‘కోచింగ్’పై కొరడా
ప్రతి శిక్షణ కేంద్రానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఈ వారంలోనేప్రారంభం..
ఆ తరువాత ప్రత్యేక వెబ్‌సైట్
విద్యా చట్టం, జీవో 200 అమలుకు ప్రభుత్వం చర్యలు
నిబంధనలు పాటించాల్సిందే
టీచర్లు, అధ్యాపకులు ఈ శిక్షణ కేంద్రాల్లో పనిచేయడానికి వీల్లేదు
హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎంసెట్, ఐసెట్, క్యాట్, గేట్... ఇలా ఏ ఉద్యోగ, ప్రవేశపరీక్షలకైనా శిక్షణ ఇస్తామంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ కేంద్రాలు, ట్యుటోరియల్స్‌ల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు ప్రతి కోచింగ్ కేంద్రం కూడా విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని అన్నిరకాల కోచింగ్ కేంద్రాల నియంత్రణకు రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నాళ్లుగా అధికారులెవరూ పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం-1982ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అన్వయించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. దీంతోపాటు ఆ చట్టంలోని నిబంధనలకు లోబడి 1997 ఆగస్టు 6న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో) 200లోని (ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్ ఇనిస్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెగ్యులేషన్స్) నిబంధనల అమలుకు ఏర్పాటు చేసింది. ప్రతి కోచింగ్ కేంద్రం మీసేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ పూర్తి చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నుంచి అనుమతి రాగానే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది.
త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్
కోచింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదట మీ సేవ కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీటిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. అందులో కొత్తగా వస్తున్న ప్రతి కోచింగ్ కేంద్రం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్రతి శిక్షణ సంస్థ రూ. 1,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
తేలనున్న లెక్క
రిజిస్ట్రేషన్ ద్వారా కోచింగ్ కేంద్రాల సంఖ్యతోపాటు ఎన్ని రకాల కోచింగ్ కేంద్రాలు ఉన్నాయన్న వివరాలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ తరువాత వాటిలో సదుపాయాలు, అమలు చేయాల్సిన నిబంధనలపై దృష్టి పెట్టనుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ చేయించుకోని శిక్షణాసంస్థల నిర్వాహకులపై చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం.. కేసులు నమోదు చేసి, కోర్టు ద్వారా ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధన అమలుకు చర్యలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.
అన్ని అంశాల తనిఖీ..
విద్యాచట్టం-1982, జీవో 200లోని నిబంధనల ప్రకారం పాఠశాల విద్య, కళాశాల విద్య మినహా ఇతరత్రా శిక్షణ ఇచ్చే ప్రతి కోచింగ్ కేంద్రం, స్కూల్, కాలేజీలు ట్యుటోరియల్ కిందకే వస్తాయి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరూ అలాంటి శిక్షణలు ఇవ్వడానికి వీల్లేదు. స్కూళ్లు, కాలేజీల్లోనే పనిచేయాలి. ఆ నిబంధనను పక్కాగా అమలుచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ సమయంలో తాము శిక్షణ ఇవ్వనున్న, ఇచ్చే కోర్సుల వివరాలు, కల్పించే మౌలిక సదుపాయాలు, శానిటరీ సదుపాయాల (జిల్లా ఆరోగ్య అధికారి ఇచ్చిన సర్టిఫికెట్ తదితరాల) వివరాలన్నీ తెలియజేయాలి. వీటిపై డీఈవో ఆధీనంలోని మరో అధికారి స్వయంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాకే.. ఆ శిక్షణా సంస్థను రిజిస్టర్డ్ సంస్థగా గుర్తించాలా? లేదా? అన్నది నిర్ధారిస్తారు. తనిఖీ సందర్భంగా సదుపాయాలతో కూడిన భవనాలు ఉన్నాయా, ప్రతి తరగతికి గది ఉందా, ఫీజుల విధానం ఏమిటి, ఆర్థిక అవకతవకలు ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలన జరుపుతారు.