
టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేశాం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టామని టీ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. ఈ ఏడాది జూలై 31 నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేశామని తెలిపింది. రాష్ట్రం లోని పాఠశాలల్లో ఓ తీరులేని విధానం ఉన్న ట్లు గుర్తించామని, కొన్ని స్కూళ్లలో టీచర్లు ఎక్కువ ఉంటే విద్యార్థులు తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి, దాన్ని సరిచేశామని వివరించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ ప్రజా ప్రయోజనాన్ని హైకోర్టు విచారిస్తుందో, ఆ లక్ష్యాన్ని తాము పూర్తి చేశామని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని మూసివేయాలని కోరింది.
తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజ మండలాల పరిధిలోని బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరగిడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1700కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలన్నింటినీ పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది.
ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మరోసారి విచారించి, అసలు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 26050 పాఠశాలలున్నాయని, వీటికి మొత్తం 112692 టీచర్ పోస్టులను కేటాయించామని (పీఈటీ, హెడ్మాస్టర్లు మినహాయించి) ఆయన తెలిపారు. ఇందులో 101731 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని, మిగిలిన 10961 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
తీసుకున్న చర్యలు...
►పాఠశాలల్లో ఓ క్రమపద్ధతిలో లేని విధానాన్ని సవరించి, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ కోసం ఈ ఏడాది జూన్ 16న జీవో 11 జారీ చేశాం.
►జీవో 11కు సమాంతరంగా ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం జీవో 12 జారీ చేశాం. దీనికి అనుగుణంగా హేతుబద్ధీకరణను పూర్తి చేసి, బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించాం. జూలై 7 నుంచి 31 వరకు కౌన్సెలింగ్ నిర్వహించాం.
►బదిలీ కౌన్సిలింగ్ సమయంలోనే కొన్ని పాఠశాలలకు అసలు టీచర్లే లేరన్న విషయాన్ని గుర్తించాం.
►దీనిని అధిగమించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది జూలై 13న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఉపాధ్యాయుల్లో జూనియర్ అయిన వ్యక్తి తను ఏ పాఠశాలలో పనిచేసి, బదిలీపై మరో చోటుకు వెళ్లాడో అతను తిరిగి తను పనిచేసిన పాఠశాలలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వరకు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశాం.
►ఖాళీలను విద్యా వలంటీర్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించాం. భర్తీ ప్రక్రియను గత నెల 21కల్లా పూర్తి చేశాం.
►ఇక మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజా మండల్లాలోని ఏడు పాఠశాలల విషయానికొస్తే, ఈ 7 పాఠశాలల్లో మొత్తం 1960 మంది విద్యార్థులుంటే, 41 టీచర్ పోస్టులను కేటాయించాం. ఇందులో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు 11 మంది, విద్యా వలంటీర్లు 11 మంది ఉన్నారు. 27.8.15న మరో 20 ఉపాధ్యాయులను ఈ పాఠశాలల్లో నియమించాం.