మద్దతు అరకొర
రెండోరోజూ పత్తి కొనుగోళ్లు నిల్
{పభుత్వ మద్దతు ధర రూ.4100
{పైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ.3900
తేడా రవాణా ఖర్చులకే సరిపోతుందంటున్న రైతులు
రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్
విజయవాడ : సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు రైతుల నుంచి స్పందన కనిపించటం లేదు. మొదటి రెండు రోజులూ ఒక్క రైతు కూడా పత్తి అమ్మకాల కోసం రాలేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.4,100 ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారులు రూ.3,900 చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఇంటివద్దకు వచ్చి కొంటుండగా, సీసీఐ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖర్చులు సీసీఐ రైతులకు చెల్లించదు. దీంతో మద్దతు ధరకు, వ్యాపారులు చెల్లించే ధరకు తేడా ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు.
రూ.6 వేలిస్తేనే గిట్టుబాటవుతుంది...
క్వింటాలు పత్తికి ప్రభుత్వ మద్దతు ధర 2013-14లో రూ.4 వేలు, 2014-15లో రూ.4050 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది రూ. 4100 చెల్లిస్తామని ఏఎంసీ అధికారులు ప్రకటించారు. గతేడాదే కనీస మద్దతు ధర రూ.5వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేసినప్పటికీ రూ.4050 మాత్రమే చెల్లించారు. ఈ ఏడాది ఖర్చులు పెరిగి దిగుబడి కూడా తగ్గే పరిస్థితి నెలకొనటంతో కనీస మద్దతు ధర రూ.6 వేలు ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.
ప్రారంభమైంది మూడే...
జిల్లా వ్యాప్తంగా 18 మార్కెట్ యార్డులు ఉండగా ఇందులో మైలవరం, తిరువూరు, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేటల్లో మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఈ నెల మూడు నుంచి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. నందిగామ, మైలవరం మార్కెట్ యార్డుల్లో రెండోరోజుకూ ప్రారంభించలేదు. గతేడాది సీసీఐ వారు, మార్కెట్ యార్డుల్లో ఉద్యోగులు, బయ్యర్లు కలిసి తూకాల్లో మోసాలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఈ వ్యవహారం సీబీఐ వరకూ వెళ్లి అనేక మందిపై కేసులు నమోదు చేసింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో ఉద్యోగులు సీసీఐ వారికి సహకరించడం లేదు.
తేమ శాతం లెక్కింపులోనూ తేడాలు
కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం లెక్కింపులోనూ తేడాలు జరుగుతున్నాయి. ఎనిమిది శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, అంతకు మించి ఉంటే కొనుగోలు చేయడం సాధ్యం కాదని సీసీఐ సిబ్బంది చెబుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు 12 నుంచి 20 వరకు తేమ శాతం ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. పైగా నాణ్యత పేరుతో కొంత పత్తిని పక్కన బెట్టే పరిస్థితి సీసీఐలో ఉంది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద అది లేదు. నిబంధనల పేరుతో సీసీఐ ద్వారా జరిగే కొనుగోళ్లలో తమకు అన్యాయం జరుగుతోందే తప్ప న్యాయం జరగటం లేదనేది రైతుల అభిప్రాయం.
అమ్మకాలకు రాని రైతులు
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆర్భాటంగా ప్రారంభించినా ఒక్క రైతూ విక్రయాలకు రాలేదు. దీంతో అధికారులు గోడౌన్‌లో ఉన్న పత్తి బోరాలను తీసుకొచ్చి కాటా పెట్టి ఫొటో దిగి కొనుగోళ్లు ప్రారంభించామనిపించారు. రెండోరోజైన బుధవారమూ రైతులు రాకపోవటం గమనార్హం. తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గంపలగూడెం యార్డులో మంగళవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించగా నేటికీ కొనుగోళ్లు జరగలేదు. బుధవారం కొందరు రైతులు పత్తి నమూనాలను పరిశీలించారు తప్ప కొనుగోళ్లు చేపట్టలేదు. ఎ.కొండూరు మండలంలో గుంటూరు పత్తి వ్యాపారులు నేరుగా రైతుల ఇళ్ల వద్దే కొనుగోళ్లు జరుపుతున్నారు.