నోటిమాటతోనే మూసివేతలు | Managers worry tutorials | Sakshi
Sakshi News home page

నోటిమాటతోనే మూసివేతలు

Published Wed, Jun 15 2016 8:19 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

Managers worry tutorials

ముందస్తు   నోటీసుల్లేవు..
హైకోర్టు ఉత్తర్వులూ పట్టవు
పెద్ద స్కూళ్లను వదిలి.. మాపై  ప్రతాపమా?
ఇది కోర్టు ధిక్కారమే.. ట్యుటోరియల్స్ నిర్వాహకుల ఆందోళన

 

వేసవి సెలవులన్నాళ్లు మీనమేషాలు లెక్కించి.. తీరా పాఠశాలలు తెరిచే రోజు గుర్తింపు పేరుతో తనఖీలు.. సీజ్‌లంటూ హడావుడి చేస్తున్న అధికార యంత్రాంగం ఆ ముసుగులో ట్యుటోరియల్స్‌పై ప్రతాపం చూపుతోంది. పెద్ద స్కూళ్లు.. కార్పొరేట్ సంస్థలు గుర్తింపు లేకుండానే యథేచ్ఛగా ఫీజుల దోపిడీకి.. క్లాసుల నిర్వహణకు పాల్పడుతుంటే నోటీసులతో సరిపుచ్చుతున్న సర్కారు.. చిన్న స్కూళ్లు.. పొట్టకూటి కోసం ట్యుటోరియల్ కేంద్రాలు నడుపుకొంటున్న వారిని ఏటా పాఠశాలలు తెరిచే సమయంలో వేధిస్తోంది. ట్యుటోరియల్స్ నడుపుకోవచ్చన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్న అధికారుల తీరుపై ట్యుటోరియల్స్ నిర్వాహకులు అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖపట్నం:హైకోర్టు ఆదేశాలున్నా తమ పాఠశాలలను మూసివేస్తున్నారంటూ ఏపీ ప్రైవే టు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోం ది. తమ ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా  విద్యాశాఖ, టాస్క్‌ఫోర్సు అధికారులు సీజ్ చేస్తున్నారని అసోసియేషన్ సభ్యు లు ఆవేదన చెందుతున్నారు. ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ 1982 సెక్షన్ 2(47) ప్రకా రం ట్యూటోరియల్స్ స్కూళ్లను నడుపుకోవడానికి 2010లో హైకోర్టు అనుమతించిందని అసోసియేషన్ సభ్యులు మంగళవారం ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు వీరు సాక్షి కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తామంతా పెద్దపెద్ద భవనాల్లో కాకుండా ఇళ్లలోనే స్కూళ్లను నడుపుకుంటున్నామన్నారు. అందువల్ల తమను స్కూళ్ల మాదిరిగా గుర్తించడం లేదన్నారు. అయితే ఏటా విద్యాశాఖాధికారులు పాఠశాలలు తెరిచే సమయంలో వేధింపులకు గురిచేస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ వెనక్కి తగ్గుతున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా గుర్తింపు లేని ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేస్తున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా తమ ట్యుటోరియల్స్‌ను కూడా మూసివేస్తున్నారని ఆరోపించారు.


ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. పైగా నెలన్నర రోజుల క్రితం తేదీతో నోటీసులు ఇప్పుడే ఇచ్చి.. ఆ వెంటనే మూసివేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ట్యూటోరియల్ స్కూల్‌లో 100 నుంచి 150 మంది పిల్లలు చదువుతున్నారని చెప్పారు. విద్యాశాఖ అధికారుల చర్యతో తమ స్కూళ్లలో చదువుతున్న పిల్లలతోపాటు తాము, టీచర్లు కూడా వీధిన పడతామని, పిల్లలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 110 ట్యూటోరియల్స్ భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. అతి తక్కువ ఫీజులతో పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. తమ ట్యూటోరియల్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

 

 రిజిస్ట్రేషన్‌కు అవకాశమివ్వాలి

 తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ట్యూటోరియల్స్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఇవ్వాలి. అసంఘటిత రంగంలో ఉన్న వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం కోరికను మా ట్యుటోరియల్స్ తీరుస్తున్నాయి. సేవాభావంతో మంచి విద్య అందిస్తున్నాం. చట్టవ్యతిరేకంగా కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు మేమంతా ట్యూటోరియల్స్‌ను నడుపుతున్నాం. - స్వరూప్, హన్నా ట్యూటోరియల్స్, ఆదర్శనగర్

 

ట్యుటోరియల్స్‌తో ఉపాధి పొందుతున్నాం..
ట్యుటోరియల్స్ పెట్టి పిల్లలకు విద్యనందిస్తూ మేం కూడా ఉపాధి పొందుతున్నాం. మా ట్యుటోరియల్స్ నడపడానికి హైకోర్టు ఆదేశాలున్నా ఏటా విద్యాశాఖాధికారులు వేధిస్తున్నారు. గుర్తింపు లేదంటూ సీజ్ చేసిన మా ట్యుటోరియల్స్‌ను తక్షణమే తెరవాలి. అడ్మిషన్ల వేళ ఇలా హడావుడి చేసి మమ్మలను ఇబ్బంది పెట్టడం అన్యాయం. దీనిపై మేమంతా కోర్టును ఆశ్రయిస్తాం. -ఎం.డి.ఆలీఖాన్, శ్రీరాం ట్యుటోరియల్స్, ఊర్వశి జంక్షన్

 

తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నాం..
మా దగ్గర చదివే పిల్లలకు తక్కువ ఫీజులతోనే విద్యను అందిస్తున్నాం. 100 శాతం మంచి ఫలితాలే సాధిస్తున్నాం. చట్టప్రకారమే మా స్కూళ్లను నడుపుతున్నాం. మేం గుర్తింపు పొందని స్కూళ్ల జాబితాలోకి రాము. కానీ మాకు ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే మా ట్యూటోరియల్స్‌ను మూసేస్తున్నారు. దీనివల్ల మా వద్ద చదివే పిల్లల తల్లిదండ్రులకు మా స్కూళ్లపై అనుమానం కలుగుతుంది.

-కె.లక్ష్మి, శ్రీవిఘ్నేశ్వరా ట్యూటోరియల్స్, పెయిందొరపేట

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement