Portability services
-
ఐవోబీ అకౌంట్ పోర్టబిలిటీ
చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్లైన్లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్ అకౌంట్ పోర్టబిలిటీని ఆన్లైన్లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్’ సెక్షన్‌కు వెళ్లాలి. అకౌంట్ నంబర్ నమోదు చేసి, రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి. -
రేషన్ ‘కోటా’ నో స్టాక్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు నెలసరి ‘రేషన్ కోటా’ కేటాయింపు ఏ మూలకూ సరిపోవడంతో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలోసంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పోర్టబిలిటీ విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. గడువుచివరిలో స్టాక్ లేదంటూ డీలర్లుచేతులేత్తుస్తుండటంతో ఆహార భద్రత లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యంఅందని ద్రాక్షగా తయారైంది.ప్రజాపంపిణీ వ్యవస్థలో జిల్లా, రాష్ట్ర, జాతీయ పోర్టబిలిటీ విధానం అమలవుతోంది. ఆహార భద్రతకార్డు లబ్ధిదారులను రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కలిగింది. తాజాగా ఏపీ తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సైతం తెలంగాణ పరిధిలో ఎక్కడైనా సరుకులు డ్రా చేసుకునే జాతీయ పోర్టబిలిటీ విధానం అమలు కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ మహా నగరం పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో సగానికిపైగా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగవనున్నాయి. తెలంగాణ నలు మూలలతో పాటు ఏపీకి చెందిన కుటుంబాలు సైతం ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలిక నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత లబ్ధి కుటుంబాలతోపాటు తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు సైతం పోర్టబిలిటీ విధానం కారణంగా నగరంలోనే సరుకులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లావాదేవీలు పెరిగి కోటా తక్కువగా ఉండటంతో గడువు లోపలే నిల్వలు ఖాళీ అవుతున్నాయి. పెరగని రేషన్ కోటా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పోర్టబిలిటీ విధానం అమలవుతున్న చౌకధరల దుకాణాల కోటా మాత్రం పెరగటం లేదు. జిల్లా, రాష్ట్ర పోర్టబిలిటీ విధానంతో పాటు గత మూడు మాసాలుగా నేషనల్ పోర్టబిలిటీ విధానం కూడా అమలవుతోంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలో మకాం వేసి పేద కుటుంబాలు తమ కోటా పీడీఎస్ బియ్యం ఇక్కడే డ్రా చేస్తున్నారు. తాజాగా నేషనల్ పోర్టబిలిటీ కింద ఏపీకి చెందిన తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు సైతం తమ కోటా ఇక్కడే డ్రా చేయడం ప్రారంభించారు. దీంతో మొత్తమ్మీద సుమారు 30 శాతం వరకు సరుకులు అధికంగా డ్రా జరుగుతోంది. పౌరసరఫరాల విభాగం మాత్రం సరుకుల కోటా పెంచడం లేదు. అవసరమైన కోటాలో సైతం కొంత వరకు కోత విధించి కేటాయిస్తూ వస్తోంది. వాస్తవంగా ప్రతి చౌకధరల దుకాణం పరిధిలోని సుమారు 20 నుంచి 30 శాతం వరకు లబ్ధి కుటుంబాలు వివిధ కారణాలతో సరుకులు డ్రా చేయరు. దీంతో డీలర్లు తమకు కేటాయించిన కోటాలో రెండు దశల్లో కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్టాక్ పాయింట్ల నుంచి సరుకుల డ్రా చేస్తుంటారు. దీంతో పోర్టబిలిటీ లావాదేవీల ప్రభావంతో నిల్వలు గడువు లోపలే పూర్తిగా నిండుకుంటున్నట్లు తెలుస్తోంది. 15 వరకు గడువు.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులు సరుకులు డ్రా చేసుకునే గడువు ప్రతి నెలా 15వ తేదీ వరకు ఉంటుంది. నగరంలోని కొందరు లబ్ధిదారులకు పని ఒత్తిడి, ఇతర కారణాలతో మొదటి పది రోజుల వరకు సరకులు డ్రా చేసుకునేందుకు వీలుపడదు. చివరి రోజల్లో డ్రా చేసుకునే ప్రయత్నిస్తే.. స్టాక్ లేదని డీలర్లు పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజుల్లో బియ్యం నిల్వలు ఖాళీ కావడంతో తిరిగి తెప్పించేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..పట్టిపట్టనట్లు వ్యవహరిస్తూన్నానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ సారైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పీడీఎస్ నిల్వలు పూర్తి కాకముందే డీలర్లు స్టాక్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆదిలోనే ఆటంకం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘రేషన్ నేషనల్ పోర్టబిలిటీ’కి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ–పాస్‌తో డేటా అనుసంధానం కాకపోవడం సాంకేతిక సమస్యగా తయారైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారులు వారం రోజులుగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ కింద కేంద్రం నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టగా... తెలుగు రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటి నుంచి నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు జూలై 26న ఖైరతాబాద్ సర్కిల్ పరిధి పంజగుట్టలోని ప్రభుత్వ చౌకధరల దుకాణంలో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇద్దరు లబ్ధిదారులకు సరుకులు కూడా పంపిణీ చేశారు. కానీ ఈ–పాస్‌తో ఏపీ డేటా అనుసంధానం ఇప్పుడు సమస్యగా మారింది. పరిధి ఎంత? రేషన్ నేషనల్ పోర్టబిలిటీ ప్రయోగం పరిధిపై పౌరసరఫరాల శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రయోగం ఎంత వరకు పరిమితం చేయాలనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. నేషనల్ పోర్టబిలిటీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారులు నగరంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రయోగ పరిధిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. మళ్లీ ఈ విధానం కూడా కేంద్ర ఆహార భద్రత పరిధిలోని లబ్ధిదారులు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అతని రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఈ విధానంలో బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున కుటుంబానికి 20 కిలోలకు మించకుండా మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారు. కిలోకు రూ.3 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థానికంగా ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు కిలో బియ్యం రూ.1 చొప్పున ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది. బియ్యం కోటాపై పరిమితి లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తోంది. -
రేషన్ పోర్టబిలిటీ అంతంతే
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘రేషన్ పోర్టబిలిటీ’కి స్పందన అంతంత మాత్రమే అమలవుతోంది. ఎక్కడి నుంచైనా సరుకుల విధానంలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో స్థానికంగా కేటాయించిన షాపుపైనే ఆహార భద్రత లబ్ధి కుటుంబాలు మొగ్గు చూపుతున్నారు. కేవలం నగరానికి వలస వచ్చిన కుటుంబాలు మాత్రమే రాష్ట్ర స్ధాయి పోర్టబిలిటీని వినియోగించుకుంటుండగా, అద్దె నివాస గృహాల కారణంగా ఇళ్లు మారిన పేద కుటుంబాలు ఇతర షాపులల్లో సరుకులు డ్రా చేస్తున్నారు. మిగిలిన కుటుంబాలు తమకు కేటాయించిన షాపుల్లోనే సరుకుల తీసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ తరహాలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానాన్ని హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ– పాస్ విధానం అమల్లోకి రావడంతో రేషన్ పోర్టబిలిటీకి శ్రీకారం చుట్టారు. ఈ–పాస్ పద్ధతిలో సరుకుల పంపిణీ అమలు రేషన్ పోర్టబిలిటీకి కలిసి వచ్చింది. నగర చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు చెందిన పేద కుటుంబాలు ఉపాధి నిమిత్తం వలస వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న విషయం విధితమే. రేషన్ పోర్టబిలిటీ అమలు కారణంగా నగరంలో కూడా రేషన్ సరుకులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. అయితే పోర్టబిలిటీ విధానంలో సరుకుల డ్రాకు వస్తున్న లబ్ధిదారులుకు బియ్యం మినహా మిగతా సరుకులు ఇచ్చేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. స్టాక్ రాలేదంటూ కిరోసిన్ ఇతరత్రా సరుకులు ఎగవేస్తున్నారు. పైగా ఇతర సబ్సిడీ లేని కిరాణా సరుకులను బలవంతంగా అంటగట్టడం నిత్యకృత్యమైంది. దీంతో సరుకుల డ్రాకు స్థానిక షాపులనే అత్యధికంగా లభ్ధిదారులు ఆశ్రయిస్తున్నారు. సరుకుల డ్రా ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లా పౌరసరఫరాల విభాగాల్లో కలిపి మొత్తం 16.95 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వాటిలో ఏప్రిల్ మాసంలో తమకు కేటాయించిన షాపులో 11,88,725 కుటుంబాలు సరుకులు డ్రా చేసుకోగా జిల్లా స్థాయి పోర్టబిలిటీ విధానంలో 3,24,94 కుటుంబాలు, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ విధానంలో 1,82,017 కుటుంబాలు సరుకులు డ్రా చేసుకున్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. -
సెల్‌ఫోన్ సిమ్ల భద్రత డొల్లేనా..?
పశ్చిమగోదావరి , ఏలూరు (టూటౌన్): మనం వినియోగిస్తున్న సెల్ ఫోన్ సిమ్ల భద్రత డొల్లేనా..? అనే అనుమానం వినియోగదారుల్లో వ్యక్త మవుతోంది. ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్‌కు పోర్టబులిటీ ద్వారా మారినా రెండు సర్వీసులు పనిచేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించి రీచార్జ్ అవడం, కాల్ వెయిటింగ్ రావడం, ఆఖరుకు కాన్ఫరెన్స్ కాల్స్ కలవడంతో ఇదేమీ విచిత్రమంటూ వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా పోర్టబులిటీ ద్వారా వేరే నెట్ వర్క్‌కు మారేటప్పుడు గతంలో ఉన్న నెట్ వర్క్ కట్ అయిన తర్వాతనే కొత్తగా తీసుకున్న నెట్ వర్క్ మనుగడలోకి వస్తుంది. కానీ ఏలూరులో పై విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. ఏలూరు రామచంద్రరావు పేటకు చెందిన కేవీ శేఖర్ అనే వ్యాపారి వారం క్రితం తను వాడుతున్న బీఎస్ఎన్ఎల్ సెల్ నెంబర్‌ను ఎంఎన్‌పీ(పోర్టబులిటీ) ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారాడు. రీచార్జ్ కూడా చేయించాడు. ఈ సందర్భంగా జియో నెట్ వర్క్ నిర్వాహకులు మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కట్ అయిన వెంటనే మారిన జియో నెట్ వర్క్ పనిచేస్తుందని చెప్పారు. మారిన నాలుగు రోజులకు అనగా శనివారం ఉదయం నుంచి జియో నెంబర్ 94403 29002 పనిచేస్తుంది. అయితే విచిత్రంగా కట్ అవ్వాల్సిన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సైతం ఇదే నెంబర్‌పై పనిచేస్తుండటంతో ఇదెలా సాధ్యమంటూ ఆ వినియోగదారుడు విస్తుపోయాడు. అంటే ఈ లెక్కన మనం ఇచ్చే వివరాలు ఆయా సెల్‌ఫోన్ సంస్థల వద్ద భద్రమేనా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై టెలికాం అధికారిని వివరణ కోరగా ఒకే నెంబర్‌పై రెండు నెట్ వర్క్‌లు పనిచేయడం సాధ్యం కాదని, ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ చెప్పారు. -
ఎక్కడి నుంచైనా..
సాక్షి, కామారెడ్డి : రేషన్ వినియోగదారులకు శుభవార్త.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరుకులు పొందే అవకాశం నేటి నుంచి అమల్లోకి రానుంది. తద్వారా వలస జీవులకు ఊరట కలగనుంది. రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత సరకులు తీసుకోవడానికి వినియోగదారులు ఎక్కడ ఉన్నా సొంత గ్రామానికి రావలసి వచ్చేది. కొన్నిసార్లు రేషన్ సరకులు తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యేవారు. కొందరు రేషన్ దుకాణాల డీలర్లకే వదిలేసే పరిస్థితి ఉండేది. అయితే, ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంతో ఇకపై ఆ ఇబ్బంది తొలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పోర్టబిలిటీ పద్ధతి’ ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు మంచి అవకాశం కల్పించింది. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వినియోగదారులు తాము ఉంటున్న చోట అందుబాటులో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తీసుకునే అవకాశం ఏర్ప డింది. కామారెడ్డి జిల్లాలో 2.46 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతీ నెలా 5,400 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. చాలా మంది బతుకుదెరువు కోసం సమీప పట్టణాలకో, నగరాలకో వలస వెళ్లారు. అయితే, ప్రతీ నెల రేషన్ సరుకులు సొంత గ్రామానికి వెళ్లి తీసుకోవలసి వచ్చేది. రేషన్ సరకులు సరఫరా చేస్తున్న రోజుల్లో ఏదో ఒ క రోజు గ్రామానికి వెళ్లి సరకులు తీసుకునే వారు. వరుస గా మూడు నెలల పాటు సరకులు తీసుకోనట్టయితే రేషన్ కార్డు రద్దవుతుందన్న భయంతో ఎంత దూరం ఉన్నా స రే, ఎంత ఖర్చయినా సరే షాపునకు వెళ్లి సరుకులు తీసుకునే వారు. అయితే, ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం తో పాటు పోర్టబిలిటీని కూడా అమలులోకి తేవడంతో రే షన్ సరుకులు ఎక్కడైనా తీసుకునే అవకాశం లభించనుంది. రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా సరే తమ రేషన్ కార్డును తీసుకెళ్తే చాలు అక్కడ సరుకులు ఇచ్చేస్తారు. తద్వారా వినియోగదారులకు వ్యయ ప్రయాసలు తగ్గినున్నాయి. లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం.. ఎక్కడున్నా రేషన్ సరుకులు తీసుకోవడానికి ఆస్కారం కల్పించడంతో లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లు ఒక చోట, రేషన్ షాపులు మరో చోట ఉంటాయి. తమకు సమీపంలో రేషన్ దుకాణాలు ఉన్నప్పటికీ ఇంత కాలం అక్కడ రేషన్ తీసుకునే అవకాశం లేకుండేది. అయితే పోర్టబిలిటీ విధానంతో తమకు అందుబాటులో ఉన్న షాపునకు వెళ్లి రేషన్ సరకులు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. . -
బీమా అంతటికీ పోర్టబిలిటీ..?
• ప్రస్తుతానికి మాత్రం హెల్త్ పాలసీలకు... • సాధారణ, జీవిత, వాహన బీమాకు ఇంకా లేదు • అమలు చేస్తే బీమా కంపెనీలకు రేటింగ్ పెరుగుతుంది • బీమా పరిశ్రమపై నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదు • ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యాఖ్యలు • హైదరాబాద్‌లో పీఎన్బీ మెట్‌లైఫ్ వీఆర్ సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్, బ్యాంకింగ్ రంగాలకు మాత్రమే అందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు బీమా రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమేఅందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు సాధారణ, జీవిత, వాహన వంటి అన్ని రకాల బీమా పాలసీలకూ వర్తింపజేయాల్సిన అవసరం చాలా ఉందని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) చైర్మన్టీఎస్ విజయన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై చర్చ జరుగుతోందని.. ఎలాంటి విధానపరమైన నిర్ణయాలూ ఇంకా తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం రెన్యూవల్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నపోర్టబిలిటీ అవకాశం ప్రీమియం చెల్లింపులు, పాలసీ ఎంపిక సమయంలోనూ అందిస్తే కస్టమర్ తనకు నచ్చిన బీమా కంపెనీని ఎంచుకునే వీలుంటుందని తెలియజేశారు. సోమవారమిక్కడ పీఎన్బీ మెట్లైఫ్కార్యాలయంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బీమా సంస్థతో సంతృప్తి చెందని కస్టమర్ ఎలాంటి ప్రయోజనాలను కోల్పోకుండాపాలసీని ఇతర బీమా సంస్థకు... అది కూడా ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా బదిలీ చేసుకునే అవకాశం పోర్టబిలిటీతో ఉంటుందని తెలియజేశారు. మరోవైపు పోర్టబిలిటీతో కస్టమర్లు బీమాసంస్థలకు రేటింగ్, ర్యాంకింగ్ ఇచ్చే అవకాశముంటుందని దీంతో బీమా సంస్థల మధ్య సానుకూల పోటీతత్వం పెరగడంతో పాటూ లావాదేవీల్లో పారదర్శకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం చెల్లింపు గడువు పెంపు.. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం బీమా పరిశ్రమపై పెద్దగా లేదని, ఎందుకంటే ఈ రంగంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా, ఎలక్ట్రానిక్ లావాదేవీల రూపంలోనే లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని విజయన్చెప్పారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం రెన్యూవల్ కస్టమర్ల మీద పడకూడదనే ఉద్దేశంతో జీవిత బీమా పాలసీల రెన్యూవల్ సమయాన్ని మరో 30 రోజులకు పొడిగించినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 8– డిసెంబర్31తో ముగిసే అన్ని రకాల జీవిత బీమా పాలసీ ప్రీమియం రెన్యూవల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని తెలియజేశారు. గతేడాది నవంబర్ నాటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి జీవిత బీమా కొత్త ప్రీమియం చెల్లింపుల్లో38 శాతం వృద్ధి నమోదైందని ఐఆర్డీఏఐ (లైఫ్) మెంబర్ నీలేశ్ సాథే చెప్పారు. వీఆర్ సేవలు ప్రారంభం: ఆధునిక సాంకేతిక సేవలను బీమా వినియోగదారులకూ అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా బీమా పరిశ్రమలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని తీసుకొచ్చామని పీఎన్బీమెట్లైఫ్ సీఈవో, ఎండీ తరుణ్ ఛుగ్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కత్తా, జమ్ము, చంఢీఘడ్, లక్నో, అహ్మదాబాద్, పుణే 10 నగరాల్లోని 15 బ్రాంచీల్లో వీఆర్ సేవలు అందుబాటులోఉన్నాయి. రెండో దశలో దేశంలోని అన్ని పీఎన్బీ మెట్‌లైఫ్ బ్రాంచీలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.