సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్ల అక్రమాలకు కళ్లెం వేసేందుకు పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. ప్రత్యేక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. ఈ బృందాలు రేషన్ షాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తూ రికార్డులు, సరుకుల నిల్వల తనిఖీలకు శ్రీకారం చుట్టాయి. వాటిలో ఏ మాత్రం హెచ్చుతగ్గులున్నా డీలర్లకు నోటీసులివ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి డీలర్ల అక్రమాలను గుర్తించారు. ఖైరతాబాద్‌లోని చింతల బస్తీ, అంబర్‌పేటలోని గోల్నాక తులసినగర్‌లోని రేషన్ షాపులను తనిఖీ చేయగా రికార్డులు, స్టాక్ నిల్వలకు పొంతన లేదని తేలింది. దీంతో డీలర్లకు నోటీసులు జారీ చేయడమే కాకుండా కేసులు నమోదు చేశారు.
ఈ–పాస్‌లో సైతం అక్రమాలు
ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఈ–పాస్ (బయోమెట్రిక్) ద్వారా çసబ్సిడీ సరుకుల పంపిణీ జరుగుతున్నా..అందులో సైతం డీలర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి వేలిముద్ర వేసి సరుకులు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... సరుకుల పంపిణీలోనే డీలర్లు చేతివాటం ప్రదర్శిన్నారు. కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి కిరోసిన్, గోధుములు ఇతరత్రా ఇవ్వకుండా ఈ–పాస్ యంత్రంలో మాత్రం డ్రా చేస్తున్నట్లు నమోదు చేయడం సర్వసాధారణమైంది. వాస్తవంగా సరుకుల డ్రాకు సంబంధించి సంక్షిప్త సమాచారం సంబంధిత కార్డుదారుడి ఫోన్‌కు రావాల్సి ఉంటుంది. అయితే ఈ–పాస్‌ద్వారా ఎస్‌ఎంఎస్‌లు ఫోన్‌లకు చేరకుండా చేయడంలో డీలర్లు సఫలీకృతమయ్యారు. దీంతో లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే అంటగడుతూ మిగతా సరుకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులు గట్టిగా నిలదీస్తే స్టాక్ రాలేదని, లేకుంటే అయిపోయిందని చెబుతున్నారు. రేషన్ పోర్టబిలిటీ అమలవుతున్న కారణంగా సరుకుల ఎగవేత మరింత కలిసి వస్తోంది.
520 దుకాణాల గుర్తింపు?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 520 ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు జాబితా అందించినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఫిర్యాదుల గల చౌకధరల దుకాణాలపై దాడులు ప్రారంభమయ్యాయి. మహానగర పరిధిలో మూడు పౌరసరఫరాల జిల్లాలు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల పరిధిలో పన్నెండు పౌరసరఫరాల సర్కిల్స్ ఉన్నాయి. వాటి పరిధిలోని 1545 ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సుమారు 16,02,134 ఆహార భద్రత కార్డులకు సబ్సిడి సరుకుల పంపిణీ జరుగుతోంది. హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిధిలో 5,85,039 కార్డులు ఉండగా, అందులో 21,85,668 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 5,23,089 కార్డులు ఉండగా అందులో 17,46,078 యూనిట్లు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 4,94,006 కార్డులు ఉండగా, అందులో 16,47,263 యూనిట్లు ఉన్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బియ్యం అవసరం లేని లబ్ధిదారులు బయోమెట్రిక్ ఇచ్చి డీలర్లకే కిలోకు పది రూపాయల చొప్పున అప్పగిస్తుండగా, ఇక గోధుములు, కిరోసిన్‌ను మాత్రం డీలర్లు నల్లబజారుకు తరలించడం మామూలైంది.
Comments
Please login to add a commentAdd a comment