మద్దతు ఉత్తిదే..! | support unfair | Sakshi
Sakshi News home page

మద్దతు ఉత్తిదే..!

Published Tue, Nov 3 2015 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

మద్దతు ఉత్తిదే..! - Sakshi

మద్దతు ఉత్తిదే..!

మద్దతు ధర పెంపు రూ. 50 మాత్రమే..
నిపుణుల కమిటీ సిఫారసులను     పట్టించుకోని ప్రభుత్వం
కృష్ణాలో 5, గుంటూరులో 6 కేంద్రాలు
15 నుంచి రైతులకు ఆన్‌లైన్ చెల్లింపులు
 సీసీఐ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి
 తేమ శాతాన్ని తగ్గించాలంటున్న రైతులు
 

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ..
విజయవాడ బ్యూరో పత్తి కొనుగోళ్లకు సిద్ధమైన ప్రభుత్వం మద్దతు ధరపై చిన్నచూపు చూసింది. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.4,100 ను మద్దతు ధరగా ప్రకటించి రైతులను నిరాశకు గురిచేసింది. మొదటి దశలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మంగళవారం నుంచి పత్తి కొనుగోలుకు ఉపక్రమిస్తోంది.  ఈ మూడు జిల్లాల్లోని 12 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలుకు తలుపులు తీసింది. సోమవారం మధ్యాహ్నం గుంటూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ అధికారులతో సమావేశమై, ఇందుకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. కిందటేడాది ఇది రూ.4050 గా ఉన్న మద్దతు ధరను ప్రభుత్వం ఈ ఏడాది రూ.4,100గా ప్రకటించింది. కేవలం రూ.50 మాత్రమే పెంచిన ప్రభుత్వం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది.  పత్తి సాగులో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై గత ఏడాది అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ  కేంద్ర ధరల నిర్ణాయక కమిషన్‌కు మద్దతు ధరను రూ.7,700 ఉండేలా చూడాలని సిఫార్సు చేసింది. దీన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.

 నేరుగా అమ్ముకునేలా ఏర్పాట్లు : కిందటేడాది సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. కొంతమంది సీసీఐ బయ్యర్లే దళారుల అవతారమెత్తి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పత్తి కొనుగోళ్లు జరిపారు. దీనివల్ల కౌలు రైతులు లక్షల్లో నష్టపోయారు.  కొనుగోళ్ల కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరిగింది. ఈ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సారి జరిగే పత్తి కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైతులు నేరుగా మార్కెట్‌యార్డులకు పత్తి తెచ్చి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్ పద్ధతిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు చెల్లింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటుంది.
 కొనుగోలు కేంద్రాలివే : కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 12 కేంద్రాల్లో పత్తి కొనుగోలు జరపనున్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, గంపలగూడెం, మైలవరం యార్డుల్లోనూ, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, నరసరావుపేట, తాడికొండ, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతాయి.

 కౌలు రైతులకు ఇక్కట్లే : రాష్ట్రం వ్యాప్తంగా ఈ ఏడాది 6.06 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. పత్తి సాగు చేసే రైతుల్లో కౌలు రైతులే ఎక్కువ. వీరిలో చాలా మందికి రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీ) కూడా లేవు. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు దొరక్క అందిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పత్తి సాగు కోసం పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం పత్తి కొనుగోళ్లు జరిపి 15 నుంచి ఆన్‌లైన్ పేమెంట్లు చేస్తానంటుంది. ఇదే జరిగితే కౌలు రైతులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 పత్తి కొనుగోలు సమయంలో పట్టాదారు పాసుపుస్తకం నెంబరు, రైతు ఆధార్ నెంబర్లను తీసుకునే ప్రభుత్వం నగదు చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కౌలు రైతుల ఆధార్ నెంబర్లు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లతో జతకూడే అవకాశాలు ఉండవు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఇబ్బందులు పడే వీలుందన్నది రైతు సంఘాల వాదన. అంతేకాకుండా పత్తి కొనుగోలు నిబంధనల్లో తేమ శాతంపై పెట్టిన ఆంక్షలను సవరించాలని  కోరుతున్నారు.

 14న రాష్ట్ర కౌలు రైతుల సదస్సు : రాష్ట్రవ్యాప్తంగా  కౌలు రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి మొమోరాండం సమర్పించేందుకు ఈ నెల 14న గుంటూరులో ఏపీ కౌలు రైతుల సదస్సు నిర్వహించనున్నామని గుంటూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గద్దె చలమయ్య తెలిపారు. పత్తికి మద్దతు ధర కనీసం రూ.6 వేలు ఉండాలన్నది ప్రధాన డిమాండుగా ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement