సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్త: తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు
శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. బయటవారి కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ అసత్య ప్రచారం చేస్తు న్నారని ఆరోపిం చారు. కాగా, తన నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు తన నియోజకవర్గంలో తక్కువగా ఉందని, ఈసారి 75 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని అనుచరులు, కార్యకర్తలను కోరారు. వచ్చేనెల 10న సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని, కార్యకర్తలు 75 వేల కంటే తక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తనను అవమానించినట్లే అవుతుందని, ఈ సభ్యత్వ నమో దును బట్టి తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
21న సోనియా, రాహుల్‌లతో బహిరంగ సభ
కాగా, మార్చి 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంగారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ఏంటో ఆ సభలో వెల్లడిస్తానన్నారు.
యూపీ ఎన్నికల తర్వాతే!
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అపాయింట్‌మెంట్ లభించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున అవి ముగిసిన తర్వాతే జగ్గారెడ్డికి 10 జన్‌పథ్ నుంచి పిలుపు రావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డికి అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే రాహుల్ కార్యాలయానికి సమాచారం వెళ్లగా, నేడో రేపో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హైకమాండ్‌కు లేఖ రాయనున్నారు.
పార్టీ ఎమ్మెల్యేకు సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇప్పించాలని కోరు తూ సీఎల్పీ పక్షాన ఆయన లేఖ రాయనున్నట్టు సమాచారం. అయితే, 15 రోజుల పాటు వేచి చూస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. తన మనసు మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యలు చెపుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలను కలిసేంతవరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరికి అనుకున్న పదవులు రాకపోతే, మళ్లీ పార్టీని చీల్చే కార్యక్రమం చేస్తారని, అప్పుడు కాంగ్రెస్‌నే నమ్ముకున్న తనలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఎవరిని ఉద్దేశించి జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment