Vigilance attack
-
విజిలెన్స్ దాడులు నకిలీ కారం పట్టివేత
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఆకివీడులోకి కారం మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. మిల్లులో నకిలీ కారం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. కారం మిల్లులో తనిఖీలు చేయగా రంగుపొడి లభ్యమైంది. భారీ మొత్తంలో దొరికిన రంగు పొడి శాంపిల్స్‌ను విజిలెన్స్ సీఐ విల్సన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎమ్మార్వో రవికుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య సేకరించారు. అనంతరం విలేకర్లతో విల్సన్ మాట్లాడుతూ కారం మిల్లులో రంగు కలిపి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. మిల్లులో రంగు పొడి అధిక మొత్తంలో కన్పించిందని, దీనిని శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నట్లు చెప్పారు. పరీక్షల అనంతరం నకిలీదైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆకివీడు, దుంపగడపలోని రెండు రేషన్ షాపుల్ని తనిఖీ చేశామని విల్సన్ చెప్పారు. రెండు షాపుల్లో రికార్డులకు అనుగుణంగా స్టాక్ లేదని, వాటిపై సెక్షన్ 6ఏ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా కారంమిల్లు యజమాని రంగు పొడిని కుంకుమ పొడి అని, వినియోగదారుడు తీసుకువచ్చాడని చెప్పారు. -
అరసవల్లి ఆలయంపై విజి‘లెన్స్’
సాక్షి, అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రీజనల్ విజిలెన్స్ అధికారి పనసారెడ్డి ఆదేశాల మేరకు సీఐలు చంద్ర, ప్రకాష్, స్వామినాయుడులతోపాటు ఎస్సై కిరణ్‌కుమార్ తదితర బృందాలు ఆలయంలో పలు విభాగాల్లో ఉదయం 6.30 గంటల నుంచి తనిఖీలను మొదలు పెట్టారు. బృందాలుగా విడిపోయి కేశఖండనశాల, ప్రసాదాల విభాగంతోపాటు ముఖ్య కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి టెండర్‌దారుడి నుంచి వచ్చిన పచారి సరుకుల నాణ్యతను పరిశీలించారు. జీడిపప్పు, కిస్మిస్ తదితర వస్తువుల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గత రథసప్తమి టెండర్లు, వివిధ ఆర్జిత సేవల టిక్కెట్లు, దర్శన మార్గ టిక్కెట్లు, విరాళాలు, బ్యాంకు లావాదేవీలు, ఆలయ భూముల వివరాలతోపాటు తలనీలాలు, కొబ్బరికాయల టెండర్ ప్రక్రియలు ఖరారైన తీరుతెన్నులను ప్రధానంగా పరిశీలించి, అనుమానమున్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ అన్ని విభాగాల్లోనూ తనిఖీలు చేశామని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆలయ రికార్డుల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, దీంతో తాజాగా విజిలెన్స్ అధికారులకు కావాల్సిన రికార్డులను, సమాచారాన్ని వెంటనే ఇచ్చే వీలు కలిగిందన్నారు. తమ ఆలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు పూర్తిగా సహకరించారని వివరించారు. -
రేషన్ షాపులపై నిఘా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్ల అక్రమాలకు కళ్లెం వేసేందుకు పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. ఈ బృందాలు రేషన్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తూ రికార్డులు, సరుకుల నిల్వల తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. వాటిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా డీలర్లకు నోటీసులివ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి డీలర్ల అక్రమాలను గుర్తించారు. ఖైరతాబాద్‌లోని చింతల బస్తీ, అంబర్‌పేటలోని గోల్నాక తులసినగర్‌లోని రేషన్ షాపులను తనిఖీ చేయగా రికార్డులు, స్టాక్ నిల్వలకు పొంతన లేదని తేలింది. దీంతో డీలర్లకు నోటీసులు జారీ చేయడమే కాకుండా కేసులు నమోదు చేశారు. ఈ–పాస్‌లో సైతం అక్రమాలు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా çసబ్సిడీ సరుకుల పంపిణీ జరుగుతున్నా..అందులో సైతం డీలర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి వేలిముద్ర వేసి సరుకులు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... సరుకుల పంపిణీలోనే డీలర్లు చేతివాటం ప్రదర్శిన్నారు. కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి కిరోసిన్, గోధుములు ఇతరత్రా ఇవ్వకుండా ఈ–పాస్ యంత్రంలో మాత్రం డ్రా చేస్తున్నట్లు నమోదు చేయడం సర్వసాధారణమైంది. వాస్తవంగా సరుకుల డ్రాకు సంబంధించి సంక్షిప్త సమాచారం సంబంధిత కార్డుదారుడి ఫోన్‌కు రావాల్సి ఉంటుంది. అయితే ఈ–పాస్‌ద్వారా ఎస్ఎంఎస్లు ఫోన్లకు చేరకుండా చేయడంలో డీలర్లు సఫలీకృతమయ్యారు. దీంతో లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే అంటగడుతూ మిగతా సరుకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులు గట్టిగా నిలదీస్తే స్టాక్ రాలేదని, లేకుంటే అయిపోయిందని చెబుతున్నారు. రేషన్ పోర్టబిలిటీ అమలవుతున్న కారణంగా సరుకుల ఎగవేత మరింత కలిసి వస్తోంది. 520 దుకాణాల గుర్తింపు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 520 ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జాబితా అందించినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఫిర్యాదుల గల చౌకధరల దుకాణాలపై దాడులు ప్రారంభమయ్యాయి. మహానగర పరిధిలో మూడు పౌరసరఫరాల జిల్లాలు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో పన్నెండు పౌరసరఫరాల సర్కిల్స్ ఉన్నాయి. వాటి పరిధిలోని 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సుమారు 16,02,134 ఆహార భద్రత కార్డులకు సబ్సిడి సరుకుల పంపిణీ జరుగుతోంది. హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5,85,039 కార్డులు ఉండగా, అందులో 21,85,668 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5,23,089 కార్డులు ఉండగా అందులో 17,46,078 యూనిట్లు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 4,94,006 కార్డులు ఉండగా, అందులో 16,47,263 యూనిట్లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బియ్యం అవసరం లేని లబ్ధిదారులు బయోమెట్రిక్ ఇచ్చి డీలర్లకే కిలోకు పది రూపాయల చొప్పున అప్పగిస్తుండగా, ఇక గోధుములు, కిరోసిన్‌ను మాత్రం డీలర్లు నల్లబజారుకు తరలించడం మామూలైంది. -
ఏలూరులో హోటల్స్‌పై విజిలెన్స్ దాడులు
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : నగరంలోని ప్రముఖ హోటల్స్ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, మాంసాన్నే జనాలకు వేడివేడిగా అందిస్తూ సొమ్ములు గడిస్తున్న నిర్వాహకులు కనీసం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకపోవటంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో బుధవారం మూడు ప్రముఖ హోటల్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి.. కంపు కొడుతూ, రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను చూసిన విజిలెన్స్ అధికారులు షాకయ్యారు. ఆహారపదార్థాలు ఇంత దారుణంగా ఉండడంతో భోజనప్రియులు భయపడుతున్నారు. ఇక హోటల్స్ నిర్వహణ ఇంత దారుణంగా ఉన్నా విజిలెన్స్ అధికారులు, ఆహారభద్రతా అధికారులు స్వయంగా పరిశీలించినా అవన్నీ చక్కగా తెరుచుకునే ఉండడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఏలూరులో విజిలెన్స్ దాడులు ఏలూరు నగరంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆహార భద్రతా అధికారులు పలు హోటల్స్‌పై ఆకస్మిక దాడులు చేశారు. టూటౌన్లో ఆర్‌ఆర్‌పేట విజయవిహార్ సెంటర్ ప్రాంతంలోని విజయా మెస్, ఎన్‌ఆర్‌పేటలోని టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని గ్రాండ్ ఆర్యా హోటల్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఒక హోటల్ పైనా దాడులు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో సీఐ భాస్కర్, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ హోటల్స్‌లో పెద్దమొత్తంలో నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మటన్‌ను అ«ధికారులు స్వాధీనం చేసుకుని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. ఇక నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు తీవ్రస్థాయిలో దుర్గంధం వెదజల్లటంతో అధికారులు, ప్రజలు సైతం విస్తుపోయారు. చికెన్ లెగ్‌పీస్‌లు అయితే ఏకంగా పట్టుకుంటే చిన్నచిన్న పీస్‌లుగా ఊడిపోవటం, దుర్గంధం వెదజల్లటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏమాత్రం ఆహార భద్రతా నియమాలు పాటించటంలేదని అధికారులు పేర్కొంటున్నారు. మూడు హోటల్స్ నుంచి 15 శాంపిల్స్ సేకరించామనీ, టెస్ట్‌లకు ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. భోజన ప్రియులకు షాక్ సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్ళేందుకు భోజనప్రియులు అధికంగా ఇష్టపడతారు. ఏలూరు నగరంలో ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లుగా చెప్పుకునే వీటిలో కనీస నాణ్యత పాటించకపోవటం భోజన ప్రియులకు షాకిస్తోంది. తాము ఇప్పటి వరకూ ఇలాంటి ఆహారాన్నా తినేది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు అయితే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయనే సమాచారంతో మూసివేశారు. ఎలాగో తమపైనా దాడులు చేస్తే అబాసుపాలు కాకతప్పదనే అంచనాకు వచ్చిన సదరు రెస్టారెంట్ల నిర్వాహకులు ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇక హోటల్స్‌లో ఆహారపదార్థాలు కొనుగోలు చేసే ప్రజలు పరిశీలించి తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
సీజనల్ హాస్టల్స్ అవినీతి బట్టబయలు!
కోడూరు (అవనిగడ్డ): సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీజనల్ హాస్టల్స్‌లో జరుగుతున్న అవినీతి విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. ఎన్జీవోల పర్యవేక్షణలో సాగాల్సిన ఈ హాస్టల్స్ నిర్వహణ పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మండలంలోని విశ్వనాథపల్లి, కోడూరు, ఉల్లిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాస్టల్స్‌పై మంగళవారం విజిలెన్స్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది అకస్మిక దాడులు నిర్వహించారు. మూడు హాస్టల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న సంఖ్యకు సంబంధం లేకపోవడంపై సీఐ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మెనూ ప్రకారం భోజనం వండకుండా ఇష్టమొచ్చినట్లుగా వంటలు సిద్ధం చేస్తున్నారని సీఐ గుర్తించారు. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మెటిక్స్ చార్జీలను సైతం నిర్వాహకులు విద్యార్థినులకు ఇవ్వకుండా తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇళ్ల వద్ద నుంచి వచ్చే డబ్బులతోనే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నట్లు విద్యార్థులు అధికారులకు తెలిపారు. విద్యా వలంటీర్ల జీతాల్లోనూ చేతివాటం.. ప్రస్తుతం హాస్టల్స్‌లో ఉండే విద్యార్థుల సంరక్షణతో పాటు బోధన చేసేందుకు విద్యా వలంటీర్లను నియమించారు. వీరికి ప్రభుత్వం రూ.5 వేలు జీతం కూడా ఇస్తుంది. అయితే ఈ నగదును నిర్వాహకులు పూర్తిగా వాలంటీర్లకు ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారికి నిర్వాహకులు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన రూ.2 వేలను కాజేస్తున్నట్లు తమ దర్యాప్తులో తెలిందన్నారు. కొన్ని చోట్ల హాస్టల్స్ నిర్వహణ బాగానే ఉన్నా, మరికొన్ని చోట్ల అధికారుల పర్యవేక్షణ లోపంతో మరీ అధ్వానంగా ఉందన్నారు. డీఎస్పీ విజయపాల్ ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక దాడులు చేశామని, వీటిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఎఫ్ఆర్ఓ తిమోతి, డీఈ వెలుగొండయా, సీనియర్ అసిస్టెంట్ మణికుమార్, కానిస్టేబుల్ నాగభూషణం, ఎంఈవో టీవీఎం. రామదాసు తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకులపై విజి‘లెన్స్’
కర్నూలు: పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీ, కొలతల్లో తేడాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. పెట్రోల్, డీజిల్‌లో కిరోసిన్ కలిపి విక్రయాలు జరుపుతున్నారని, కొలతల్లో కూడా తేడాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలసి నారాయణస్వామి పెట్రోల్ బంకు, ఆల్ఫా పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెట్రోల్, డీజిల్‌లో ప్యూరిటీ, డెన్సిటీ మెజర్ మెంట్స్ పరిశీలించారు. సీఐ లక్ష్మయ్య నేతృత్వంలో మైనింగ్ శాఖ అధికారులతో కలిసి మరో బృందం అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. లైమ్ స్టోన్, నాపరాళ్లు, గ్రానైట్, ఇటుకలు, ఐరన్, వరిధాన్యం తదితర వాటిని అనుమతి పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో తరలిస్తుండగా తనిఖీ చేసి 18 వాహనాలను సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. 17 వాహనాల నుంచి రూ.2,96,000 అపరాధ రుసుం వసూలు చేయాలని వ్యవసాయ, మైనింగ్ శాఖ అధికారులకు నివేదించారు. -
బడి బస్సులపై విజి‘లెన్స్’!
చదువులు, రవాణ పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేశాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో నడుస్తోన్న బస్సుల్లో డొల్లతనం బుధవారం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. జిల్లాలో గుడివాడ, బందరు మండలాల్లోని ఎనిమిది ప్రైవేటు పాఠశాలలకు చెందిన 42 బస్సులను విజిలెన్స్, రవాణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బస్సుల్లో ఉన్న లోపాలు అధికారులు గుర్తించి.. 6 బస్సులను సీజ్ చేయడమే కాకుండా ఎంవీఐ యాక్ట్ కింద మరో 38 బస్సులపై కేసులు నమోదు చేశారు. సాక్షి, అమరావతిబ్యూరో/గుడివాడ/కోనేరు సెంటర్ : ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధను.. ఆ విద్యార్థులను పాఠశాలలకు తరలించేందుకు, తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చే విషయంలో చూపడం లేదు. నిత్యం వినియోగిస్తున్న బస్సుల నిర్వహణను గాలికొదిలేశాయి. డాక్యుమెంట్ల పరంగా అన్ని బస్సులు పక్కాగా ఉన్నప్పటికీ భద్రత పరంగా మాత్రం నాసిరకమేనని తేలింది. అలాగే కనీస మౌలిక సౌకర్యాలు కూడా చాలా బస్సుల్లో కనిపించని పరిస్థితి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం విద్యార్థుల ప్రాణాలకు పెనుముప్పే వాటిల్లే అవకాశం పొంచి ఉంది. 90 శాతం బస్సుల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు లేకుండానే బస్సులు రహదారులు ఎక్కుతున్నాయి. చాలా మంది డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదు. యూనిఫాం వేసుకోవడం మానేశారు. బస్సును శుభ్రంగా ఉంచుకోవడం లేదు. డ్రైవర్ల వెనుక ఉండాల్సి రూట్‌మ్యాప్ జాడే కనిపించడం లేదు. బయటపడ్డ డొల్లతనం బస్సుల నిర్వహణ, తదితర అంశాలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో విజిలెన్స్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అధికారులు జిల్లాలో బందరు, గుడివాడ మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భాష్యం, రవీంద్రభారతి, విశ్వభారతి, శ్రీచైతన్య, విద్యాలయ, కేకేఆర్ గౌతం పాఠశాలలకు చెందిన 41 బస్సులను తనిఖీలు చేసిన అధికారులు బస్సుల నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. భద్రతాపరంగా అధ్వానంగా ఉన్న 6 బస్సులను సీజ్ చేశారు. మరో 38 బస్సులపై రవాణా చట్టం కింద కేసులు నమోదు చేసి యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. అలాగే వాటిని మరమ్మతులు చేసిన తర్వాత రవాణా శాఖ వద్ద అనుమతి పొందాకే వాటిని రోడ్లపై అనుమతించాలని ఆదేశించినట్లు విజిలెన్స్ డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కుళ్లిన మాంసం.. చేదెక్కిన స్వీట్లు
గుంటూరు(నగరంపాలెం): నగరంలో చిరు తిండ్లు నుంచి ఆహార పదార్థాలు, నాజ్ వెజ్ ఐటమ్స్ వరకు అన్నీ కల్తీమయమయ్యాయి. అత్యాశతో వ్యాపారులు నాణ్యత లేని, కల్తీ పదార్థాలు అమ్ముతున్నారు. వాసన రాకుండా ఉండేందుకు నిషేధిత కెమికల్స్ వినియోగిస్తున్నారు. నగరంలో తినుబండరాలు తయారు చేసే పలు దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శోభామంజరి ఆధ్వర్యంలోæ అధికారులు దాడులు చేశారు. కొరిటెపాడులోని సిరి, సకల స్వీట్ షాపులు, తయారీ చేసే ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు స్వీట్లు తయారీకి నాణ్యత లేని పదార్థాలు వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో స్వీట్లు పరీక్షల నిమిత్తం శాంపిల్స్ తీశారు. లాలాపేట తూనుగుంట్ల వారి వీధిలో రహదారిపై తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా తిను బండారాలు విక్రయిస్తున్నట్లు గమనించి నోటీసులిచ్చారు. లాలాపేట హోల్‌సేల్ దుకాణాల్లో చిన్నారులు తినే తినుబండరాలు ప్యాకెట్లను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. కుళ్లిన మాంసం స్వాధీనం బస్టాండ్ ఎదుట ఐశ్వర్య బార్ అండ్ రెస్టారెంట్‌లోని కిచెన్‌ను అధికారులు పరిశీలించారు. అక్కడ దుర్వాసన స్థితిలో మురుగుపోయిన చికెన్ నిల్వలను ఫ్రిజ్‌లో గుర్తించారు. గతంలో మిగిలిపోయిన వండిన చికెన్ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. దుర్వాసన, రంగు తెలియకుండా ఉండటానికి నిషేధిత కెమికల్స్ పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మాంసం ధ్వంసం చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి మాట్లాడుతూ కల్తీ, పరిశుభ్రతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్సు డీఎస్పీ సుబ్బారెడ్డి, సీఐ అంటోనీ రాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ డీ శ్రీను, హరికృష్ణ పాల్గొన్నారు. -
మధుర ఫలంపై విష పంజా
నక్కపల్లి(పాయకరావుపేట): మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచే విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ సీఎం నాయడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వేంపాడు, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మామిడి యార్డుల్లో మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిళ్లు సేకరించిన అధికారులు చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్ ఫ్రూట్స్, వీఈఆర్ అండ్ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు. 24 గంటల్లోనేమగ్గించేసి... ఏటా మార్చి నుంచి జూన్ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇలా నిబందనలకు విరుద్దంగా రసాయానాలను స్ప్రేచేసి మామిడి పండ్లను మగ్గిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అ«ధికారులు దాడులు నిర్వహించారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం. రోజూ వంద టన్నులకుపైనే ఎగుమతి నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్గేట్ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. -
ఐఎస్ఎల్ సొమ్ము స్వాహాపై విజిలెన్స్ విచారణ
తొండంగి(తుని) : కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అమలులో భాగంగా అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు నిర్మించినట్టు చూపించి నిధులు కాజేసిన వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ ప్రారంభించారు.పైడికొండ పంచాయతీలో పైడికొండతోపాటు ఆనూరు గ్రామాల్లో అధికారులు, కాంట్రాక్టర్ కలిసి 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్ రికార్డుల్లో చూపించారు. వీటిలో సగానికి పైగా లబ్ధిదారులకు తెలియకుండానే మరుగుదొడ్లు లేని ఇళ్ల వద్ద, దీర్ఘకాలం క్రితం సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి వివరాలు నిర్మించినట్టు చూపారు. ఈ విధంగా ఒక్కో లబ్ధిదారుడి పేరు మీద రూ.15వేల చొప్పున సుమారు పైడికొండ పంచాయతీ పరిధిలో సుమారు రూ.60 నుంచి 70 లక్షల వరకు నిధులు కాజేసినట్టు ‘సాక్షి’ ఈ బాగోతాన్ని గతేడాది డిసెంబర్లో ప్రత్యేక కథనంతో వెలికితీయడం అప్పట్లో దుమారం రేగింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆనూరు గ్రామంలోని బాధిత ప్రజలు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పైడికొండలో బాధిత గ్రామస్తులందరూ వ్యవహారానికి కారకులైన గ్రామ కార్యదర్శి బుచ్చిరాజు, ఇతర అధికారులతోపాటు స్థానిక అ«ధికార పార్టీ నేతలను నిలదీసి జరిగిన అవినీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్ ద్వారా కొంచెం నోరున్న నాయకుల నోరు మూయించేందుకు నేరుగా డబ్బులు పంపిణీ నిర్వహించారు. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుకు కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓతో డ్వామా ఏపీఓ, ఇతర 34 మంది కూడిన బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో ఆన్లైన్ లబ్ధిదారుల రికార్డుల ప్రకారం ఇంటింటా పర్యటన నిర్వహించి వాస్తవ విషయాలను సేకరించి నివేదిక రూపొందించింది. ఈ ప్రక్రియకు ముందు సదరు కాంట్రాక్టర్, అధికారులు కలిసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించని వారి ఇళ్ల వద్ద ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. కొన్నింటిని పూర్తి చేసినా అందరి లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. కాగా సొంత ఖర్చులతో మరుగుదొడ్డిని నిర్మించుకున్న వారికీ తమకు తెలియకుండా పేరు వాడుకున్నందుకు కూడా కాంట్రాక్టర్ నయానా, భయానా సొమ్ములు ముట్టజెప్పారని సమాచారం. ప్రారంభమైన విచారణ పైడికొండ పంచాయతీలో జరిగిన ఐఎస్ఎల్ నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం, అవినీతి బాగోతాలపై విచారణ జరపాలంటూ ఆనూరుకు చెందిన బాధిత గ్రామస్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ డీఈ డీఎస్ఎన్ మూర్తి, మరికొంత మంది అధికారుల బృందం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో విచారణ ప్రారంభించారు. పైడికొండ పంచాయతీ కార్యాలయంలో రికార్డుల్లో వివరాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా లబ్ధిదారుల పేర్లు ఆధారంగా అధికారుల బృందం స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలతోపాటు విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈ మూర్తి తెలిపారు మరో రెండు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర గ్రామాల్లోనూ ఇదే తంతు? పైడికొండ అక్రమాలు బయటపడడంతో మిగిలిన పంచాయతీల్లో ప్రజలు కూడా తమ వివరాలు దుర్వినియోగమయ్యాయేమోనని వెతుకులాటలో పడ్డారు. దీంతో పి.ఇ.చిన్నాయపాలెం, బెండపూడి తదితర గ్రామాల్లో కూడా లబ్ధిదారుల పేరుమీద భారీస్థాయిలో నిధులు కాజేసినట్టు తెలిసింది. దీంతో బాధిత ప్రజలు ఇప్పటికే ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరికొంత మంది ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
హరిత హోటల్‌పై విజిలెన్స్ దాడులు
ధర్మపురి : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ధర్మపురి క్షేత్రంలోని హరిత హోటల్‌పై శనివారం విజిలెన్స్ అధికారులు దాడిచేయగా పలు విషయాలు వెలుగుచూశారు. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. ధర్మపురిలోని గోదావరి ఒడ్డున వీఐపీల విడిది కోసం హరిత హోటల్ ఏర్పా టు చేశారు. ఇందులో మధ్యం, మాం సం ఉండదు. నిత్యం ధర్మపురికి వచ్చే భక్తులకు ఈ భవనం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొంత కాలంగా హోటల్లో మేనేజర్ ఇష్టానుసారంగా మెనూ తయారు చేయిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో హోటల్‌పై దాడిచేశారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో గదుల్లో కనీస శుభ్రత కూడా కనిపించలేదు. గదుల్లో పేక ముక్కలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌కు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. క్యాష్బుక్ కనిపించకపోవడంతో హోటర్ మేనేజర్ బాలకృష్ణను పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్ర«శ్నించగా నీళ్లు నమిలాడు. క్యాష్బుక్ పోయిందని బుకాయించాడు. ప్రతిరోజూ హోటల్లో ఎంత మంది ఉంటున్నారు, ఎన్ని గదులు అద్దెకిస్తున్నారు.. జమ, ఖర్చుల వివరాలేవని ప్రశ్నించారు. మేనేజర్, సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. కాగా, విజిలెన్స్ దాడుల అనంతరం మేనేజర్ బాలకృష్ణ హోటల్ క్యాష్బుక్ పోయిందని ధర్మపులి ఠాణాలో సాయంత్రం ఫిర్యాదు చేశారు. హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు, క్యాష్బుక్ మాయంపై విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
బియ్యం లోటు.. చక్కెర మిగులు
- విజిలెన్స్ దాడులతో వెలుగులోకి అక్రమాలు - పౌరసరఫరాల గిడ్డంగిలో అవక తవకలు - అస్తవ్యస్తంగా రికార్డులు మల్యాల : మండల కేంద్రంలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం నాటి విజిలెన్స్ దాడిలో ఎన్నో అక్రమాలు వెలుగుచూశారుు. రెండు క్వింటాళ్ల బియ్యం లోటు ఉండగా.. రెండు క్వింటాళ్ల చక్కెలు మిగులు ఉంది. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గిడ్డంగి నిర్వహణపై విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో మల్యాలలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. సరుకు నిల్వ, సరఫరాలకు సంబంధించిన రికార్డుల్లో తేడా ఉండడంపై ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నుంచే సరుకుల తూకంలో తేడా వస్తుండడంతోనే నిల్వలలో తేడాలున్నాయనగా.. వెంటనే హమాలీలతో బస్తాలను తూకం వేరుుంచగా వ్యత్యాసం తేలకపోవడం గమనార్హం. రికార్డులు అస్తవ్యస్తం రికార్డుల ప్రకారం సరుకు నిల్వలలో తేడాల రావడంపై నిలదీశారు. గోడౌన్ ఇన్చార్జికి బదులు కాంట్రాక్టు క్లర్క్ సమాధానం చెప్పడం గమనార్హం. రికార్డులోని నిల్వకు వాస్తవానికి బియ్యంలో 2 క్వింటాళ్ల వ్యత్యాసం రాగా.. చక్కెర రెండు క్వింటాళ్ల అదనంగా ఉండడంపై ప్రశ్నించారు. గోధుమలు, ఉప్పు నిల్వల్లోనూ తేడాలు వచ్చారుు. సరుకుల నిల్వల్లో వ్యత్యాసంపై జేసీకి నివేదిక అందజేయనున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి తెలిపారు. గోడౌన్‌పై పర్యవేక్షణ కరువు గోడౌన్‌లోని సరుకుల నిల్వ, సరఫరాపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నారుు. అంతేకాకుండా గోడౌన్‌కు వచ్చిన సరుకులను నేరుగా రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారనే మరో విమర్శ ఉంది. వాహనాల వెంబడి రూట్ ఆఫీసర్స్ వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ప్రైవేట్ వ్యక్తిదే హవా గిడ్డంగి నిర్వహణ వివరాలు, రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తి చేతిలోనే ఉండడంపై అనుమానాలకు తావిస్తోంది. డీలర్లు, అధికారులు, సరుకుల నిల్వలకు సంబంధించిన ప్రతి అంశం ప్రైవేట్ ఉద్యోగినే అడగడం ఆనవాయితీగా మారింది. ఇటు అధికారులు, హమాలీలు, అటు డీలర్లు సైతం ఏ విషయమైనా ప్రైవేట్ వ్యక్తితోనే చర్చించడం గమనార్హం. బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణలోనూ ప్రైవేట్ వ్యక్తియే అన్ని సమాధానాలు చెప్పడం గమనార్హం. -
రేషన్ షాపుపై విజిలెన్స్ దాడి
చీపురుపల్లి,న్యూస్‌లైన్: చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆకులపేట రేషన్ షాపుపై విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్. ఉమాకాంత్ ఆధ్వర్యంలో జరిపిన ఆకస్మిక దాడిలో రేషన్ దుకాణంలో సరుకుల తేడా కనిపించింది. దీంతో రేషన్‌షాపు రికార్డులు సీజ్ చేసి, నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల్లో 100 కేజీల బియ్యం తక్కువగాను, 30 కేజీల గోధుమపిండి ఎక్కువగాను, 200 కేజీల ఉప్పు అధికంగాను ఉన్నాయని చెప్పారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని, ధరల పట్టిక కూడా దుకాణం వద్ద లేదని తెలిపారు. ఆకులపేటలో రేషన్ దుకాణం నిర్వహించేందుకు అనుమతి, నిర్వాహకుడి వద్ద లెసైన్స్ కూడా లేదన్నారు. దీనికి డీలర్ మాట్లాడుతూ లెసైన్స్ పునరుద్ధరణకు ఇచ్చామన్నారు. ఏది ఏమైనప్పటికీ రికార్డులకు, సరుకులకు తేడా ఉండడంతో రికార్డులు సీజ్ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. తేడా వచ్చిన సరుకులను సీఎస్‌డీటీ జి.జనార్దన్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి.రామకృష్ణ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంటు ఎస్ఐ అప్పలనాయుడు, హెచ్‌సీ లక్ష్మణ్, వీఆర్ఓ రమణమూర్తి తదితరులు ఉన్నారు.