పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ యార్డులో నీట మునిగిన ధాన్యం
సాక్షి నెట్‌వర్క్: పట్టపగలే కారుమబ్బులు.. వందల ఏళ్లనాటి వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేసే ప్రచండ గాలులు.. ఉరుము లేని పిడుగులా కాలం కాని కాలంలో కుండపోత! గురువారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైంది. చాలాచోట్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి నేలరాలింది. గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం, పిడుగుల ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు.
వరంగల్ అతలాకుతలం
వర్షానికి వరంగల్ అతలాకుతలమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలుమార్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. 163 జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్‌లో కరెంటు వైర్లపై గాలికి కొట్టుకువచ్చిన రేకులు, ఫ్లెక్సీలు పడ్డాయి. దీంతో నిప్పులు చెలరేగాయి. చెట్టు కూలి పడడంతో స్టేషన్‌లో సిగ్నలింగ్ గది కూలిపోయింది. దీంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో సుమారు ఐదు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో టూరిస్టు బస్సుపై పిడుగు పడటంతో బస్సు అద్దాలు పగిలాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలో రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రైతుల కష్టం వర్షార్పణం
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, జీసీసీ కేంద్రాలకు తెచ్చారు. కొనుగోలు ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడంతో అన్నిచోట్ల ఆరు బయటే ధాన్యం ఆరబోశారు. చాలినన్ని టార్ఫాలిన్ కవర్లు లేవు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. చాలాచోట్ల వరదలో కొట్టుకుపోయింది. ఏనుమాముల మార్కెట్‌లో భారీ షెడ్డు కూలిపోవడంతో ఆరబోసిన మక్కలు తడిశాయి. పైకప్పు కూలే సమయంలో రైతులు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్క ఈ మార్కెట్‌లోనే పది వేల మిర్చి బస్తాలు తడిశాయి.
పరకాల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలు, వడ్లు కలిపి సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, మాడ్గుల, షాబాద్ తదితర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల, మోమిన్‌పేట, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3,500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్‌లో ఆరపోసిన 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల వరి ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లిలో మామిడి రైతులు నష్టపోయారు. నల్లగొండ మార్కెట్‌లో కాంటా వేసిన ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 55,000 వరి ధాన్యం బస్తాలు తడిశాయి.
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో గాలివాన ధాటికి కూలిన షెడ్
Comments
Please login to add a commentAdd a comment