మధుర ఫలంపై విష పంజా | Vigilance Attacks On Fruits Market In Visakhapatnam | Sakshi
Sakshi News home page

మధుర ఫలంపై విష పంజా

Published Fri, May 11 2018 12:57 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Vigilance Attacks On Fruits Market In Visakhapatnam - Sakshi

స్ప్రే చేసేందుకు ఉపయోగించే స్ప్రేయర్లు, స్ప్రేచేసి మగ్గించిన మామిడి పండ్లు , ప్రమాదకర ప్రోపోన్‌ రసాయన డబ్బా

నక్కపల్లి(పాయకరావుపేట): మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్‌ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచే విజిలెన్స్‌ ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ సీఎం నాయడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో దాడులు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వేంపాడు, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మామిడి యార్డుల్లో మెరుపు దాడులు నిర్వహించారు.

శాంపిళ్లు సేకరించిన అధికారులు
చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్‌ ఫ్రూట్స్, వీఈఆర్‌ అండ్‌ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్‌ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్‌ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు.

24 గంటల్లోనేమగ్గించేసి...
ఏటా మార్చి నుంచి జూన్‌ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్‌ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్‌ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇలా నిబందనలకు విరుద్దంగా రసాయానాలను స్ప్రేచేసి మామిడి పండ్లను మగ్గిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అ«ధికారులు దాడులు నిర్వహించారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం.

రోజూ వంద టన్నులకుపైనే ఎగుమతి
నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్‌గేట్‌ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్‌ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ  రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement