public high school
-
మా బడిలో సీట్లు ఖాళీగా లేవు
సాక్షి, సిద్దిపేట: దశాబ్ద కాలం క్రితం పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల పుణ్య మా అని రాష్ట్రంలోని సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థులు లేరని కొన్ని చోట్ల పాఠశాలలను మూసివేసిన సంఘటనలూ ఉన్నాయి. కానీ సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఈ పాఠశాలలో వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన మూడు, నాలుగు రోజుల్లోనే పరిమితికి మించి దర ఖాస్తులు వస్తుంటాయి. అనేకమందిని వెయిటింగ్ లిస్టులో పెట్టి మరీ తమ పాఠశాలలో ప్రవేశాలు నిలిపి వేశామని బోర్డు పెడుతుండడం గమనార్హం. ఐదు తరగతులు.. పదహారు సెక్షన్లు.. ఒక్కో తరగతికి సరిపడా విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ఈ రోజుల్లో ఐదు తరగతులకు 16 సెక్షన్లు ఏర్పాటు చేసినా విద్యార్థుల ప్రవేశాలకోసం క్యూలు కట్టడం ఈ పాఠశాల ప్రత్యేకత. ఇంగ్లిష్ మీడియంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న సిద్దిపేట ఇందిరానగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మొత్తం 16 సెక్షన్లు ఉన్నాయి. గడిచిన మూడు సంవత్సరాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ స్కూలు నోటీస్ బోర్డు మీద ప్రవేశాలు నిలిపి వేశామనే బోర్డు పెట్టడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది ఆరవ తరగతిలో మూడు సెక్షన్లకు సరిపడా విద్యార్థులు పోగా మరో 88 మంది విద్యార్థులను వెయిటింగ్ లిస్టులో ఉంచారు. వైవిధ్యంగా బోధన ఈ పాఠశాలలో బోధన అంతా వైవిధ్యంగా ఉంటుంది. విద్యా క్యాలెండర్‌ను ఒక వైపు పాటిస్తూనే.. మరో వైపు కొన్ని ప్రత్యేక కార్యక్రమాతో విద్యార్థికి మార్కు లు, ర్యాంకులే కాకుండా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా బోధన ఉంటుంది. ఇక్కడ ఒక ప్రధానోపాధ్యాయు డు, 20 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యావలంటీర్లు, మరో ముగ్గురు వృత్తి విద్యా కోర్సులు బోధించే వారు ఉన్నారు. విద్యార్థులకు బోధన కోసం ఐదు టీంలు ఏర్పాటు చేశారు. క్రీడలతోపాటు నృత్యం, సంగీతం, సాంఘిక ఉన్నతి, చేతి వృత్తులు నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మామూలు పాఠశాలలకన్నా అరగంట ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకుంటారు. ధ్యానంతో పాఠశాల దైనందిన కార్యక్రమాలు మొదలవుతాయి. ఇంటి వద్ద ఉన్న పరిస్థితులు, ఒత్తిడి నుంచి విద్యార్థులను పాఠ్యాంశాలను వినేందుకు సన్నద్ధం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ముందుగా రూపొందించుకున్న పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధన ఉంటుంది. సాయం త్రం గ్రూపుల వారిగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకే ఈ పాఠశాలలో పేద విద్యార్థులే కాదు. దాదాపు 50 మందికి పైగా ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా చేర్పించడం విశేషం. దాతల సహకారంతో వసతుల కల్పన ప్రభుత్వ పాఠశాల అంటే ఒకటి ఉంటే మరొకటి ఉండదు అనే భావన ప్రజల్లో నెలకొంది. కానీ ఈ పాఠశాలలో మాత్రం విద్యార్థులకు అన్ని వసతులూ ఉన్నాయి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోధన పరికరాలు. రక్షిత తాగునీరు, ఆడుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆట స్థలాలు ఉన్నాయి. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగుతున్న ఈ పాఠశాలను నాట్కో సంస్థ గుర్తించి రూ. 60 లక్షల వ్యయంతో వివిధ వసతులు కల్పించింది. బాలవికాస, లయన్స్‌క్లబ్, ఇతర దాతలతోపాటు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా తరచుగా విరాళాలు ఇస్తుంటారు. ఇదే కాకుండా గత ఏడాది గూగుల్ కంపెనీ ప్రోత్సాహకాలు, యూనిసెఫ్ ద్వారా టాకింగ్ బుక్స్ సరఫరాకు కూడా ఈ పాఠశాల ఎంపిక కావడం గమనార్హం. పాఠశాల పనితీరును చూసిన నాట్కో కంపెనీ ప్రతినిధులు ఈ ఏడాది కూడా మరో రూ.40 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంకిత భావంతో పనిచేయడమే.. ప్రభుత్వ పాఠశాలంటే చాలా మందికి చిన్నచూపు. దీన్ని రూపుమాపాలన్నదే మా ఉద్దేశం. అందుకే నాతోపాటు సహచర ఉపాధ్యాయులు, ఉన్నత ప్రమాణాలతో బోధన చేస్తున్నాం. ఇదే మా విజయానికి మూలం. – రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు మంచి బోధన అందిస్తున్నారు నేను గతంలో న్యూజిలాండ్‌లో ఉండేవాడిని. అక్కడే మా బాబు పుట్టాడు. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో మూస విద్యా బోధన జరుగుతోంది. దీన్ని గమనించి మా బాబును ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలలో చేర్పించాను. ఇక్కడ విద్యనే కాకుండా నైతిక విలువలు కూడా బోధించడం సంతోషకరం. – డాక్టర్ కృష్ణ దయాసాగర్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల డీన్ మా ఊరు నుంచి వచ్చాం మాది సిద్దిపేట పక్కనే ఉన్న చందలాపూర్. అక్క డి కన్నా ఇక్కడ మంచిగా చదువు చెబుతారని తెలిసిన మా తల్లిదండ్రులు సిద్దిపేటకు మకాం మార్చి నన్ను ఈ బడిలో చేర్పించారు. ఇక్కడ పాఠాలు బాగా చెబుతున్నారు. – శిరీష, పదవ తరగతి -
ప్రతి హైస్కూల్‌కు రూ. 50 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. రాష్ట్రంలోని 5,639 ఉన్నత పాఠశాలల కోసం రూ.28.19 కోట్ల నిధులను రాష్ట్రీయ మాధ్య మిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) కింద కేటాయించింది. ఈ నిధుల్లో రూ. 20 వేలను పాఠశాలల్లో మరమ్మతులు, ల్యాబ్ పరికరాల కొనుగోలు, కంప్యూటర్ ల్యాబ్‌లకు, రూ. 5 వేలను పుస్తకాలు, పీరియాడికల్స్, వార్తా పత్రికలు, స్పోర్ట్స్ పరికరాల కొనుగోలుకు, రూ. 25 వేలను తాగు నీరు, విద్యుత్ చార్జీలు, ఇంటర్నెట్, డిజిటల్ తరగతుల నిర్వహణకు విని యోగించాలని సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులను జారీచే సింది. వీటిలో రూ. 500 వరకే డబ్బు ను నేరుగా ఖర్చు చేయాలని, అంత కుమించి వినియోగించాల్సి వస్తే చెక్ రూపంలో, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా వినియోగించాలని తెలిపింది. -
ఆకట్టుకున్న రంగవల్లులు
ఎల్లారెడ్డిపేట: వెంకటాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. రంగవల్లి ముగ్గుల పోటీలను హైద్రాబాద్ భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానంలో రవళి, ద్వితీయ స్థానంలో నమ్రత, తృతీయ స్థానంలో రమ్య, యామని, శ్వేత, లావణ్య, నిఖితలు రాణించారు. ముగ్గుల పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఆడెపు సుదర్శన్, ఫౌండేషన్ ప్రతినిధి సతీశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీలో ముగ్గుల పోటీలు సిరిసిల్ల ఎడ్యుకేషన్: శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అనురాగ్ డిగ్రీ కళాశాలలో సోమవారం సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. నిగమ ఇంజినీరింగ్ కళాశాల అధినేత బీవీఆర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మనసంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రతీ యేటా విద్యార్థినులకు, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి, బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. -
108లో పరీక్ష...
బీపీతో కళ్లు తిరిగిపడిపోయిన విద్యార్థిని జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఎ.రుచిత లోబీపీతో కళ్లు తిరిగి పరీక్ష హాల్లో పడిపోయింది. రామారావుపేటకు చెందిన రుచిత ఇందారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. శుక్రవారం సైన్స్-2 పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పరీక్ష హాల్లో పడిపోయింది. దీంతో జైపూర్ 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది లక్ష్మయ్య, రమేశ్, కుందారం వైద్యాధికారి ఎస్.అనిత పరీక్ష కేంద్రానికి చేరుకుని రుచితకు వైద్యం అందించారు. 108 వాహనంలో గ్లూకోజ్ ఎక్కించారు. దీంతో రుచిత చివరి గంట పరీక్ష ఎంఈవో శ్రీనివాస్, పరీక్షల సీఎస్ సమక్షంలో 108 వాహనంలోనే రాసింది. పరీక్ష అనంతరం మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏపీలో అడ్డగోలుగా ఇంటర్ పరీక్షలు
అర్ధవీడు: ఏపీలోని ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన అర్ధవీడు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్షలు మూడు స్లిప్పులు.. ఆరు సమాధానాలు అన్నట్లు సాగుతున్నాయి. పరీక్ష మొదలైన 20 నిమిషాలకే అధ్యాపకులు ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించుకుని కార్బన్ పేపరు ఉపయోగించి స్లిప్పులు రాసి విద్యార్థులకు పంపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందిన ‘సాక్షి’ విలేకరి గురువారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా లెక్కలు-1బి ప్రశ్నపత్రానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టాఫ్ రూంలో కాంట్రాక్టు అధ్యాపకులు డానియేలు, రాజు, జూనియర్ లెక్చరర్ వనిపాల్‌రెడ్డి కార్బన్ పేపర్లు పెట్టి జవాబులు రాస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గదిలోనుంచి పరారయ్యారు. పరీక్షల చీఫ్ అయిన ప్రిన్సిపాల్ కుటుంబరావు, డిపార్ట్మెంటల్ అధికారి బి.శివలక్ష్మి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని, దీనికి ఆ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మరెలా పాస్ అవుతారు: ప్రిన్సిపాల్ మాస్ కాపీయింగ్ జరుగుతున్న తీరుపై ప్రిన్సిపాల్ కుటుంబరావును ‘సాక్షి’ అడగగా మారుమూల ప్రాంతంలో కాపీలు జరగకపోతే ఎలా పాస్ అవుతారు అని ప్రశ్నించారు. వెంటనే నాలుక్కరచుకొని ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పారు. -
సర్కారు స్కూళ్లకు..... ఫ్రి ఇంటర్ నెట్
జిల్లాలో మలివిడతలో 75 పాఠశాలల ఎంపిక ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ పూర్తి పథకాల సమీక్షే ప్రధాన లక్ష్యం డీఈవో కార్యాలయంలో డేటా కార్డుల పంపిణీ విజయవాడ : అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం రెండో విడతలో జిల్లాలోని 75 పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటంతో పాటు విద్యార్థులకు ఇంటర్నెట్ వసతి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మానవ వనరుల శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ శిక్షణ (ఐసీటీ-5000) కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 150 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. రెండో విడతలో ఐసీటీ-1300 కార్యక్రమంలో భాగంగా 75 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 3జీ సిమ్ కార్డులు, 3.6 ఎంబీపీస్ స్పీడ్ డేటా కార్డులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి జిల్లాలో ఎంపిక చేసిన 75 పాఠశాలలకు ఇంటర్నెట్ డేటా కార్డు, 3జీ సిమ్‌కార్డులు అందజేస్తున్నారు. విడతలవారీగా అన్ని పాఠశాలలకూ... జిల్లాలో 434 జెడ్పీ, విజయవాడ నగరంలో 28 కార్పొరేషన్ హైస్కూళ్లు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరంలో కలిపి మొత్తం 75 మున్సిపల్ హైస్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారుల అంచనాల ప్రకారం ఇప్పటికే అన్ని హైస్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దానిలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం విడతలవారీగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కల్పించనున్నట్లు చెబుతున్నారు. దీనిపై జిల్లాలోని టీచర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక్కొక్క టీచర్ ని ఎంపిక చేసి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్న కేంద్ర మానవ వనరుల విభాగం నేతృత్వంలో శిక్షణ చేపట్టారు. ఇంటర్నెట్ వాడకం, ఆన్లైన్లో రిపోర్టింగ్, మధ్యాహ్న భోజనం వివరాల అప్డేట్ చేయటం లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ మానిటరింగే కీలకం ప్రధానంగా ప్రభుత్వం పాఠశాలల్లో అమలుచేస్తున్న పథకాలను సమీక్షించటం కోసం ఇంటర్నెట్ను వినియోగించనున్నారు. దీనిలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రోజువారీ నివేదిక, స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం పర్యవేక్షణ, రిమోట్ ఎడ్యుకేషన్ పేరుతో కంప్యూటర్ క్లాసులు, ఆన్లైన్ క్లాసుల కోసం దీనిని వినియోగించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం పెంచటమనేది ప్రభుత్వ పాఠశాలలకు నిర్దేశించిన లక్ష్యం. ఈ క్రమంలో వార్షిక ప్లాన్‌తో ఉన్న కార్డులను అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో 75 పాఠశాలలకు గత నెల చివరి వారంలో డేటా కార్డులు అందజేశామని, అన్నింటిలో నెట్ వాడకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి ► వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్ఎంలకు డీఈఓ ఆదేశం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. - తాండూరు తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్‌చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి. అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు.. డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. - డి.రమేష్, హెచ్ఎం, రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల -
హైస్కూల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
శివమొగ్గ : కామాంధుల అకృత్యానికి మరో ఓ విద్యాసుమం రాలిపోయింది. నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో శివమొగ్గ ప్రాంతం అట్టుడికిపోయింది. శివమొగ్గ జిల్లాలోని ఓ పట్టణంలో ముగ్గురు కామాంధులు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్తతకు గురైన విద్యార్థిని ఉడుపి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..... తీర్థహళ్లి తాలూకాకు చెందిన బాలిక (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అక్టోబరు 29న పాఠశాలకు వెళ్లడానికి బస్సుకోసం బస్టాపు వద్ద వేచి ఉన్న సమయంలో మారుతి కారులో వచ్చిన యువకుల బృందం బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించుకుపోయారు. అనంతరం తుంగా కాలేజీ వెనుకభాగంలోని అనవేరికొండ ప్రాంతంలోని నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో కొండలో ఆకులు కత్తరించే కార్మికులు సంఘటనా స్థాలానికి రావడంతో కామాంధులు బాలికను వదిలి కారులో పారిపోయారు. తీవ్రఅస్వస్తతకు గురైన బాలికను స్థానికులు విచారించి బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలిని మొదట ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, అనంతరం తీవ్ర అస్వస్ధతకు గురి కావడంతో తక్షణమే అక్కడి తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమించడంతో శివమొగ్గ ప్రభుత్వ మగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్సకు స్పందించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. దురదృష్టకర సంఘటన : పోలీస్‌శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు పరిచయం ఉన్న ఓ యువకుడు పాఠశాలలో వదిలిపెడతానని నమ్మించి కారులో పిలుచుకెళ్లి అనంతరం తన స్నేహితులతో కలిసి బాలికను బెదిరించి నిర్జీన ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో యువకులు బాలికను వదిలిపారిపోయినట్లు తెలిసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకులు తీర్థహళ్లి పట్టణానికి చెందినవారని తెలుస్తోంది, ఇందులో బాధితురాలి స్వగ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా భాగస్వాములైనట్లు సమాచారం అందడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విషయమై ఒక అనుమానుతిడి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తీర్ధహళ్లి పట్టణంలో బంద్ : హైస్కూల్ విద్యార్థిని మృతితో తీర్థహళ్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్తులు లైంగిక దాడికి పాల్పడిన యువకులకు చెందినదిగా భావిస్తున్న కారును ధ్వంసం చేశారు. శనివారం పట్టణంలో బంద్వాతావరణం కనబడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పట్టణవ్యాప్తంగా భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ.కౌశలేంద్రకుమార్ అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
ఇదేమి శిక్షణ?
మంచిర్యాల సిటీ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతోపాటు పీజీ హెచ్ఎంల కొరత అధికంగా ఉంది. దీనికి తోడు ఉన్న పీజీ హెచ్ఎంలకు ఇన్చార్జి మండల విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు ఉన్నాయి. విద్యావారోత్సవాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల అందజేత, పదో తరగతి ఇన్స్టంట్ పరీక్షలు, తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల సమయంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బిజీబిజీగా ఉంటారు. ఇంతటి విలువైన సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మారిన 9,10 తరగతుల కొత్త పాఠ్యపుస్తకాలపై పీజీ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 16 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు మండలాల వారిగా టెలికాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సమయంలో శిక్షణ సరికాదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. పదో తరగతి పరీక్షల అనంతరం సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనంకు వెళ్తారు. ఈ సమయంలోనే విద్యావారోత్సవాలు నిర్వహించాలి. 15 రోజుల్లో.. ఉన్నత పాఠశాలల్లో ఈనెల 16 తేదీ నుంచి 27 తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు ఇన్స్టంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు విద్యావారోత్సవాలు నిర్వహించాలి. మారిన 9,10 తరగతుల పాఠ్యపుస్తకాలపై ఈనెల 16 తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు టెలికాన్ఫరెన్సు ద్వారా శిక్షణ ఇవ్వడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. పదో తరగతి పరీక్షలకు, శిక్షణకు ఇక్కడ హాజరయ్యే వారంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులే. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా పోతారు. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మూడు రకాల విధుల్లో పాల్గొంటే పాఠశాల పరిస్థితి, విద్యార్థుల చదువు ఏమవుతుందో ఫలితాల కోసం ఆరాటపడే అధికారులకే తెలియాలి. ఖాళీలు.. జిల్లాలో పదోన్నతుల ప్రక్రియ 2012 జనవరిలో నిలిచిం ది. 90 శాతం ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది లేరు. పాఠశాల కార్యాలయం పనులు ఏవరో ఒక ఉపాధ్యాయుడు చేయాల్సిందే. 468 ఉన్నత పాఠశాలల్లో 356 స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికితోడుగా 38 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. మిగిలిన 430 పాఠశాలల్లో పనిచేస్తు న్న ప్రధానోపాధ్యాయుల్లో 49 మంది ఇన్చార్జి మండల విద్యాధికారులుగా పనిచేస్తున్నారు. కాగా, శిక్షణ అనేది సెలవుల సమయంలో ఉంటేనే సమంజసంగా ఉంటుం దని ఉపాధ్యాయువర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. నష్టం పదిహేను రోజులపాటు వివిధ కార్యక్రమాల పేరుతో ఉ పాధ్యాయుల, ప్రధానోపాధ్యాయులు బడికి దూరంగా ఉంటే పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. పాఠశాల అరంభంలోనే అడ్మిషన్లు రావడం సహజం. ఈ కీలక సమయంలో అరకొర ఉపాధ్యాయులచే నడు స్తున్న పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కనబడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో విద్యాశాఖకే తెలియాలి. ఈ ప రిస్థితి ప్రవేటు పాఠశాలలకు పరోక్షంగా అవకాశం ఇచ్చి నట్లవుతుందని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పీఆర్వోలను ని యమించి, వీధివీధికి బస్సులను తిప్పుతూ అడ్మిషన్లను తీసుకుంటుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ పేరిట వెళ్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అడ్మిషన్లు రావాలంటే ఎలా పస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.