∙వినియోగించుకుంటే ప్రయోజనాలెన్నో
∙రూ.2 లక్షలకు పెరిగిన రుణ పరిమితి
∙అన్నదాతలకు తెలియ కుండా పోయిన వైనం!
∙అవగాహన కల్పించని శాఖ అధికారులు
మంచిర్యాల అగ్రికల్చర్ : అన్నదాత ఆత్మబంధువుగా నిలవాల్సిన రైతుబంధు పథకం.. వారికి దూర బంధువు అవుతుంది. కష్టకాలంలో కడదాకా తోడుండాల్సిన ఈ ఆర్థిక తోడ్పాటు అవకాశం.. వారి దరి చేరకుండానే ఉంటోంది. ధర ఉండి పంట చేతికి రాని సమయంలోనైనా.. దిగుబడి వచ్చి ధర లేని పరిస్థితుల్లో అయినా ఆదుకునే రైతుబంధు పథకం.. అవగాహన లేమి కారణంగా రైతులకు వినియోగంలో ఉండడం లేదు. ఈ విషయంలో రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వంద మందిలోపే రైతులు రైతు బంధు పథకంలో చేరారంటే.. ఈ పథకంపై ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
పథకం ద్వారా రైతులకు లబ్ధి
వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలో పండించిన పంటలకు మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నప్పడు పంటలను అమ్ముకుని నష్టపోకుండా.. కొంత కాలం ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచి ఆశించిన ధర వచ్చినప్పుడు అమ్ముకొని లాభం పొందుటకు రైతుబంధు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మార్కెట్ యార్డుల్లో అమ్ముకునే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన ధీమా ఇవ్వడానికి బీమా సౌకర్యం సైతం ఉంది. ఇలాంటి బృహత్తర పథకం అమలు బాధ్యత మార్కెట్ కమిటీలపైన ఉంటుంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర లభింపచేయడంలో మార్కెట్ కమిటీల కార్యదర్శులు, ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ప్రాంతీయ అధికారులపై ఉంటుంది. ఈ పథకం కోసం పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ఉపయోగపడనుంది. రైతులు మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచినా సరుకుల విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా పొందవచ్చు. గతంలో గరిష్టంగా లక్ష పరిమితి ఉన్న రుణ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పెంచింది. సరుకులు నిల్వ ఉంచుకొని, ఇలా రుణాలను తీసుకున్నా రైతులకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు. కొత్తగా రూపొందించినా విధి విధానాల్లో భాగంగా రైతుబంధు కార్డు 5 సంవత్సరాలకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి.
ఈ పథకం ద్వారా లాభాలు
వరి, మొక్కజొన్న, కంది, పెసర, జొన్న తదితర ఉత్పత్తులు రైతుబంధు పథకంలో స్థానం కల్పించారు. రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తున్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం ఉంది. రైతు రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు.
►రైతులు పండించిన పంటను మార్కెట్‌కు తరలించిన సమయంలో సరైన ధర లేదని భావిస్తే తొమ్మిది నెలల పాటు గోదాములో నిల్వ చేసుకోవచ్చు.
►డివిజన్ కేంద్రాల్లో ఉండే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో కూడా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది.
►రైతులు నిల్వ ఉంచిన పంటలకు పూర్తి భద్రతతో పాటు బీమా సౌకర్యం కలదు.
► అయితే ఇక్కడ నిల్వ ఉంచే ధాన్యానికి నామమాత్రపు ఫీజు వసూలు చేసి వివరాలతో కూడిన గేట్ పాస్ అందజేస్తారు.
► మార్కెట్ యార్డుల పరిధిలోని గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ ఉంచుకున్న మూడు నెలల కాలానికి గానూ ఎలాంటి రుసుము తీసుకోరు.
►180 రోజుల నుంచి 270 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనికి గానూ రైతు నుంచి 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
► 270 రోజులు దాటితే రైతులకు నోటీసు ద్వారా తెలియజేసి నిల్వ ఉంచినా సరుకుల్ని, వేలం ద్వారా అమ్మి, వచ్చినా మొత్తం నుంచి గోదాము అద్దె, బీమా రుసుము, చెల్లించవలసినా వడ్డీ మినహాయించుకొని మిగతా మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు.
►వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో తగినా నిల్వ సదుపాయాలు లేనప్పడు, సరుకులతో నిండినప్పుడు ఎక్రిడేషన్ చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, లేదా రాష్ట్ర గిడ్డంగులు, లేదా సెంట్రల్ వేర్ హౌసింగ్ సంస్థల గోదాములు, శీతల గిడ్డంగులలో కూడా నిల్వ చేసుకొన్నా వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు వీలుగా మారకం చేయగల గిడ్డంగి రశీదులు తీసుకొని రుణాలను పొందవచ్చు.
►రైతు నిల్వ ఉంచిన ధాన్యానికి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకు 75 శాతం మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. లేదా రూ.2 లక్షల వరకు గరిష్ట పరిమితికి లోబడి ఏది తక్కువైతే దానిని ఎలాంటి భూమికి సంబంధించి దస్తావేజులు తనఖా పెట్టకుండానే రుణం పొందవచ్చు.
►మూడు నెలల్లోపు ఎప్పుడైనా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.
బీమా సౌకర్యం
►రైతులు పండించిన పంటను మార్కెట్‌కు తరలిస్తున్న క్రమంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మార్కెట్ కమిటీ నుంచి రూ.లక్ష ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. రైతుతో పాటు హమాలీలు, దడువాయి(ధాన్యం తూకం వేసే వ్యక్తుల)లకు ప్రమాదం జరిగి మరణిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సౌకర్యం ఉంది. ఈ బీమా 18 నుంచి 60 ఏళ్ల రైతులకు వర్తిస్తుంది.
►మార్కెట్ తీసుకువచ్చిన సమయంలో ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం పొందిన రైతుకు రూ.75 వేల వరకు బీమా వర్తిస్తుంది.
►ప్రమాదంతో పాక్షికంగా అంగవైకల్యం కలిగితే రూ.25 వేల వరకు పొందవచ్చు.
►రైతు పండించిన అన్ని రకాల పంటల(సోయా, వేరుశనగ, «శనగ, వడ్లు, పెసర, బబ్బెర, కందులు, పొద్దుతిరుగుడు, ఆముదం, మొక్కజొన్న, ఉలవలు)కు బీమా సౌకర్యం వర్తిస్తుంది.
►రైతు ధాన్యాన్ని వరసుగా మూడు సార్లు ఆయా మార్కెట్ యార్డుల్లో అమ్మినట్లు తక్‌పట్టి కలిగి ఉండాలి.
►ఒక క్వింటాలు నుంచి ఎంత ధాన్యం అమ్మినా పథకం వర్తిస్తుంది.
►రైతు తాను పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలిస్తుండగా, తరలించిన తర్వాత, మార్కెట్ ప్రాంతంలో మరణించినా బీమా డబ్బులు చెల్లిస్తారు.
►ప్రమాదం జరిగిన రోజే రైతు కుంటంబానికి రూ.లక్ష నగ అందజేస్తారు.
రైతు బంధు.. దూరబంధువు!
Published Fri, Jan 13 2017 11:10 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement