జేబులు గుల్ల! | telangana sarkar to vat on people | Sakshi
Sakshi News home page

జేబులు గుల్ల!

Published Mon, Mar 9 2015 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

జేబులు గుల్ల!

జేబులు గుల్ల!

ఆదాయం పెంపుపై రాష్ట్ర సర్కారు దృష్టి
 వస్త్రాలు, బంగారం, సిగరెట్లపైనా వ్యాట్ మోత
 విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం
 బడ్జెట్ తర్వాత పెంచాలని సర్కారు యోచన
 వసూళ్లను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం
 కార్పొరేట్ ఆస్పత్రులు, ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి
 వచ్చే ఏడాది వాణిజ్య శాఖకు రూ. 39,000 కోట్ల లక్ష్యం
 నిరుటి కంటే రూ. 15,000 కోట్లు అదనం..
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై పన్ను పోటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయం పెంచుకునే మార్గాన్వేషణలో పడిన టీఆర్‌ఎస్ సర్కారు.. వస్త్ర పరిశ్రమ, బంగారం, సిగరెట్లతో పాటు విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం మోపాలని యోచిస్తోంది. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై పన్నుల భారమేమీ లేదు. గతంలో వ్యాట్ విధించినా.. వస్త్ర వ్యాపారుల ఆందోళనతో రాష్ట్ర విభజనకు ముందే కాంగ్రెస్ సర్కారు ఎత్తివేసింది. అయితే ఇప్పుడు వస్త్ర పరిశ్రమపై ఐదు శాతం పన్ను విధించాలని సర్కారు భావిస్తోంది. దీంతో పాటు బంగారంపై ఉన్న ఒక శాతం పన్నును ఐదు శాతానికి పెంచాలని, సిగరెట్లపై ఇరవై శాతం ఉన్న పన్నును మరింతగా పెంచాలని యోచిస్తోంది. ఇక రెస్టారెంట్లు, స్పాలు, షాపింగ్ మాల్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగా స్టోర్‌లపై పన్ను మరింత పెంచాలని భావిస్తోంది. అంతేగాకుండా పన్నుల వసూలును మరింత కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యసేవలకు ఇబ్బడి ముబ్బడి చార్జీలు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు పన్నుల ఎగవేతలో మొదటి స్థానంలో ఉన్నాయని.. వీటి నుంచి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్కారు యోచిస్తోంది.
 
 ఆ తర్వాతే..
 
 ఎంతమేరకు పన్ను పెంచాలి, ఏయే వస్తువులు, సేవలపై పెంచాలనే విషయంలో స్పష్టత లేకున్నా.... పన్నులు పెంచటం ఖాయమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటికే వెల్లడించారు. ఆయన సారథ్యంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వివిధ రాష్ట్రాల్లో పన్నుల తీరుపై అధ్యయనం చేస్తోంది. అయితే ఈ నెల 11న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కొత్త పన్నుల విషయాన్ని ప్రస్తావించకుండా... తర్వాతే పన్ను పోటు వేయాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చే సిఫారసుల ఆధారంగా పన్నుల పెంపు, సవరణ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలపై పన్నుల భారం పడకుండా, సంపన్న, వ్యాపార వర్గాలను లక్ష్యంగా ఎంచుకొని కొంత మేర పన్నులు పెంచడం తప్పనిసరని అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ భేటీలో తీర్మానించినట్లు సమాచారం.


 పెంచక తప్పని పరిస్థితి..


 గత ఏడాది ఆదాయ వ్యయాల స్థితిగతుల్లోని డొల్లతనం ఈ సారి బడ్జెట్ తయారీ సమయంలో బయటపడింది. దీంతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు రాకపోవటం, తెలంగాణను ఆర్థిక సంఘం మిగులు రాష్ట్రంగా గుర్తించటం, అదనంగా రుణ పరిమితి పెరగకపోవటం, గత ఏడాది భూముల అమ్మకంపై ఆశించిన ఆదాయం రాకపోవటం వంటి అంశాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఇరకాటంలో పడింది. మిగులు రాష్ట్రమని సంబురపడాలో, అంచనాలకు తగినట్లుగా ఆదాయం లేదని చింతించాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది.
 
 గాడిలో పెట్టాల్సిందే..
 
 ఆదాయం తెచ్చే మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యయాన్ని నియంత్రించే చర్యలు చేపడితే తప్ప రాష్ట్ర ఆర్థిక పురోగతి గాడిలో పడే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే సర్కారును అప్రమత్తం చేసింది. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలోనే ఆశల పల్లకీ నుంచి దిగివచ్చి, ఆర్థిక వ్యవహారాల్లో వాస్తవాలను గుర్తించింది. ఆదాయం తెచ్చి పెట్టాల్సిన విభాగాలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై ఇటీవల వివిధ శాఖలతో చర్చల సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని గత బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.  కానీ జనవరి నెలాఖరు వరకు కేవలం రూ. 18,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వ్యవధిలో కనీసం మరో రూ. 6,000 కోట్లు ఆదాయం రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ లెక్కన చూసినా మొత్తంగా రూ. 24,000 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.
 
 
 భారీ అంచనా ‘మోత’కేనా?
 సర్కారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వాస్తవ రాబడి అయిన 24,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 15 వేల కోట్లు ఎక్కువ. సాధారణ వృద్ధి రేటు ప్రకారం ఏటా పది నుంచి ఇరవై శాతం వరకు పన్నుల ఆదాయం పెరుగుతుందనేది వాణిజ్య పన్నుల శాఖ అంచనా. ప్రభుత్వం ఎంచుకున్న ఆదాయ లక్ష్యాన్ని చూస్తే.. సాధారణంగా పెరిగేది పోను మరో రూ. 8 వేల కోట్లు అదనంగా సంపాదించాలనేది సర్కారు ధ్యేయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement