ఖమ్మం: ‘ప్రజలను మోసం చేయడం.. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. అడ్డుగా ఉన్న వారిని బెదిరించడం.. అన్ని తన కుటుం బానికే అందాలని చూడటం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పని’ అని... ఇలా రాష్ట్రంలో దగాకోరు పాలన సాగుతోందని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత తొలిసారి సోమవా రం జిల్లాకు వచ్చిన భట్టి విక్రమార్కను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అధికారంలోకి వచ్చిన పదినెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఖ్యాతి సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. తాను, తన కుటుంబం చక్కగా ఉంటే సరిపోతుందనే ఆలోచనతో పాలిస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమవుతోందన్నారు. నూతన ప్రభుత్వం అయినందున పది నెలల గడువు ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత కూడా కాంగ్రెస్‌దే అని అన్నారు.