ఆగని ‘మిర్చి’ సెగలు
సాక్షి, ఖమ్మం/లీగల్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 28న జరిగిన ఆందోళన, విధ్వంసం చేసిన ఘటనలో పది మంది రైతులను త్రీటౌన్ పోలీసులు ఆదివారం ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం చిరుమర్రికి చెందిన మండెపుడి ఆనందరావు, బాణాపురానికి చెందిన నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, కల్లూరు మండలం లక్ష్మీపురంతండాకు చెందిన ఇస్రాల బాలు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లికి చెందిన భుక్యా అశోక్, ఏన్కూరు మండలం శ్రీరామపురంతండాకు చెందిన భుక్యా నర్సింహారావు, తిరుమలాయపాలెం మండలం బచ్చోడుతండాకు చెందిన భూక్యాశ్రీను, బానోతు సైదులు, కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజావత్ భావ్‌సింగ్, నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన బానోతు ఉపేందర్‌లను ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఎన్. అమరావతి ఎదుట హాజరు పరచగా, వారికి మే 11 వరకు రిమాండ్ విధించారు.
వీరిలో ఏ–2ముద్దాయి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పరారీలో ఉన్నట్లు చూపించారు. కాగా, రైతులపై సెక్షన్లు 147(దాడి చేయటానికి వెళ్లడం), 148(మారణ ఆయుధాలతో దాడి చేయటం), 353(ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం), 427(ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట), 446, 448( అక్రమంగా, దురుద్దేశంగా ప్రవేశించుట) 120(బి)(నేరం చేయటానికి ముందస్తు ప్రణాళిక, llనేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 149, సెక్షన్ 3 అండ్ 4 పీడీ పీపీ యాక్ట్ (ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించుట) కింద రిమాండ్ చేశారు.
రాజకీయ కుట్రతోనే కేసు : సండ్ర
రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఖమ్మం మార్కెట్‌లో మిర్చికి మద్దతుధర అందకనే రైతులే ఆవేశంగా మార్కెట్ కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన శుక్రవారం రోజు రైతులు మార్కెట్‌లో ఉదయం 7.30 గంటల నుంచే ధర విషయంలో ఆందోళన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో రైతులను పరామర్శించేందుకు, చైర్మన్‌తో మాట్లాడదామని మార్కెట్‌కు ఉదయం 10.30 గంటలకు వెళ్లానని, అప్పటికే రైతులు మార్కెట్‌లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌తో ఆయన చాంబర్‌లో ధర విషయమై మాట్లాడానని చెప్పారు.
అప్పుడు చాంబర్‌లో చైర్మన్‌తోపాటు ఇద్దరు సీఐలు కూడా ఉన్నారన్నారు. ఆందోళన అంతకు ముందు జరుగుతున్నట్లు వాళ్లకు తెలిసినా, తాను వచ్చినప్పుడే రైతులు ఒక్కసారిగా ఆందోళన చేశారని, తానే ఈ విధ్వంసానికి కారకుడినని ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రేనని అన్నారు. అధికారంలోకి రాకముందు టీఆర్‌ఎస్ కూడా రైతుల వద్దకు వెళ్లిందని, అప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలకు కూడా ఆ పార్టీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న తాము రైతులు, ప్రజల కష్టాలను చూస్తామని, ఇలాంటి కేసులకు భయపడబోమని అన్నారు. మార్కెట్‌కు పంటను అమ్ముకోడానికి వచ్చిన రైతులపై ఖమ్మం మార్కెట్ నుంచే కేసులు పెట్టడం హేయమైనచర్య అని పేర్కొన్నారు.