మిర్చి రైతుపై దళారీ ఉచ్చు | Chilli farmers brokerage trap | Sakshi
Sakshi News home page

మిర్చి రైతుపై దళారీ ఉచ్చు

Published Wed, Nov 12 2014 8:39 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

మిర్చి రైతుపై దళారీ ఉచ్చు - Sakshi

మిర్చి రైతుపై దళారీ ఉచ్చు

  • గుంటూరు వ్యవసాయ మార్కెట్‌లోరాజ్యమేలుతున్న సిండికేట్ వ్యవస్థ
  •  కనీస మద్దతు ధర దక్కని దయనీయ స్థితి
  •  వచ్చిందే దక్కుదలగా అమ్ముకోవాల్సిన దుస్థితి
  • గుంటూరు సిటీ: గుంటూరు వ్యవసాయ మార్కెట్‌లో దళారి వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పాలకుల పట్టనితనం, అధికారుల అలసత్వం కారణంగా ఇక్కడ సిండికేట్‌స్వామ్యం రాజ్యమేలుతోంది. ఫలితంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. చివరకు రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.

    జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. లక్షన్నరకు పైగా పెట్టుబడితో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగు బడి సాధిస్తున్నారు.

    ఇక్కడి నుంచి అసలు కథ, రైతు వ్యధ మొదలవుతుంది. పంటను  వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చినా వారికి కనీస ఆదరణ కూడా లభించదు సరికదా దళారులంతా సిండికేట్ అయి ధర పెరగకుండా కట్టడి చేస్తారు. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కని దయనీయ స్థితి కల్పిస్తారు.
     
    పెట్టుబడుల రీత్యా క్వింటా ధర ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు పలికితే గానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఈ ఏడు సీజన్ ఆరంభంలో మిర్చి రైతుకు దక్కిన ధర రూ. ఆరు వేలు. అది కూడా మేలు జాతికి చెందిన తేజ రకం మిరపకు మాత్రమే.
     
     ఇక నాటు కాయలకు దక్కింది మరీ తక్కువ. అయినా ధర పెరిగే వరకు శీతల గిడ్డంగుల్లో దాచుకోలేని అసహాయత, తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని అశక్తత ఈ ఏడు మిరప రైతులను నిలువునా ముంచింది. అయిన కాడికి అమ్ముకునేలా చేసింది.
     
     తాజాగా మంగళవారం రూ.10,200 వరకు ధర పలికి రికార్డు సృష్టించింది.
     
     పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్, చైనా ల్లో ఈ ఏడు ఆశించిన దిగుబడులు లేకపోవడంతో మిర్చి ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
     
     దీనిపై పలు రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మిర్చి క్వింటాకు గత ఏడాది రూ. మూడు వేలు ధర పలికితే ఈ ఏడు రూ. ఆరు వేలు లభించడం మంచి పరిణామమే కదా అంటున్న అధికారుల వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు.
     
     వారు చెప్పింది వాస్తవమేననీ, అయితే అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు పెరిగిన పెట్టుబడులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
     
     ఇప్పటికైనా మార్కెట్ శక్తుల ఆట కట్టించి రైతుకు మద్దతు ధర దక్కేలా తగు చర్యలు చేపట్టాలని పలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

     పులి మీద పుట్రలా రుణమాఫీ   అసలే అంతంత మాత్రంగా ఉన్న మిర్చి రైతుకు రుణమాఫీ అంశం  పులి మీద పుట్రలా మారింది. రుణమాఫీ అమలు కాక మరోవైపు పాత రుణం చెల్లించాలని బ్యాంకర్లు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పంటను దాచుకోకుండా అయిన కాడికి అమ్ముకుంటున్నట్టు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement