గోవుల పోటీలకు పటిష్ట ఏర్పాట్లు
గోవుల పోటీలకు పటిష్ట ఏర్పాట్లు
Published Tue, Sep 13 2016 8:22 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
ద్వారకాతిరుమల: రాష్ట్రస్థాయి గోవుల పాల, అందాల పోటీల నిర్వహణకు స్థానిక మార్కెట్ యార్డును ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పోటీల్లో పాల్గొనే పలు జాతిగోవులు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. జిల్లా పశు సంవర్ధకశాఖ ఏలూరు డివిజన్ ఏడీ ఎస్‌టీజీ సత్యగోవింద్, అధికారులు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పాలపోటీలను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభిస్తారని, కలెక్టర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పాల పోటీల రిజిస్ట్రేషన్‌తో ప్రారంభం అవుతుందన్నారు.
అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు పశువుల పొదుగులను ఖాళీ చేస్తారన్నారు. 16 ఉదయం, సాయంత్రం అలాగే 17న ఉదయం మూడుపూటలా పాల ఉత్పత్తిని సేకరిస్తామని చెప్పారు. అదేవిధంగా 17న ఉదయం 8 గంటల నుంచి అందాల పోటీలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోటీలు ప్రారంభిస్తామన్నారు. పోటీల్లో విజేతలకు 17న సాయంత్రం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని చెప్పారు.
200 గోవులు వస్తాయని అంచనా
పాల పోటీలకు 100, అందాల పోటీలకు మరో 100 గోవులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గోవులు వాతావరణ మార్పు కారణంగా పాల దిగుబడి తగ్గుతుందన్న ఉద్దేశంతో వాతావరణం అలవాటయ్యేందుకు గాను పలువురు రైతులు ముందుగానే గోవులతో ఇక్కడకు చేరుకున్నారు. గోవులకు దాణా, వసతులను అధికారులు కల్పిస్తున్నారు.
బహుమతులు ఇలా..
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ రూ.5 లక్షలు, పశుసంవర్ధకశాఖ రూ.2 లక్షల నిధులతో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామని ఏడీ సత్యగోవింద్ చెప్పారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తతీయ బహుమతిగా రూ.10 వేలు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. అందాల పోటీల్లో విజేతలకూ బహుమతులు అందిస్తామని చెప్పారు.
Advertisement