రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ జాయింట్స్
పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్ : నగరంలోని ప్రముఖ హోటల్స్ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, మాంసాన్నే జనాలకు వేడివేడిగా అందిస్తూ సొమ్ములు గడిస్తున్న నిర్వాహకులు కనీసం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకపోవటంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో బుధవారం మూడు ప్రముఖ హోటల్స్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి.. కంపు కొడుతూ, రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను చూసిన విజిలెన్స్ అధికారులు షాకయ్యారు. ఆహారపదార్థాలు ఇంత దారుణంగా ఉండడంతో భోజనప్రియులు భయపడుతున్నారు. ఇక హోటల్స్ నిర్వహణ ఇంత దారుణంగా ఉన్నా విజిలెన్స్ అధికారులు, ఆహారభద్రతా అధికారులు స్వయంగా పరిశీలించినా అవన్నీ చక్కగా తెరుచుకునే ఉండడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏలూరులో విజిలెన్స్ దాడులు
ఏలూరు నగరంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆహార భద్రతా అధికారులు పలు హోటల్స్‌పై ఆకస్మిక దాడులు చేశారు. టూటౌన్‌లో ఆర్‌ఆర్‌పేట విజయవిహార్ సెంటర్ ప్రాంతంలోని విజయా మెస్, ఎన్‌ఆర్‌పేటలోని టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని గ్రాండ్ ఆర్యా హోటల్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఒక హోటల్ పైనా దాడులు చేశారు. విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో సీఐ భాస్కర్, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ హోటల్స్‌లో పెద్దమొత్తంలో నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మటన్‌ను అ«ధికారులు స్వాధీనం చేసుకుని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. ఇక నిల్వ ఉంచిన ఆహారపదార్థాలు తీవ్రస్థాయిలో దుర్గంధం వెదజల్లటంతో అధికారులు, ప్రజలు సైతం విస్తుపోయారు. చికెన్ లెగ్‌పీస్‌లు అయితే ఏకంగా పట్టుకుంటే చిన్నచిన్న పీస్‌లుగా ఊడిపోవటం, దుర్గంధం వెదజల్లటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఏమాత్రం ఆహార భద్రతా నియమాలు పాటించటంలేదని అధికారులు పేర్కొంటున్నారు. మూడు హోటల్స్ నుంచి 15 శాంపిల్స్ సేకరించామనీ, టెస్ట్‌లకు ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు.
భోజన ప్రియులకు షాక్
సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్ళేందుకు భోజనప్రియులు అధికంగా ఇష్టపడతారు. ఏలూరు నగరంలో ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లుగా చెప్పుకునే వీటిలో కనీస నాణ్యత పాటించకపోవటం భోజన ప్రియులకు షాకిస్తోంది. తాము ఇప్పటి వరకూ ఇలాంటి ఆహారాన్నా తినేది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు అయితే విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయనే సమాచారంతో మూసివేశారు. ఎలాగో తమపైనా దాడులు చేస్తే అబాసుపాలు కాకతప్పదనే అంచనాకు వచ్చిన సదరు రెస్టారెంట్ల నిర్వాహకులు ముందుగానే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇక హోటల్స్‌లో ఆహారపదార్థాలు కొనుగోలు చేసే ప్రజలు పరిశీలించి తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment