సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇక నుంచి ఆరు పేపర్లతోనే జరగనున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల నుంచే దీన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు పరీక్షల తీరుపై స్పష్టతనిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 9వ తరగతి పరీక్షలు కూడా ఇదే విధంగా ఉంటాయని తెలిపారు. ఆరు పేపర్లతో జరిగే పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రాంతీయ అధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలు ఇప్పట్నుంచే ఈ దిశగా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.
మొదట్నుంచీ గందరగోళం
టెన్త్ పరీక్షలపై ఈ ఏడాది మొదట్నుంచీ గందరగోళం నెలకొంది. కోవిడ్‌కు ముందు వరకు 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు జరిగేవి. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. ఈ ఏడాది సకాలంలో బడులు తెరవడంతో గతంలో మాదిరిగానే 11 పేపర్లతో పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ తొలుత పేర్కొంది. అయితే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1) పరీక్షలకు సన్నద్ధమైన సమయంలో ఆరు పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. కానీ అప్పటికే 11 పేపర్లకు అనుగుణంగా
ప్రశ్నపత్రాల రూపకల్పన పూర్తవడం, ప్రింటింగ్‌కు ఆర్డర్లు ఇవ్వడంతో.. మార్చేదెలా అని ఉపాధ్యాయ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనివల్ల ఎస్‌ఏ–1 పరీక్షను 11 పేపర్లతో నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు ఎస్‌ఏ–1 పరీక్షను 11 పేపర్లతో రాసిన తర్వాత.. వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతో రాయాల్సి ఉండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని హెచ్‌ఎంలు, టీచర్లు విద్యా శాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత విద్యా సంవత్సరం 11 పేపర్లతో వార్షిక పరీక్ష నిర్వహించడంపై విద్యాశాఖ ఆలోచన చేసింది. కానీ తాజాగా ఆరు పేపర్లతోనే పరీక్షలంటూ ఆదేశాలు జారీ చేసింది. 11 పేపర్లకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదని, అందుకే ఈ ఆదేశాలు ఇచ్చామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఇలా పరీక్షలు మార్చడం సరికాదు
వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను విద్యా సంవత్సరం ప్రారంభం నుంచీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. సంవత్సరం మధ్యలో మార్పులు చేపడితే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. ఎస్‌ఏ–1 పరీక్షలు వార్షిక పరీక్షలకు ప్రిపరేషన్‌గా చూడాల్సి ఉంటుంది. ఇదే మాదిరి పరీక్షలు ఉంటే బాగుంటుంది.
– రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment