సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరైన శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టాలకు దిగువన సైతం నీటిని తోడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోంది. దీనికి తెలంగాణ పూర్తి వ్యతిరేకంగా ఉన్నా... తన తాగునీటి అవసరాలను ముందుపెట్టి నీటిని తీసుకుంటామంటూ ఏపీ పట్టుబడుతోంది. ఈ అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధ కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలతో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా సమావేశమై చర్చించారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
సరిపెట్టుకోవాలని సూచించినా...
గత నెల రెండో వారంలో తాగునీటి అవసరాల కోసం చేసిన విజ్ఞప్తి మేరకు 790 అడుగుల కనీస నీటిమట్టం వద్ద లభ్యతగా ఉన్న 11.24 టీఎంసీల్లో 6.5 టీఎంసీలు తెలంగాణ, 4.5 టీఎంసీలు ఏపీ వాడుకోవడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు అంగీకరించింది. అయితే ఇప్పటికే తనకు కేటాయించిన మేర నీటిని వాడేసుకున్న ఏపీ... ఇప్పుడు శ్రీశైలంలో 790 కనీస మట్టానికి దిగువకు వెళ్లి అయినా కొంత నీటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమకు వచ్చే మూడు నెలల కాలానికి మరో 6 టీఎంసీలు అవసరమని చెబుతోంది. తక్షణమే ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని కోరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 790 అడుగులపైన 4.06 టీఎంసీల వినియోగర్హమైన నీరు మాత్రమే ఉంది. ఇది పూర్తిగా తెలంగాణకు కేటాయించిన నీరే. దాంతో 790 అడుగుల దిగువన నీటిని తీసుకుంటామని కోరుతోంది.
ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ
నీటి వినియోగంపై సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావులతో బోర్డు కార్యదర్శి భేటీ అయ్యారు. 790 అడుగుల దిగువన నీటిని తీసుకుంటే బురద ఉంటుందని తెలంగాణ సూచించింది. ఏపీ మాత్రం కనీస నీటిమట్టం దిగువన 6 నుంచి 7 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అం దుకు అనుగుణంగా మోటార్లను కిందకి దించాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే దీనికి తెలంగాణ అంగీకారం తెలపలేదని సమాచారం. ప్రభుత్వంతో చర్చించి తమ అభిప్రాయాన్ని చెప్పిన తెలంగాణ అధికారులు అనంతరం శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమయ్యారు.
దిగువ నీళ్లూ తీసుకుంటాం!
Published Tue, Apr 5 2016 4:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement