విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)
సాక్షి, కోలకతా: పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే.. పరీక్షా పత్రాల లీకులు, వింత వింత ప్రశ్నలు లాంటి పొరపాట్లు, గ్రహపాట్లు చాలాకాలంగా వింటున్నదే. అయితే పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష పేపర్‌లో అధికారులు అడిగిన ప్రశ్న ఇపుడు వార్తల్లో నిలిచింది.
10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్, ఇంగ్లీష్ పేపర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి వ్యాసం రాయాలన్న ప్రశ్న చూసి విద్యార్థులు ఎగిరి గంతులేసినంత పనిచేశారు. అసలే విద్యార్థులకు క్రికెట్ అంటే క్రేజ్. అందులోనూ తమ అభిమాన ఆటగాడు.. ఐకాన్ కెప్టెన్ గురించి రాయమంటే.. ఆ చాన్స్‌ను ఎలా వదులుకుంటారు. మిక్కిలి సంబరంతో కోహ్లి క్రికెట్ చరిత్రలో రికార్డులు, సెంచరీలతోపాటు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కతో పెళ్లి.. హనీమూన్ లాంటివి గుర్తు చేసుకుంటూ పది మార్కుల ప్రశ్నను ఎవ్వరూ వదిలిపెట్టకుండా ఆన్సర్ చేశారు.
దాదాపు తామంతా ఈ ప్రశ్నకు సమాధానం రాశామని, పదికి పది గ్యారంటీ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నను ఊహించలేదు.. హి ఈజ్ మై ఐడల్ అంటూ షమిమ్ అక్తర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. స్పోర్ట్స్ ఐకాన్ గురించి పరీక్షలో రాయడంపై విద్యార్ధులు సంతోషిస్తున్నారని పశ్చిమ మిడ్నాపూర్ సల్బోనిలో ముసుల్ దేశాప్రన్ విద్యాపీఠ్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాన్ పారియా చెప్పారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కోహ్లీ గురించి అడగడం బాగుందని, ఇలాంటి ప్రశ్నలడిగే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించడం విశేషం. విరాట్ కోహ్లి ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment