job oppurtunity
-
కప్పట్రాళ్ల రూపు రేఖలు మార్చేస్తా
కప్పట్రాళ్ల(ఆలూరు రూరల్): రాష్ట్రంలోనే కక్ష్యల కుంపటిగా మారిన కప్పట్రాళ్ల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. దత్తత గ్రామంలో ఆదివారం ఆయన ఐదు గంటల పాటు పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు లేని గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారితో ఎస్పీ చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన వివిధ సంఘటనలతో కప్పట్రాళ్ల గ్రామం ఫ్యాక్షన్‌గా పేరుగాంచిందన్నారు. ఈ ఫ్యాక్షన్ కక్ష్యలకు ఎంతోమంది అమాయకులు బలయ్యారని చెప్పారు. ప్రతిక్షణం గ్రామ ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగించారని, మున్ముందు అలాంటి వాతావరణం చోటు చేసుకోకుండా ఈ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలో పిల్లల విద్యాభివృద్ధికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా ఐక్యతతో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి నడుం బిగింలించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఫ్యాక్షన్ కక్ష్యలకు బలైన కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్ముందు కక్ష్యలను విడనాడి శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామంలో త్వరలో రహస్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు, అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి గ్రామ ప్రశాంతతను నెలకొల్పేందుకు తమవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. గ్రామంలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట డోన్ డీయస్పీ పీఎన్ బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, దేవనకొండ ఎస్ఐ మోహన్‌కిషోర్ తదితరులు ఉన్నారు. ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తతకు తీసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. -
అగ్రి పాలిటెక్నిక్‌తో ఉపాధి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పూర్తైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులు వర ంగా మారాయి. రెండేళ్ల కోర్సు చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో ఈ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయంపై మక్కువ ఉన్నవారు, రైతుబిడ్డలు మరిం తగా వ్యవసాయ విజ్ఞానాన్ని పొంది, సాగుచేసే పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతోంది. ఈ కోర్సు చేసిన తర్వాత, ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ(అగ్రికల్చర్)లో చేరవచ్చు. బీఎస్సీ అగ్రి కల్చర్‌లో డిప్లొమా చేసిన వారికి 10 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు వివిధ రకాల పంటలు పండించే విధానం, పంటలకు ఆశించే తెగుళ్లు, క్రిమికీటకాలపై శాస్త్రవేత్తలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో శిక్షణతోపాటు, గ్రామాలు సందర్శించి, అక్కడి రైతులతో చర్చాగోష్టులు నిర్వహించాల్సి ఉంటుంది. రెండో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ‘పొలాస’ రాష్ట్రంలో మొదటి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో ఉండగా, రెండో కళాశాల జిల్లాలోని పొలాసలో 1996లో ఏర్పాటుచేశారు. ఈ కళాశాలలో ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు అభ్యసించగా, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడగా, మిగతా 30 శాతం మంది ప్రైవేట్ రంగాల్లో టెక్నికల్ అసిస్టెంట్లుగా, ఫీల్డ్ సూపర్వైజర్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. సీట్ల వివరాలు దరఖాస్తులను బట్టి సీట్లను కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్‌లో 21 ప్రభుత్వ కాలేజీల్లో 700 సీట్లు, 17 ప్రైవేట్ కాలేజీల్లో 1,020 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండు ప్రభుత్వ కాలేజీల్లో 85 సీట్లు, మూడు ప్రైవేట్ కాలేజీల్లో 150 సీట్లు ఉన్నాయి. అలాగే మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమాలో మూడు ప్రభుత్వ కళాశాలల్లో 90 సీట్లు, 8 ప్రైవేట్ కాలేజీల్లో 240 సీట్లు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ 2014 విద్యా సంవత్సరానికిగాను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌కుమార్ గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండేళ్ల పాలిటెక్నిక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు సంబంధించి పదో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. ఇంటర్, ఆపైన చదువులు చదివిన వారు అనర్హులు. ఆగస్టు 31, 2014 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. పదో తరగతిలో జనరల్ విద్యార్థులు 5.0 గ్రేడ్, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు 4.0 గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ వచ్చినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు జనరల్ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.200 ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపేందుకు జూలై 2, 2014 ఆఖరు తేదీగా ఉంది. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ గిగిగి.ఊఎఖఅ్ఖ.అఇ.ఐూ, పొలాస వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించవచ్చు. -
ఫలించిన పోరాటం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎట్టకేలకు మూడుదశాబ్దాల పోరాటం ఫలించినట్లయింది. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొంతఊరట కలిగింది. ఈ మేరకు ఇటీవల ప్రాజెక్టుల ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం దక్కింది. వివరాల్లోకెళ్తే..1982లో శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో మనజిల్లాలో సుమారు 60గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కాగా, అప్పట్లో పరిహారంతోపాటు, ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తామని 1986లో జీఓ నెం.98ను ప్రభుత్వం జారీచేసింది. దీంతో నిర్వాసితులంతా గ్రామా లు, పొలాలను వదిలి వెళ్లిపోయారు. కానీ ఇచ్చిన జీఓను అమలుచేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో బాధితులు చేయని పోరాటమంటూ లేదు. ఇక నిర్వాసితుల్లో ఇప్పటికే చాలామంది చనిపోగా ప్రస్తుతం వారి వారసులు ఉన్నారు. అప్పట్లో 400మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉండగా, గతేడాది నాటికి 205 మందికి పైగా మిగిలారు. వారిలోనైనా అందరికీ ఉద్యోగాలు కల్పించారా..అంటే అదీ లేదు. వీరిలో 158మందికే అర్హత ఉందని ఎంపికచేసి, మిగిలిన 47మందిని జాబితాలో నుంచి గతేడాది తొలగించారు. ఇక ఎంపికచేసిన వారిలో 146మందికి కర్నూలు జిల్లాలో ఉద్యోగ అవకాశం కల్పించారు. మరో 11మందిని వెయిటింగ్ జాబితాలో ఉంచగా, తిరస్కరణకు గురైన 47మంది నిత్యం కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టేవారు. ఇలా ఎన్నోరోజులుగా వారి ఆవేదనలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఎట్టకేలకు ఫలితం దక్కింది. కలెక్టర్ చొరవతో అవకాశం బాధితుల ఆందోళనలు చూసిన జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వారికి ఉద్యోగావకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. స్పందించిన ప్రభుత్వం ఆ మేరకు వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న 58మందితో పాటు, ఇంకా ఎవరికైనా అర్హత ఉంటే వారికి సైతం ఇవ్వనున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితా ఎస్ఈ కార్యాలయంలో సిద్ధమవుతుండగా, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి మరో ఒకటి రెండు రోజుల్లో రానున్నట్లు తెలిసింది. కలెక్టర్ ఆమోదంతో జాబితా ప్రభుత్వం చెంతకు వెళ్లనుంది.