ఆకివీడులోని కారం మిల్లులో తనిఖీల్లో లభ్యమైన రంగుపొడి
పశ్చిమగోదావరి, ఆకివీడు: ఆకివీడులోకి కారం మిల్లుపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. మిల్లులో నకిలీ కారం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ వరదరాజు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. కారం మిల్లులో తనిఖీలు చేయగా రంగుపొడి లభ్యమైంది. భారీ మొత్తంలో దొరికిన రంగు పొడి శాంపిల్స్‌ను విజిలెన్స్ సీఐ విల్సన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎమ్మార్వో రవికుమార్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రామయ్య సేకరించారు.
అనంతరం విలేకర్లతో విల్సన్ మాట్లాడుతూ కారం మిల్లులో రంగు కలిపి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. మిల్లులో రంగు పొడి అధిక మొత్తంలో కన్పించిందని, దీనిని శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నట్లు చెప్పారు. పరీక్షల అనంతరం నకిలీదైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆకివీడు, దుంపగడపలోని రెండు రేషన్ షాపుల్ని తనిఖీ చేశామని విల్సన్ చెప్పారు. రెండు షాపుల్లో రికార్డులకు అనుగుణంగా స్టాక్ లేదని, వాటిపై సెక్షన్ 6ఏ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కాగా కారంమిల్లు యజమాని రంగు పొడిని కుంకుమ పొడి అని, వినియోగదారుడు తీసుకువచ్చాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment