‘ధర తెగ్గోత’పై అన్నదాత ఆగ్రహం | protest at the Nizamabad market yard | Sakshi
Sakshi News home page

‘ధర తెగ్గోత’పై అన్నదాత ఆగ్రహం

Published Mon, Oct 17 2016 8:15 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

protest at the Nizamabad market yard

-మార్కెట్ యార్డు ముట్టడి
సుభాష్‌నగర్

 జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) సర్వర్ డౌన్ ఉందనే నెపంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చిన సరుకులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని సోమవారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజురోజుకూ మొక్కజొన్న, సోయా ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెంది అధికారులు, వ్యాపారులను నిలదీశారు. ధర ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సుమారు 500 మందిపైగా రైతులు మార్కెట్‌కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ-ట్రేడింగ్ పనిచేయడం లేదని వ్యాపారులు ఇష్టానుసారంగా ఓపెన్‌యాక్షన్ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామ్ సర్వర్ డౌన్ ఉండటంతో రైతులకు సరుకుకు సంబంధించిన లాట్ నెంబర్లు ఇవ్వలేదు. ఉదయం సర్వర్ పనిచేయడంతో కొంతమందికి మాత్రమే ఇచ్చారు. దీంతో మిగతా వారికి సరుకును ఓపెన్ యాక్షన్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇందులో మక్కలకు రూ.1250, సోయాకు రూ.2500 లోపే ధర పలుకుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓపెన్‌యాక్షన్ ద్వారా తక్కువ ధర వస్తుందని రైతులు అధికారులను నిలదీశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులంతా కలిసి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు తరలివచ్చి మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్‌కమిటీ సెక్రటరీ సంగయ్య రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు విన్పించుకోలేదు. నామ్ సర్వర్ సక్రమంగా లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతుందని, ఈ-ట్రేడింగ్‌ను రద్దు చేయాలన్నారు. మొక్కజొన్న, సోయా గురువారం నాటి ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. దీంతో అధికారులు, కమీషన్ ఏజెంట్లను పిలిపించి కొంతమంది రైతులతో కలిసి చర్చలు జరిపారు. చివరకు సోయా ఎ గ్రేడ్ రకానికి రూ.2675, మొక్కజొన్నను రూ.1435 లకు కొనుగోలు చేస్తామని ట్రేడర్లు హామీనివ్వడంతో రైతులు శాంతించారు. విషయం తెలుసుకున్న నగర సీఐ, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement