కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు మూడుదశాబ్దాల పోరాటం ఫలించినట్లయింది. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొంతఊరట కలిగింది. ఈ మేరకు ఇటీవల ప్రాజెక్టుల ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం దక్కింది.
వివరాల్లోకెళ్తే..1982లో శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో మనజిల్లాలో సుమారు 60గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కాగా, అప్పట్లో పరిహారంతోపాటు, ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తామని 1986లో జీఓ నెం.98ను ప్రభుత్వం జారీచేసింది. దీంతో నిర్వాసితులంతా గ్రామా లు, పొలాలను వదిలి వెళ్లిపోయారు. కానీ ఇచ్చిన జీఓను అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో బాధితులు చేయని పోరాటమంటూ లేదు. ఇక నిర్వాసితుల్లో ఇప్పటికే చాలామంది చనిపోగా ప్రస్తుతం వారి వారసులు ఉన్నారు.
అప్పట్లో 400మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉండగా, గతేడాది నాటికి 205 మందికి పైగా మిగిలారు. వారిలోనైనా అందరికీ ఉద్యోగాలు కల్పించారా..అంటే అదీ లేదు. వీరిలో 158మందికే అర్హత ఉందని ఎంపికచేసి, మిగిలిన 47మందిని జాబితాలో నుంచి గతేడాది తొలగించారు. ఇక ఎంపికచేసిన వారిలో 146మందికి కర్నూలు జిల్లాలో ఉద్యోగ అవకాశం కల్పించారు. మరో 11మందిని వెయిటింగ్ జాబితాలో ఉంచగా, తిరస్కరణకు గురైన 47మంది నిత్యం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టేవారు. ఇలా ఎన్నోరోజులుగా వారి ఆవేదనలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు ఫలితం దక్కింది.
కలెక్టర్ చొరవతో అవకాశం
బాధితుల ఆందోళనలు చూసిన జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వారికి ఉద్యోగావకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. స్పందించిన ప్రభుత్వం ఆ మేరకు వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న 58మందితో పాటు, ఇంకా ఎవరికైనా అర్హత ఉంటే వారికి సైతం ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితా ఎస్‌ఈ కార్యాలయంలో సిద్ధమవుతుండగా, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి మరో ఒకటి రెండు రోజుల్లో రానున్నట్లు తెలిసింది. కలెక్టర్ ఆమోదంతో జాబితా ప్రభుత్వం చెంతకు వెళ్లనుంది.
ఫలించిన పోరాటం
Published Wed, Aug 21 2013 1:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement