ప్రపంచ రికార్డు నెలకొల్పిన జియో!
ఫ్రీ ఇంటర్నెట్ అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సిమ్ సర్వీస్ జియో. మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే జియో అంచనాలకు మించి యూజర్లను సంపాదించుకుంది. కేవలం నెలరోజుల్లోనే 16 మిలియన్ల(1.6 కోట్లు) మంది సబ్ స్క్రైబర్స్ (యూజర్లు)ను సొంతం చేసుకుని జియో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు.
ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ కూడా ఈ స్థాయిలో యూజర్లను తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని ముఖేశ్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, కస్టమర్ల కోసం తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. (చదవండీ: జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!)
జియో వెలకమ్ ఆఫర్ అంటూ మై జియో యాప్ ద్వారా ప్రోమోకోడ్ పొందిన కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో జియో సిమ్స్ తీసుకోవచ్చు. డిసెంబర్ 31వరకూ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్రీ ఇంటర్ నెట్ బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ సౌకర్యాలతో మార్కెట్లోకి వచ్చిన జియో సర్వీస్ కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వాయిస్ కాల్స్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా జియోకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆగస్టులోనే మార్కెట్లోకి ట్రయల్ వర్షన్ అంటూ జియో సిమ్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా లాంచ్ చేశారు. 50 మిలియన్ల కస్టమర్లు లక్ష్యంగా పెట్టుకున్న జియో ప్రాజెక్టులో ఇప్పటికే 16 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతుంది.