్వాలని టీచర్లు పట్టుబడుతున్నారు. పైగా కొత్త జిల్లాల ప్రకారం స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు అనుగుణంగా క్యాంప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రానికి వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి రాకపోకలు జరిపేందుకు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైనా సర్కారు స్పందించలేదు. ఈ రెండు కారణాల వల్లే కొందరు టీచర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు మూల్యాంకనం తమ బాధ్యత కాదన్నట్లుగా భావించి పెడచెవిన పెట్టినట్లు సమాచారం. -
టెన్త్ పరీక్ష: నవ్వులు పూయించిన కోహ్లి
సాక్షి, కోలకతా: పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే.. పరీక్షా పత్రాల లీకులు, వింత వింత ప్రశ్నలు లాంటి పొరపాట్లు, గ్రహపాట్లు చాలాకాలంగా వింటున్నదే. అయితే పశ్చిమ బెంగాల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష పేపర్లో అధికారులు అడిగిన ప్రశ్న ఇపుడు వార్తల్లో నిలిచింది. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్, ఇంగ్లీష్ పేపర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి వ్యాసం రాయాలన్న ప్రశ్న చూసి విద్యార్థులు ఎగిరి గంతులేసినంత పనిచేశారు. అసలే విద్యార్థులకు క్రికెట్ అంటే క్రేజ్. అందులోనూ తమ అభిమాన ఆటగాడు.. ఐకాన్ కెప్టెన్ గురించి రాయమంటే.. ఆ చాన్స్‌ను ఎలా వదులుకుంటారు. మిక్కిలి సంబరంతో కోహ్లి క్రికెట్ చరిత్రలో రికార్డులు, సెంచరీలతోపాటు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కతో పెళ్లి.. హనీమూన్ లాంటివి గుర్తు చేసుకుంటూ పది మార్కుల ప్రశ్నను ఎవ్వరూ వదిలిపెట్టకుండా ఆన్సర్ చేశారు. దాదాపు తామంతా ఈ ప్రశ్నకు సమాధానం రాశామని, పదికి పది గ్యారంటీ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు.. హి ఈజ్ మై ఐడల్ అంటూ షమిమ్ అక్తర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. స్పోర్ట్స్ ఐకాన్ గురించి పరీక్షలో రాయడంపై విద్యార్ధులు సంతోషిస్తున్నారని పశ్చిమ మిడ్నాపూర్ సల్బోనిలో ముసుల్ దేశాప్రన్ విద్యాపీఠ్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాన్ పారియా చెప్పారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కోహ్లీ గురించి అడగడం బాగుందని, ఇలాంటి ప్రశ్నలడిగే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించడం విశేషం. విరాట్ కోహ్లి ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
ఈ ప్రశ్నకు జవాబు లేదు..!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు జవాబు లేని ప్రశ్న ఎదురైంది. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో 'ఏ పార్టీ భాగస్వామ్యంతో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది' అనే ప్రశ్న ఉంది. ఈ మల్టీపుల్ చాయిస్ ప్రశ్న కింద (బిట్) నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ నాలుగింటిలో ఒక్కటీ జవాబు (బీజేపీ) లేదు. దీంతో విద్యా శాఖ అధికారులు చేసిన నిర్వాకం వల్ల జవాబు ఏం రాయాలో తెలియక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జమ్ము కశ్మీర్లో బీజేపీతో కలసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ ప్రశ్నకు బీజేపీ అన్నది సమాధానం. అయితే ఆ ప్రశ్న కింద కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అనే నాలుగు సమాధానాలు ఇచ్చారు. వీటిలో బీజేపీ పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆ ప్రశ్నను విడిచిపెట్టారు. ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.