ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ‘వన్‌టైం స్పెషల్ యాక్టివిటీ ఫీ’ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వంతో పాటు పలు పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెషల్ ఫీజు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్‌ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
Published Tue, Feb 9 2016 3:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement