సాక్షి, సిటీబ్యూరో: కొత్త విద్యా సంవత్సరం ఆరంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. బడి గంటలు గణగణ మోగాయి. ఇంటివద్ద ఆటపాటలతో సరదాగా గడిపిన పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం ఉదయం నుంచే రోడ్లపై సందడి కనిపించింది. విద్యాసంస్థలు గల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఆగుతూ, సాగుతూ ముందుకు సాగాయి. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ వరకు దిగబెట్టారు.
సర్కారు బడుల బలోపేతానికి కృషి
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈఓ రోహిణి, ఆర్‌డీఓ మహిపాల్, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ విశ్వనాథం గుప్తా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment