Tutorials
-
కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు
న్యూఢిల్లీ: కేన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్లైన్లో అంకాలజీ ట్యుటోరియల్ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించింది. టాటా మెమొరియల్ సెంటర్ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఈ ఆన్లైన్ కోర్సులోని వీడియోలు https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. -
నోటిమాటతోనే మూసివేతలు
ముందస్తు నోటీసుల్లేవు.. హైకోర్టు ఉత్తర్వులూ పట్టవు పెద్ద స్కూళ్లను వదిలి.. మాపై ప్రతాపమా? ఇది కోర్టు ధిక్కారమే.. ట్యుటోరియల్స్ నిర్వాహకుల ఆందోళన వేసవి సెలవులన్నాళ్లు మీనమేషాలు లెక్కించి.. తీరా పాఠశాలలు తెరిచే రోజు గుర్తింపు పేరుతో తనఖీలు.. సీజ్లంటూ హడావుడి చేస్తున్న అధికార యంత్రాంగం ఆ ముసుగులో ట్యుటోరియల్స్‌పై ప్రతాపం చూపుతోంది. పెద్ద స్కూళ్లు.. కార్పొరేట్ సంస్థలు గుర్తింపు లేకుండానే యథేచ్ఛగా ఫీజుల దోపిడీకి.. క్లాసుల నిర్వహణకు పాల్పడుతుంటే నోటీసులతో సరిపుచ్చుతున్న సర్కారు.. చిన్న స్కూళ్లు.. పొట్టకూటి కోసం ట్యుటోరియల్ కేంద్రాలు నడుపుకొంటున్న వారిని ఏటా పాఠశాలలు తెరిచే సమయంలో వేధిస్తోంది. ట్యుటోరియల్స్ నడుపుకోవచ్చన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్న అధికారుల తీరుపై ట్యుటోరియల్స్ నిర్వాహకులు అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం:హైకోర్టు ఆదేశాలున్నా తమ పాఠశాలలను మూసివేస్తున్నారంటూ ఏపీ ప్రైవే టు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోం ది. తమ ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా విద్యాశాఖ, టాస్క్ఫోర్సు అధికారులు సీజ్ చేస్తున్నారని అసోసియేషన్ సభ్యు లు ఆవేదన చెందుతున్నారు. ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ 1982 సెక్షన్ 2(47) ప్రకా రం ట్యూటోరియల్స్ స్కూళ్లను నడుపుకోవడానికి 2010లో హైకోర్టు అనుమతించిందని అసోసియేషన్ సభ్యులు మంగళవారం ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు వీరు సాక్షి కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తామంతా పెద్దపెద్ద భవనాల్లో కాకుండా ఇళ్లలోనే స్కూళ్లను నడుపుకుంటున్నామన్నారు. అందువల్ల తమను స్కూళ్ల మాదిరిగా గుర్తించడం లేదన్నారు. అయితే ఏటా విద్యాశాఖాధికారులు పాఠశాలలు తెరిచే సమయంలో వేధింపులకు గురిచేస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ వెనక్కి తగ్గుతున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా గుర్తింపు లేని ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేస్తున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా తమ ట్యుటోరియల్స్‌ను కూడా మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. పైగా నెలన్నర రోజుల క్రితం తేదీతో నోటీసులు ఇప్పుడే ఇచ్చి.. ఆ వెంటనే మూసివేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ట్యూటోరియల్ స్కూల్లో 100 నుంచి 150 మంది పిల్లలు చదువుతున్నారని చెప్పారు. విద్యాశాఖ అధికారుల చర్యతో తమ స్కూళ్లలో చదువుతున్న పిల్లలతోపాటు తాము, టీచర్లు కూడా వీధిన పడతామని, పిల్లలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 110 ట్యూటోరియల్స్ భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. అతి తక్కువ ఫీజులతో పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. తమ ట్యూటోరియల్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశమివ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ట్యూటోరియల్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఇవ్వాలి. అసంఘటిత రంగంలో ఉన్న వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం కోరికను మా ట్యుటోరియల్స్ తీరుస్తున్నాయి. సేవాభావంతో మంచి విద్య అందిస్తున్నాం. చట్టవ్యతిరేకంగా కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు మేమంతా ట్యూటోరియల్స్‌ను నడుపుతున్నాం. - స్వరూప్, హన్నా ట్యూటోరియల్స్, ఆదర్శనగర్ ట్యుటోరియల్స్‌తో ఉపాధి పొందుతున్నాం.. ట్యుటోరియల్స్ పెట్టి పిల్లలకు విద్యనందిస్తూ మేం కూడా ఉపాధి పొందుతున్నాం. మా ట్యుటోరియల్స్ నడపడానికి హైకోర్టు ఆదేశాలున్నా ఏటా విద్యాశాఖాధికారులు వేధిస్తున్నారు. గుర్తింపు లేదంటూ సీజ్ చేసిన మా ట్యుటోరియల్స్‌ను తక్షణమే తెరవాలి. అడ్మిషన్ల వేళ ఇలా హడావుడి చేసి మమ్మలను ఇబ్బంది పెట్టడం అన్యాయం. దీనిపై మేమంతా కోర్టును ఆశ్రయిస్తాం. -ఎం.డి.ఆలీఖాన్, శ్రీరాం ట్యుటోరియల్స్, ఊర్వశి జంక్షన్ తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నాం.. మా దగ్గర చదివే పిల్లలకు తక్కువ ఫీజులతోనే విద్యను అందిస్తున్నాం. 100 శాతం మంచి ఫలితాలే సాధిస్తున్నాం. చట్టప్రకారమే మా స్కూళ్లను నడుపుతున్నాం. మేం గుర్తింపు పొందని స్కూళ్ల జాబితాలోకి రాము. కానీ మాకు ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే మా ట్యూటోరియల్స్‌ను మూసేస్తున్నారు. దీనివల్ల మా వద్ద చదివే పిల్లల తల్లిదండ్రులకు మా స్కూళ్లపై అనుమానం కలుగుతుంది. -కె.లక్ష్మి, శ్రీవిఘ్నేశ్వరా ట్యూటోరియల్స్, పెయిందొరపేట -
‘కోచింగ్’పై కొరడా
ప్రతి శిక్షణ కేంద్రానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ వారంలోనేప్రారంభం.. ఆ తరువాత ప్రత్యేక వెబ్సైట్ విద్యా చట్టం, జీవో 200 అమలుకు ప్రభుత్వం చర్యలు నిబంధనలు పాటించాల్సిందే టీచర్లు, అధ్యాపకులు ఈ శిక్షణ కేంద్రాల్లో పనిచేయడానికి వీల్లేదు హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎంసెట్, ఐసెట్, క్యాట్, గేట్... ఇలా ఏ ఉద్యోగ, ప్రవేశపరీక్షలకైనా శిక్షణ ఇస్తామంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ కేంద్రాలు, ట్యుటోరియల్స్ల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు ప్రతి కోచింగ్ కేంద్రం కూడా విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని అన్నిరకాల కోచింగ్ కేంద్రాల నియంత్రణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లుగా అధికారులెవరూ పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం-1982ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. దీంతోపాటు ఆ చట్టంలోని నిబంధనలకు లోబడి 1997 ఆగస్టు 6న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో) 200లోని (ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్ ఇనిస్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెగ్యులేషన్స్) నిబంధనల అమలుకు ఏర్పాటు చేసింది. ప్రతి కోచింగ్ కేంద్రం మీసేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నుంచి అనుమతి రాగానే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలో ప్రత్యేక వెబ్సైట్ కోచింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీటిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అందులో కొత్తగా వస్తున్న ప్రతి కోచింగ్ కేంద్రం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్రతి శిక్షణ సంస్థ రూ. 1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తేలనున్న లెక్క రిజిస్ట్రేషన్ ద్వారా కోచింగ్ కేంద్రాల సంఖ్యతోపాటు ఎన్ని రకాల కోచింగ్ కేంద్రాలు ఉన్నాయన్న వివరాలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ తరువాత వాటిలో సదుపాయాలు, అమలు చేయాల్సిన నిబంధనలపై దృష్టి పెట్టనుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ చేయించుకోని శిక్షణాసంస్థల నిర్వాహకులపై చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం.. కేసులు నమోదు చేసి, కోర్టు ద్వారా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధన అమలుకు చర్యలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. అన్ని అంశాల తనిఖీ.. విద్యాచట్టం-1982, జీవో 200లోని నిబంధనల ప్రకారం పాఠశాల విద్య, కళాశాల విద్య మినహా ఇతరత్రా శిక్షణ ఇచ్చే ప్రతి కోచింగ్ కేంద్రం, స్కూల్, కాలేజీలు ట్యుటోరియల్ కిందకే వస్తాయి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరూ అలాంటి శిక్షణలు ఇవ్వడానికి వీల్లేదు. స్కూళ్లు, కాలేజీల్లోనే పనిచేయాలి. ఆ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో తాము శిక్షణ ఇవ్వనున్న, ఇచ్చే కోర్సుల వివరాలు, కల్పించే మౌలిక సదుపాయాలు, శానిటరీ సదుపాయాల (జిల్లా ఆరోగ్య అధికారి ఇచ్చిన సర్టిఫికెట్ తదితరాల) వివరాలన్నీ తెలియజేయాలి. వీటిపై డీఈవో ఆధీనంలోని మరో అధికారి స్వయంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాకే.. ఆ శిక్షణా సంస్థను రిజిస్టర్డ్ సంస్థగా గుర్తించాలా? లేదా? అన్నది నిర్ధారిస్తారు. తనిఖీ సందర్భంగా సదుపాయాలతో కూడిన భవనాలు ఉన్నాయా, ప్రతి తరగతికి గది ఉందా, ఫీజుల విధానం ఏమిటి, ఆర్థిక అవకతవకలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతారు. -
ట్యూషన్లు చెబితే డిస్మిస్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఇకమీదట ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ, ఎయిడెడ్ పీయూ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం బర్తరఫ్ చేయనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ రామేగౌడ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అధ్యాపకులతో పాటు ప్రిన్సిపాళ్లు ట్యూషన్లు చెబితే సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. నోటిఫికేషన్‌ను అనుసరించి తనిఖీలను నిర్వహించి ఈ నెల 30లోగా జిల్లా విద్యాశాఖాధికారులు, బ్లాక్ విద్యాశాఖాధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ నివేదిక ఆధారంగా ట్యూషన్లు చెబుతున్నది వాస్తవమేనని తేలితే సంబంధిత అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. అధ్యాపకులు ట్యుటోరియల్స్‌తో కలసి లేదా సొంత ఇంటిలో లేదా వేరే భవనంలో ట్యూషన్లు చెబుతుంటే తనిఖీలు నిర్వహించి నివేదికలను ఇవ్వాల్సిందిగా సూచించారు. కాగా ఇటీవల ట్యూషన్ మాఫియాను అరికట్టడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. కొందరు అధ్యాపకులు డ్యూటీ వేళల్లో కూడా ట్యూషన్లు చెప్పడం పరిపాటిగా మారింది. కొందరు కాలేజీలకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. కొందరు ప్రైవేట్ సంస్థలతో కలసి ట్యూషన్లు చెబుతున్నారు. ఈ పరిణామాల వల్ల పీయూ కళాశాలల్లో ఏటా ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతూ వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.