శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయంలో నీటిమట్టం శనివారం సాయంత్రానికి కనిష్ట స్థాయికి (854 అడుగులకు) చేరింది. జలాశయంలో నీటినిల్వలు తరిగిపోతున్నప్పటికీ తెలంగాణ సర్కార్ శనివారం వరకు విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. రాయలసీమ
ప్రాంతంలోని ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ తదితర ప్రాంతాల నుంచి వివిధ కాల్వలకు నీటిని సరఫరా చేయాలంటే శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని శ్రీశైలంలో ఉంచాలని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
శుక్రవారం నుంచి శనివారం వరకు తెలంగాణ జెన్‌కో జలాశయంలోని 9,863 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 5.061 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 700 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డిమాండ్‌ను అనుసరించి శనివారం ఉదయం తెలంగాణ జెన్‌కో 3 గంటల పాటు రెండు జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 89.2900 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌లో నీటిమట్టం రాయలసీమ వ్యవసాయ అవసరాల కనిష్టస్థాయి నీటిమట్టం 854 అడుగులకు చేరింది.