కప్పట్రాళ్ల రూపు రేఖలు మార్చేస్తా | can change the course | Sakshi
Sakshi News home page

కప్పట్రాళ్ల రూపు రేఖలు మార్చేస్తా

Published Mon, Feb 23 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

can change the course

 కప్పట్రాళ్ల(ఆలూరు రూరల్): రాష్ట్రంలోనే కక్ష్యల కుంపటిగా మారిన కప్పట్రాళ్ల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. దత్తత గ్రామంలో ఆదివారం ఆయన ఐదు గంటల పాటు పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు.  సమస్యలు లేని గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారితో ఎస్పీ చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన వివిధ సంఘటనలతో కప్పట్రాళ్ల గ్రామం ఫ్యాక్షన్‌గా పేరుగాంచిందన్నారు. ఈ ఫ్యాక్షన్ కక్ష్యలకు ఎంతోమంది అమాయకులు బలయ్యారని చెప్పారు.
 
  ప్రతిక్షణం గ్రామ ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగించారని, మున్ముందు అలాంటి వాతావరణం చోటు చేసుకోకుండా ఈ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలో పిల్లల విద్యాభివృద్ధికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా ఐక్యతతో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి నడుం బిగింలించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఫ్యాక్షన్ కక్ష్యలకు బలైన కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్ముందు కక్ష్యలను విడనాడి శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు.
 గ్రామంలో త్వరలో రహస్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు, అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
 
 అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి గ్రామ ప్రశాంతతను నెలకొల్పేందుకు తమవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. గ్రామంలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట డోన్ డీయస్పీ పీఎన్ బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, దేవనకొండ  ఎస్‌ఐ మోహన్‌కిషోర్ తదితరులు ఉన్నారు. ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తతకు తీసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement