సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు నెలసరి ‘రేషన్ కోటా’ కేటాయింపు ఏ మూలకూ సరిపోవడంతో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలోసంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పోర్టబిలిటీ విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. గడువుచివరిలో స్టాక్ లేదంటూ డీలర్లుచేతులేత్తుస్తుండటంతో ఆహార భద్రత లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యంఅందని ద్రాక్షగా తయారైంది.ప్రజాపంపిణీ వ్యవస్థలో జిల్లా, రాష్ట్ర, జాతీయ పోర్టబిలిటీ విధానం అమలవుతోంది. ఆహార భద్రతకార్డు లబ్ధిదారులను రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కలిగింది. తాజాగా ఏపీ తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సైతం తెలంగాణ పరిధిలో ఎక్కడైనా సరుకులు డ్రా చేసుకునే జాతీయ పోర్టబిలిటీ విధానం అమలు కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ మహా నగరం పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో సగానికిపైగా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగవనున్నాయి. తెలంగాణ నలు మూలలతో పాటు ఏపీకి చెందిన కుటుంబాలు సైతం ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలిక నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత లబ్ధి కుటుంబాలతోపాటు తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు సైతం పోర్టబిలిటీ విధానం కారణంగా నగరంలోనే సరుకులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లావాదేవీలు పెరిగి కోటా తక్కువగా ఉండటంతో గడువు లోపలే నిల్వలు ఖాళీ అవుతున్నాయి.
పెరగని రేషన్ కోటా..
ప్రజా పంపిణీ వ్యవస్థలో పోర్టబిలిటీ విధానం అమలవుతున్న చౌకధరల దుకాణాల కోటా మాత్రం పెరగటం లేదు. జిల్లా, రాష్ట్ర పోర్టబిలిటీ విధానంతో పాటు గత మూడు మాసాలుగా నేషనల్ పోర్టబిలిటీ విధానం కూడా అమలవుతోంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలో మకాం వేసి పేద కుటుంబాలు తమ కోటా పీడీఎస్ బియ్యం ఇక్కడే డ్రా చేస్తున్నారు. తాజాగా నేషనల్ పోర్టబిలిటీ కింద ఏపీకి చెందిన తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు సైతం తమ కోటా ఇక్కడే డ్రా చేయడం ప్రారంభించారు. దీంతో మొత్తమ్మీద సుమారు 30 శాతం వరకు సరుకులు అధికంగా డ్రా జరుగుతోంది. పౌరసరఫరాల విభాగం మాత్రం సరుకుల కోటా పెంచడం లేదు. అవసరమైన కోటాలో సైతం కొంత వరకు కోత విధించి కేటాయిస్తూ వస్తోంది. వాస్తవంగా ప్రతి చౌకధరల దుకాణం పరిధిలోని సుమారు 20 నుంచి 30 శాతం వరకు లబ్ధి కుటుంబాలు వివిధ కారణాలతో సరుకులు డ్రా చేయరు. దీంతో డీలర్లు తమకు కేటాయించిన కోటాలో రెండు దశల్లో కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్టాక్ పాయింట్ల నుంచి సరుకుల డ్రా చేస్తుంటారు. దీంతో పోర్టబిలిటీ లావాదేవీల ప్రభావంతో నిల్వలు గడువు లోపలే పూర్తిగా నిండుకుంటున్నట్లు తెలుస్తోంది.
15 వరకు గడువు..
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులు సరుకులు డ్రా చేసుకునే గడువు ప్రతి నెలా 15వ తేదీ వరకు ఉంటుంది. నగరంలోని కొందరు లబ్ధిదారులకు పని ఒత్తిడి, ఇతర కారణాలతో మొదటి పది రోజుల వరకు సరకులు డ్రా చేసుకునేందుకు వీలుపడదు. చివరి రోజల్లో డ్రా చేసుకునే ప్రయత్నిస్తే.. స్టాక్ లేదని డీలర్లు పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజుల్లో బియ్యం నిల్వలు ఖాళీ కావడంతో తిరిగి తెప్పించేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..పట్టిపట్టనట్లు వ్యవహరిస్తూన్నానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ సారైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పీడీఎస్ నిల్వలు పూర్తి కాకముందే డీలర్లు స్టాక్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment