పత్తి ధర మళ్లీ పతనం
పత్తి ధర మళ్లీ పతనం
Published Wed, Feb 22 2017 11:43 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
- కనిష్టం రూ. 4,100
- గరిష్టం రూ.5,930
- రూ.20 లక్షలు నష్టపోయిన రైతులు
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర మళ్లీ పతనమైంది. మూడు రోజుల్లో క్వింటా ధర రూ.300 వరకు తగ్గింది. గత పక్షం రోజులుగా క్వింటా రూ. 6 వేలకు పైగా పలుకుతూ స్థిరంగా కొనసాగింది. ధర తగ్గు ముఖం పట్టడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. శనివారం వరకు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ వారం ప్రారంభం రోజు సోమవారం యార్డుకు 11,641 క్వింటాళ్లు, మంగళవారం..13,088 క్వింటాళ్ల పత్తి వచ్చింది. క్వింటా ధర కనిష్టం రూ.4,100, గరిష్టం రూ. 5,930 పలికడంతో బుధవారం 6,344 క్విటాళ్లు మాత్రమే తీసుకొచ్చారు. ధర తగ్గడంతో ఒక్క రోజే రైతులు దాదాపు రూ.20 లక్షలు నష్టపోయారు. దూది, పత్తిగింజలు, పత్తి నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో కొంత మేర తగ్గడంతో ఆ ప్రభావం ఆదోని యార్డుపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వేరుశనగ రైతుకు ఊరట
ఆదోని మార్కెట్‌లో వేరుశనగ ధర స్వల్పంగా పెరిగింది. వారం క్రితం క్వింటా కనిష్టం రూ.3,186, గరిష్టం రూ. 5,263 పలుకగా బుధవారం కనిష్టం రూ.3,059, గరిష్టం రూ.5,759 పలికింది. అయితే రైతుల వద్ద దిగుబడులు పెద్దగా లేవు. తమ వద్ద నిల్వలు లేనప్పుడు ధర పెరిగితే తమకేమి ప్రయోజనమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన ధరకు అమ్ముకున్న రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం యార్డుకు 841 క్వింటాళ్ల దిగుబడులు అమ్మకానికి వచ్చాయి. రబీలో సీజన్‌లో భాగంగా నవంబరులో బోరు బావుల కింద వేరుశనగ సాగు చేసిన రైతులు పంట కోతలు ప్రారంభించారు. మార్కెట్‌లో ధర బాగుండడంతో చేతికి అందిన దిగుబడులను వెంటనే మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు.
కనిపించని పప్పుశనగ
ఆదోని మార్కెట్ యార్డులో పప్పు శనగ దిగుబడులు కనిపించడంలేదు. మూడేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాళ్ల పప్పు శనగలు యార్డుకు అమ్మకానికి వచ్చేవి. ఈ ఏడు కూడా డివిజన్‌లో 20 వేల హెక్టార్లకు పైగా పంట సాగు చేశారు. అయితే నవంబరు నుంచి వాన చినుకు లేకపోవడంతో విత్తనం మొలకెత్తలేదు. మొలకెత్తిన పొలాల్లో మొక్కలు ఎండి పోయాయి. కనీసం విత్తనం ఖర్చు కూడా రైతులకు గిట్టుబాటు కాలేదు. దీంతో యార్డులో ఎక్కడా ఒక్క కిలో కూడా పప్పు శనగ అమ్మకానికి రాలేదు.
Advertisement