ఎండలు తీవ్రంగా మండిపోతున్న తరుణంలోనే ‘ప్రతి నీటిచుక్కని ఒడిసి పట్టండి. వదలద్దు’ అంటూ రాజకీయ నాయకులు, పెద్దలు, సంస్కర్తలు తెగ ఘోషించారు. మొన్న వానల వేళ చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి ఇంకా అనేక నదుల్లోపడి అనేక లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఎన్ని చుక్కలైతే ఒక క్యూసెక్ అవుతుందో కదా?! వీటిని ఒడిసిపట్టే సామర్థ్యం ప్రస్తుతం మనకి లేదు. నిలవచేసే జలాశయాలు మనకి లేవు. అరవై ఏళ్ల క్రితం సంకల్పించి కల్పించిన నాగార్జున సాగర్ తర్వాత అంతటి జలాశయం మనకి రానే లేదు. కొండల మధ్య చేసిన గొప్ప వ్యూహ రచన శ్రీశైలం డ్యామ్. ‘జలమే బలం. బలమే జలం’ అని జనం నమ్మేవాళ్లు.
గ్రామ నిర్మాణం జరిగినప్పుడే ఊరికి నాలుగుపక్కలా నాలుగు చెరువులను తగిన పరిమాణంలో తీర్చిదిద్దేవారు. తాగునీటి కోసం అత్యంత పరిశుభ్రమైన చెరువు ఊరికి తూరుపు దిక్కున ఉండేది. తెల్లారుతూనే నిత్యం సూర్యోదయం ఆ చెరువులోనే విచ్చుకునేది. నీళ్ల కావిళ్ల బుడబుడలు, ఆవు మెడ గంటల చప్పుళ్లు, పక్షుల కిలకిలారావాలు ముప్పేటగా తూరుపు చెరువున ప్రతిధ్వనించేవి. అవి కరువు కాటకాలెరుగని మంచి రోజులు. అనాది నించీ మనిషి ప్రతిభాశాలి. ప్రజ్ఞాశీలి. ఉన్నంతలో అవసరానికి తగినట్టు తెలివిని ఉపయోగించి చాకచక్యంగా బతికేవాడు. వర్షానికి చెరువు పొంగితే నీరు వృథా కాకుండా చేప జెల్ల వెళ్లిపోకుండా ఏర్పాటుండేది. ప్రతి చెరువుకి, వాగుకి ‘కోడు’ ఉండేది. కోడంటే అదనపు నిల్వ సామర్థ్యం. ఆనాడు కేవలం రైతు అవసరాలకు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. నీటి ప్రాధాన్యతని మన పురాణాలు కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయ్.
శివుడు గంగని తలమీద పెట్టుకున్నాడంటే దాని అంతరార్థం గ్రహించాలి. జీవించిన వారికి మాత్రమే కాదు. గతించిన వారికి కూడా దాహార్తి ఉంటుందని, పెద్దల దాహాన్ని పిన్నలు మంత్రోక్తంగా తీర్చాలని నిర్దేశిస్తున్నాయ్. పంచభూతాలూ సృష్టికి మూలం. వాటిలో నీరు అత్యంత ప్రాణప్రదమైంది. ప్రతి మానవ అంకురానికి అమ్మకడుపే మహా విశ్వం. అక్కడి నీళ్లమీద తేలియాడుతూ కొత్త మొలక సర్వశక్తులూ కూడ తీసుకుంటుంది. పుడుతూనే వర్ణ లింగ భేదాలతో నవజాత శిశువు నేలకు దిగుతుంది. భూమిని, ఆకాశాన్ని, సమాజాన్ని వీలైనంత మేర కైవసం చేసుకునే ప్రయత్నం చేయడమే తన జీవిత లక్ష్యంగా రోజులు గడుపుతుంది. సృష్టిలో భూమి ఎంతో ఆకాశం అంత. ఆకాశం నీళ్లని పైకి తీసుకుని మళ్లీ కిందికి వర్షిస్తుంది–పర్యావరణాన్ని పాడు చేయనంతవరకు. అశోకుడు చెరువులు తవ్వించాడని, చెట్లు నాటించాడనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. పూర్వం పెద్ద రైతులు తమవంతుగా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో సొంత చెరువులు తవ్వించేవారు. నీళ్ల కరువు వస్తే అవి ఆదుకొనేవి. రాను రాను నేలకి రెక్కలొచ్చాయ్. ఊరి ఆలయంలో విధిగా ఉండే తటాకాలు కనుమరుగయ్యాయి.
రైతుల భూముల్లో చెరువులు పోయి చదరంత కుంటలు మిగిలాయి. ‘ఏదో శాస్త్రానికి...’ అన్నట్టు చాలా సదాచారాలను మిగుల్చుకున్న దురదృష్టవంతు లం మనం. తర్వాత పెద్ద రైతులు మాకేంపని, అదంతా రాజుగారి పని అన్నారు. రాజు తీయించిన చెరువులు ఇప్పుడిప్పుడు మాయమై, అక్కడ మహా భవనాలు వెలిశాయి. ఇదీ నిజం కథ. రాను రాను నీళ్ల కరువు, నీళ్ల భయం పట్టుకుంది. ఆ మధ్య ‘ఇంకుడు గుంటలు ఇంటింటా’ అంటూ ఓ నినాదం తెచ్చారు. అదొక పెద్ద ఫార్సు. ఎక్కడా నీళ్లింకిన దాఖలాలు లేవు. ‘మా ఏరియాలో ఎంత లోతుకి వెళ్లినా తడి తగలడం లేదండీ. ఆఖరికి పెట్రోల్ తగిలేట్టుంది’ అని ఒకాయన వేష్ట పడ్డాడు. ఇంతకీ మళ్లీ మొదటికి వస్తే– ఒడిసిపట్టడం అనేది ఒక మిథ్య, ఒక మాయ. మనం ప్రస్తుతం సముద్రాలమట్టం పెంచుతున్నాం. మనకిప్పుడు కావల్సింది మాటలకోర్లు కాదు. వీలుంటే నలుగురు కాటన్ దొరలు, సాధ్యమైతే నలుగురు మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు.
వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Comments
Please login to add a commentAdd a comment