హైస్కూల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
శివమొగ్గ : కామాంధుల అకృత్యానికి మరో ఓ విద్యాసుమం రాలిపోయింది. నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో శివమొగ్గ ప్రాంతం అట్టుడికిపోయింది. శివమొగ్గ జిల్లాలోని ఓ పట్టణంలో ముగ్గురు కామాంధులు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్తతకు గురైన విద్యార్థిని ఉడుపి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే..... తీర్థహళ్లి తాలూకాకు చెందిన బాలిక (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అక్టోబరు 29న పాఠశాలకు వెళ్లడానికి బస్సుకోసం బస్టాపు వద్ద వేచి ఉన్న సమయంలో మారుతి కారులో వచ్చిన యువకుల బృందం బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించుకుపోయారు. అనంతరం తుంగా కాలేజీ వెనుకభాగంలోని అనవేరికొండ ప్రాంతంలోని నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో కొండలో ఆకులు కత్తరించే కార్మికులు సంఘటనా స్థాలానికి రావడంతో కామాంధులు బాలికను వదిలి కారులో పారిపోయారు. తీవ్రఅస్వస్తతకు గురైన బాలికను స్థానికులు విచారించి బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
బాధితురాలిని మొదట ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, అనంతరం తీవ్ర అస్వస్ధతకు గురి కావడంతో తక్షణమే అక్కడి తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమించడంతో శివమొగ్గ ప్రభుత్వ మగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్సకు స్పందించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది.
దురదృష్టకర సంఘటన :
పోలీస్‌శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు పరిచయం ఉన్న ఓ యువకుడు పాఠశాలలో వదిలిపెడతానని నమ్మించి కారులో పిలుచుకెళ్లి అనంతరం తన స్నేహితులతో కలిసి బాలికను బెదిరించి నిర్జీన ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో యువకులు బాలికను వదిలిపారిపోయినట్లు తెలిసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకులు తీర్థహళ్లి పట్టణానికి చెందినవారని తెలుస్తోంది, ఇందులో బాధితురాలి స్వగ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా భాగస్వాములైనట్లు సమాచారం అందడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విషయమై ఒక అనుమానుతిడి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
తీర్ధహళ్లి పట్టణంలో బంద్ :
హైస్కూల్ విద్యార్థిని మృతితో తీర్థహళ్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్తులు లైంగిక దాడికి పాల్పడిన యువకులకు చెందినదిగా భావిస్తున్న కారును ధ్వంసం చేశారు. శనివారం పట్టణంలో బంద్‌వాతావరణం కనబడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పట్టణవ్యాప్తంగా భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్‌పీ.కౌశలేంద్రకుమార్ అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.