ముంపు భూములపై బడా పెత్తనం!
శ్రీశైలం ముంపు భూముల్లోపాగా వేసిన పెద్ద రైతులు
వారి ఆధీనంలోనేవందలాది ఎకరాలు
కౌలుకు ఇస్తూ సొమ్ముచేసుకుంటున్న వైనం
సన్నకారు రైతులకు ఇవ్వనిసాగు అవకాశం
గ్రామాల్లో నిత్యం ఘర్షణలు చోద్యం చూస్తున్న
రెవెన్యూ అధికారులు
పెబ్బేరు: శ్రీశైలం ముంపు భూముల్లో బడారైతులు పాగావేశారు. ఏటా కృష్ణానదిలో నీట్టిమట్టం తగ్గిన సమయంలో ఒక్కొక్కరూ 30నుంచి 50 ఎకరాలను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. మరికొందరు సన్నకారు రైతులకు కౌలుకు ఇస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ఇతరులకు విక్రయించుకుంటున్నారు. ఈ భూముల సాగువిషయంలో చిన్నకారురైతులను దగ్గరకు రానివ్వకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జిల్లాలో 65 గ్రామాలు, 42,203 ఎకరాల భూములు కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో కలిసిపోయాయి. ప్రభుత్వం ఈ భూములకు పరిహారం కూడా చెల్లించింది.
పెబ్బేరు మండలంలో ఈర్లదిన్నె, బూడిదపాడు, గుమ్మడం, తిప్పాయిపల్లి, చిన్నగుమ్మడం, యాపర్ల తదితర గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాల ముంపు భూములు ఉన్నాయి. ఏటా కృష్ణానది నీటిమట్టం వేసవికాలంలో తగ్గిపోయినప్పుడు, వర్షాలు సక్రమంగా కురవని సమయం, ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్యలో ఈ ముంపు భూములుతేలి ఖాళీగా ఉంటాయి. ఈ భూముల్లో కొందరు బడారైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఇవి పూర్తిగా సారవంతమైన నల్లరేగడి భూములు కావడంతో ఎక్కువమంది పప్పుశనగ, పొద్దుతిరుగుడు, సొరకాయ, మినము తదితర పంటలు వేస్తున్నారు. ఈ భూముల్లో సాగునీటి అవసరం తక్కువగా ఉండడం, సారవంతమైన నేలలు కావడంతో పోటాపోటీ పెరిగింది. పైగా కొందరు బడారైతులు ముంపు భూములతో పాటు పక్కనే భూములను సైతం ఆక్రమించుకుని పంటలు పండించుకుంటున్నారు.
ముంపు భూములతో వ్యాపారాలు
మండలంలోని తిప్పాయిపల్లి, గుమ్మడం, ఈర్లదిన్నె, బూడిదపాడు, యాపర్ల తదితర గ్రామాల్లో ముంపు భూములపై కొందరు బడారైతులు వ్యాపారం మొదలుపెట్టారు. ఈ భూములు వాస్తవానికి ప్రభుత్వ పరిధిలో ఉన్నా వాటిని ఇతర రైతులకు విక్రయించడం, కౌలుకు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా సాదాకాగితాలపై రాసి ఇచ్చి ఎకరాకు రూ.20 నుంచి రూ.50వేలకు వరకు విక్రయిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎకరాకు రూ.15 నుంచి రూ.25వేల వరకు కౌలుకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా..బడా రైతులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముంపు గ్రామాల్లో ఘర్షణలు
తిప్పాయిపల్లిలో సుమారు 863ఎకరాలకు పైగా ముంపు భూములు ఉన్నాయి. వాటిలో అధికశాతం భూములు బడారైతుల ఆధీనంలో ఉండడంతో స్థానిక చిన్నరైతులకు సాగుచేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. పైగా, బడారైతులు తెలివిగా వారికింద పనిచేసేవారికి ఇస్తున్నారు. కొందరు నలుగురు ఐదుగురిని కలుపుకుని పంటలో సగభాగం పంచుకుంటున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఒకరే సాగుచేస్తుండడంతో చిన్నరైతులు దీనిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని అడిగితే దౌర్జన్యానికి దిగుతుండడంతో గ్రామాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
పేదరైతులకు అవకాశం ఇవ్వాలి..
శ్రీశైలం ముంపు భూములను గ్రామంలోని రైతులందరికీ సమానంగా పంపిణీచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ముంపు భూములను కొందరు రైతులు సొంత పట్టాభూముల్లాగా ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నారు. పేదరైతులకు కూడా అవకాశం ఇవ్వాలి.- మాల జమ్మన్న, రైతు, తిప్పాయిపల్లి