సాక్షి, సంగారెడ్డి: ఇందిరమ్మ గృహనిర్మాణ లబ్ధిదారులపై ప్రభుత్వం ఎట్టకేలకు కరుణ చూపింది. సుమారు ఏడాదికాలంగా నిలిచిన ఇందిరమ్మ బిల్లులను చెల్లించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగానే సాధారణ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం కొలువుదీరిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గూడులేని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇందిరమ్మ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులపై గత ఆరుమాసాలుగా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులపై ఇక్కట్లు గమనించి బిల్లుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది.
దశలవారీగా బిల్లుల చెల్లింపులు
సర్కార్ తాజా నిర్ణయంతో అధికారులు ఇందిరమ్మ బిల్లుల చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ, ఇతర పథకాల ఎంపికైన ఇళ్లను గుర్తించే పనిని హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం గ్రామాల వారీగా సర్వే పనులు ప్రారంభించారు. హౌసింగ్ డీఈల ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారు నిర్మించిన ఇళ్లు ఏ దశలో ఉన్నాయో రికార్డు చేయనున్నారు. బేస్‌మెంట్, లింటల్ లెవల్, రూఫ్‌లెవల్ ఇలా వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలను గుర్తించి దశల వారీగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయనున్నారు.
49వేల ఇళ్లకు బిల్లులు చెల్లించే అవకాశం
జిల్లాలో 49 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అధికారులు ఆయా ఇళ్ల నిర్మాణం పనులకు సంబంధించి సర్వే జరిపి దశల వారిగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నారు. జిల్లాకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 1,88,440 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 49,682 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం హౌసింగ్ అధికారులు 49,682 గృహాలను సర్వే చేసి దాని ఆధారంగా బిల్లులు చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ. లక్ష, బీసీ లబ్ధిదారులకు రూ.70 వేలు చెల్లిస్తారు. దీంతో ప్రస్తుతం వివిధదశల్లో 49 వేల ఇళ్లకు సుమారు రూ.300 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా.
అనర్హులుగా తేలితే ఇళ్లు రద్దు?
ఇందిరమ్మ గృహ నిర్మాణం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సర్కార్, ఇళ్ల బిల్లుల చెల్లింపుకోసం చేపట్టనున్న సర్వేలో సైతం లబ్ధిదారులు అనర్హులుగా తేలిన పక్షంలో ఇంటిని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.