ప్రతీకాత్మక చిత్రం
చేతులు మారిన అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్నవారికే రీఅసైన్డ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం జిల్లాలో కేవలం పది మండలాలకు మాత్రమే వర్తించనుంది. రీ అసైన్డ్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా రూపొందించిన నిబంధనల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను చేర్చకపోవడంతో ఆ పరిధిలోకి వచ్చే 17 మండలాలకు ఈ అవకాశం చేజారనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 5180 ఎకరాల మేర అసైన్డ్ భూములు చేతులు మారగా.. అందులో రెండు వేలకు పైగా ఎకరాల్లో మాత్రమే రీ అసైన్డ్ చేసే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎటువంటి జీవనాధారమూ లేని పేదలకు ప్రభుత్వం గతంలో భూములను పంపిణీ చేసింది. భూమిలేని నిరుపేదలకు మాత్రమే వీటిని అసైన్డ్ చేసింది. అయితే, కాలగమనంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు.. కుటుంబ అవసరాలరీత్యా మరికొంత మంది ఈ భూములను అమ్ముకున్నారు. ఇలా చేతులు మారిన భూముల్లో కొన్నిచోట్ల బడాబాబులు పాగా వేశారు. కొన్ని భూములు మాత్రం మరికొందరు పేదల చేతుల్లోకి వెళ్లాయి. పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) చట్టం ప్రకారం అసైన్డ్ భూములు పరాధీనమైతే స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన భూములను వెనక్కి తీసుకుంది.
3705.02 ఎకరాలు స్వాధీనం
జిల్లావ్యాప్తంగా 87,064.35 ఎకరాలను పేదలను పంపిణీ చేశారు. ఇందులో సుమారు 3705.02 ఎకరాల మేర సంపన్నవర్గాలు, బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ముఖ్యంగా నగర శివార్లలో విలువైన ఈ భూములపై కన్నేసిన పెద్దలు తమ విలాసాలకు కేంద్రాలుగా మలుచుకున్నారు. ఫామ్‌హౌస్, రిసార్టులు నిర్మించడమేగాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఈ భూములను రెవెన్యూ యంత్రాంగం వెనక్కి తీసుకుంది.
పది మండలాలకే పరిమితం!
భూ రికార్డుల ప్రక్షాళనతో పరాధీనమైన అసైన్డ్ భూముల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఏయే భూములు ఎవరి ఆక్రమణల్లో ఉన్నాయనేది తేలింది. ఈ క్రమంలో పీఓటీ చట్టానికి విరుద్ధంగా పాగా వేసిన వారి భూముల వివరాలను సేకరించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 5180 ఎకరాల మేర భూములు చేతులు మారినట్లు గుర్తించింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను కొనుగోలు చేసిన భూముల్లేని పేదల పేరిట రీఅసైన్డ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గతేడాది 31వ తేదీ నాటికి ఆయా భూముల్లో కబ్జా ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రీఅసైన్డ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది.
కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయం మన జిల్లాలో సంపూర్ణంగా అమలు కావడం లేదు. గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. భూముల పంపిణీ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పలు కేసులు నడుస్తుండడంతో శివారు మండలాలకు రీ అసైన్డ్ వర్తించదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాని పది మండలాలు కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, మంచాల, యాచారం(పార్ట్), ఫరూఖ్‌నగర్(పార్ట్), కడ్తాల్‌లో మాత్రమే భూముల రీఅసైన్డ్‌కు వీలు కలుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment