మార్కెటింగ్ శాఖలో ఒకే ఘటనపై పదే పదే దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆసియాలోకెల్లా అతి పెద్ద రెండో మార్కెట్ యార్డుగా...
సాక్షి, విజయవాడ : మార్కెటింగ్ శాఖలో ఒకే ఘటనపై పదే పదే దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆసియాలోకెల్లా అతి పెద్ద రెండో మార్కెట్ యార్డుగా పేరున్న గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో మిర్చి కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌లో భాగస్వాముల మార్పుపై మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై గత రెండేళ్లుగా విచారణపర్వం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం గొల్లపూడిలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో జాయింట్ డెరైక్టర్ రామాంజనేయులు విచారణ నిర్వహించారు. విచారణకు గతంలో గుంటూరు మార్కెట్ కమిటీ యార్డులో పనిచేసిన 13 మంది ఉద్యోగులు హాజరయ్యారు.
2008 నుంచి 2013 వరకు వరకు మొత్తం 293 కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌ల్లో భాగస్వాముల పేరు మార్పు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాల నిబంధనలకు లోబడి అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో భాగస్వాముల పేర్లు మార్పు వ్యవహారం జరిగింది. ఈక్రమంలో కె.కోటిరెడ్డి అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్‌ల భాగస్వాముల పేర్లు మార్పులు చేస్తున్నారని మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో 2013 మార్చిలో రెన్యూవల్స్ కావాల్సిన 293 లెసైన్స్‌లను అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి నిలుపుదల చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోటిరెడ్డి ఫిర్యాదును విచారించాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ కడప జిల్లా జేడీ ఆర్.అక్ష్మణుడును విచారణాధికారిగా నియమించింది. దీంతో భాగస్వాముల లెసైన్స్‌ల మార్పు, ఫైల్ ప్రాసెస్ చేసిన మార్కెట్ కమిటీ ఉద్యోగులు 23 మందిని బాధ్యులుగా నిర్ధారించారు. వీరిలో సర్వీసులో ఉన్న 13 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేయగా, మిగిలిన 9 మంది రిటైర్ అయ్యారు. వారిలో ఐదుగురుకి ఆర్టికల్ ఆఫ్ చార్జ్‌స్ కింద మోమోలు ఇవ్వగా మిగిలిన నలుగురు రిటైరై నాలుగేళ్లు దాటడంతో కేసు నుంచి మినహాయించారు.
ఈ క్రమంలో లక్ష్మణుడు విచారణ నిర్వహించి ఉద్యోగులు రూల్ ప్రకామే చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మార్కెట్ యార్డులో లెసైన్స్‌ల వ్యవహారం హడావుడి జరగుతున్న క్రమంలో అప్పటి ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎన్.నరహరి తాను రెన్యూవల్స్ చేస్తానని వ్యాపారుల నుంచి సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు దీనిపై లోకాయుక్తను ఆశ్రయించడంతో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ దీనిని విచారణ నిర్వహిస్తోంది.
దీనికి కూడా రామాంజనేయులే విచారణాధికారి వ్యవహరిస్తున్నారు. లక్ష్మణుడు నివేదిక ఇచ్చిన తర్వాత మళ్లీ రైతుబాజార్ సీఈవో ఎంకె సింగ్‌ను విచారణాధికారిగా నియమించి రెండోసారి విచారణ నిర్వహించారు. ఆ అధికారి గుంటూరు యార్డుకు రాకుండానే ఉన్నతస్థాయి వ్యక్తుల సూచనలతో నివేదికను సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం మళ్లీ రెగ్యులర్ ఎంక్వైయిరీ ఆఫీసర్‌గా గతేడాది ఫిబ్రవరి 2న రామాంజనేయుల్ని విచారణాధికారిగా నియమించి ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.
గత ఏడాది నిర్వహించాల్సిన విచారణ ఎట్టకేలకు మంగళవారం జరగడంతో 13 మంది ఉద్యోగులు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. చట్టాలకు లోబడి, ఉన్నతశ్రేణి కార్యదర్శుల ఆదేశాలతో పనిచేసే తమను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఈ ఘటనతో పూర్తి ప్రయేయం ఉన్న వ్యక్తుల్ని విచారించాలని వారు కోరారు.