సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఇకమీదట ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ, ఎయిడెడ్ పీయూ కళాశాలల అధ్యాపకులను ప్రభుత్వం బర్తరఫ్ చేయనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ రామేగౌడ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అధ్యాపకులతో పాటు ప్రిన్సిపాళ్లు ట్యూషన్లు చెబితే సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. నోటిఫికేషన్‌ను అనుసరించి తనిఖీలను నిర్వహించి ఈ నెల 30లోగా జిల్లా విద్యాశాఖాధికారులు, బ్లాక్ విద్యాశాఖాధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ నివేదిక ఆధారంగా ట్యూషన్లు చెబుతున్నది వాస్తవమేనని తేలితే సంబంధిత అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు.
అధ్యాపకులు ట్యుటోరియల్స్‌తో కలసి లేదా సొంత ఇంటిలో లేదా వేరే భవనంలో ట్యూషన్లు చెబుతుంటే తనిఖీలు నిర్వహించి నివేదికలను ఇవ్వాల్సిందిగా సూచించారు. కాగా ఇటీవల ట్యూషన్ మాఫియాను అరికట్టడం ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. కొందరు అధ్యాపకులు డ్యూటీ వేళల్లో కూడా ట్యూషన్లు చెప్పడం పరిపాటిగా మారింది.
కొందరు కాలేజీలకు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు. కొందరు ప్రైవేట్ సంస్థలతో కలసి ట్యూషన్లు చెబుతున్నారు. ఈ పరిణామాల వల్ల పీయూ కళాశాలల్లో ఏటా ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతూ వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.