సాక్షి, హైదరాబాద్ :పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండుకుండలుగా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2,13,486 క్యూసెక్కులు చేరుతుండగా..ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 40,259 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 855.80 అడుగుల్లో 94.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 121 టీఎంసీలు అవసరం. ఇదేరీతిలో వరద ప్రవాహం మరో వారం రోజులపాటు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి విడుదల చేసిన వరద ప్రవాహం చేరుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 559.40 అడుగులకు చేరుకుంది.
ప్రస్తుతం 230.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ఎగువన తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీలు నిండిపోవడంతో భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సింగటలూరు బ్యారేజీ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌లో 66.96 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. డ్యామ్ నిండాలంటే ఇంకా 34 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో మరో ఆరు రోజులు కొనసాగితే డ్యామ్ నిండుతుంది. అప్పర్ కృష్ణ, అప్పర్ తుంగభద్ర బేసిన్‌లలో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు కనీసం వారం నుంచి పది రోజులు ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీలు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్ నుంచి 9 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో నాలుగు రోజుల్లో (శనివారం వరకు) అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి 6 టీఎంసీల నీరు తరలిపోయింది. మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఆ వరద నీరు కలుస్తున్నది.
ఇన్‌ఫ్లో 19,844 క్యూసెక్కులు..
లక్ష్మీ పంపుహౌస్ నుంచి సరస్వతీ బ్యారేజీకి 19,844 క్యూసెక్కుల ఇ¯Œ ఫ్లో వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 9.47 టీఎంసీల నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 119 ఎఫ్‌ఆర్‌ఎల్ కాగా ప్రస్తుతం 118.40 ఎఫ్‌ఆర్‌ఎల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment