సంగారెడ్డి డివిజన్ : తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో మెతుకుసీమను అగ్రస్థానంలో నిలబెట్టాలని మంత్రి హరీష్‌రావు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సర్వే పేరుతో పింఛన్లు, ఇళ్లు రద్దు చేస్తారంటూ కొంతమంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, సర్వే వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. సర్వేను విజయవంతం చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
ఉద్యోగం, విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి పాస్‌పోర్టు జిరాక్స్ పత్రులు తీసుకుని వారి వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటింటి సర్వేపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జికలెక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, సర్వే సందర్భంగా ఉత్తమ ఫలితాలను కనబర్చే అధికారులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు. ముగ్గురు ఉత్తమ అధికారులను ఎంపిక చేసి వారికి రూ.10వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో మరెక్కడా నిర్వహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే స్పష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
దీనికితోడు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దరి చేరాలంటే కుటుంబాల వివరాలు ఉండాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నెల 19నఇంటింటి సర్వేకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సర్వే రోజున ప్రజలంతా ఇళ్లలోనే ఉండి తమ వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలను సమగ్రంగా తెలియజేయాలన్నారు. సర్వే జరిగే రోజున తాను కూడా ఇంట్లోనే ఉంటానని, వివరాల సేకరణ పూర్తయ్యాక ఉద్యోగుల వెన్నంటి ఉంటానని తెలిపారు. సర్వే జరిగే రోజున వైన్స్ దుకాణాలను మూసివేసే అంశంపై సీఎంతో మాట్లాడతానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
32 మందితో సర్వే: ఇన్‌చార్జి కలెక్టర్ శరత్
జిల్లాలోని 8.25 లక్షల కుటుంబాలను సర్వే చేసేందుకు 32 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వివరించారు. నిబంధనలకు అనుగుణంగా సర్వే చేయాలని, ఉద్యోగులు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశాల్లో పూర్తిస్థాయిలో స్థిరపడిన వారి వివరాలను సేకరించాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధి, విద్య కోసం విదేశాలకు వెళ్లిన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
19న నిర్వహించనున్న సర్వేకు ముందు 17న ప్రీ సర్వే ఉంటుందని అధికారులు, ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సర్వే నిర్వహించే 19వ తేదీన పరిశ్రమలకు సెలవు ప్రకటించాలని యాజమాన్యాలకు సూచించినట్లు చెప్పారు. అనంతరం డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి సర్వే నిర్వహించాల్సిన తీరు, పాటించాల్సిన నిబంధన ల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సర్వే ఫాం ఎలా పూర్తి చేయాలో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సదస్సులో భాగంగా మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఇంటింటి సర్వే పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సర్వేపై ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాలను మంత్రి హరీష్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. సదస్సులో టీఎన్జీఓ అధ్యక్షులు రాజేందర్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా సర్వే చేయండి
Published Sat, Aug 9 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement