బీమా అంతటికీ పోర్టబిలిటీ..?
• ప్రస్తుతానికి మాత్రం హెల్త్ పాలసీలకు...
• సాధారణ, జీవిత, వాహన బీమాకు ఇంకా లేదు
• అమలు చేస్తే బీమా కంపెనీలకు రేటింగ్ పెరుగుతుంది
• బీమా పరిశ్రమపై నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదు
• ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యాఖ్యలు
• హైదరాబాద్‌లో పీఎన్‌బీ మెట్‌లైఫ్ వీఆర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్, బ్యాంకింగ్ రంగాలకు మాత్రమే అందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు బీమా రంగంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమేఅందుబాటులో ఉన్న పోర్టబిలిటీ సేవలు సాధారణ, జీవిత, వాహన వంటి అన్ని రకాల బీమా పాలసీలకూ వర్తింపజేయాల్సిన అవసరం చాలా ఉందని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌టీఎస్ విజయన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై చర్చ జరుగుతోందని.. ఎలాంటి విధానపరమైన నిర్ణయాలూ ఇంకా తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం రెన్యూవల్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉన్నపోర్టబిలిటీ అవకాశం ప్రీమియం చెల్లింపులు, పాలసీ ఎంపిక సమయంలోనూ అందిస్తే కస్టమర్ తనకు నచ్చిన బీమా కంపెనీని ఎంచుకునే వీలుంటుందని తెలియజేశారు. సోమవారమిక్కడ పీఎన్‌బీ మెట్‌లైఫ్‌కార్యాలయంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న బీమా సంస్థతో సంతృప్తి చెందని కస్టమర్ ఎలాంటి ప్రయోజనాలను కోల్పోకుండాపాలసీని ఇతర బీమా సంస్థకు... అది కూడా ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా బదిలీ చేసుకునే అవకాశం పోర్టబిలిటీతో ఉంటుందని తెలియజేశారు. మరోవైపు పోర్టబిలిటీతో కస్టమర్లు బీమాసంస్థలకు రేటింగ్, ర్యాంకింగ్ ఇచ్చే అవకాశముంటుందని దీంతో బీమా సంస్థల మధ్య సానుకూల పోటీతత్వం పెరగడంతో పాటూ లావాదేవీల్లో పారదర్శకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రీమియం చెల్లింపు గడువు పెంపు..
రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం బీమా పరిశ్రమపై పెద్దగా లేదని, ఎందుకంటే ఈ రంగంలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా, ఎలక్ట్రానిక్ లావాదేవీల రూపంలోనే లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయని విజయన్‌చెప్పారు. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం రెన్యూవల్ కస్టమర్ల మీద పడకూడదనే ఉద్దేశంతో జీవిత బీమా పాలసీల రెన్యూవల్ సమయాన్ని మరో 30 రోజులకు పొడిగించినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 8– డిసెంబర్31తో ముగిసే అన్ని రకాల జీవిత బీమా పాలసీ ప్రీమియం రెన్యూవల్ కస్టమర్లకు ఇది వర్తిస్తుందని తెలియజేశారు. గతేడాది నవంబర్ నాటితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి జీవిత బీమా కొత్త ప్రీమియం చెల్లింపుల్లో38 శాతం వృద్ధి నమోదైందని ఐఆర్‌డీఏఐ (లైఫ్) మెంబర్ నీలేశ్ సాథే చెప్పారు.
వీఆర్ సేవలు ప్రారంభం: ఆధునిక సాంకేతిక సేవలను బీమా వినియోగదారులకూ అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా బీమా పరిశ్రమలో వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నాలజీని తీసుకొచ్చామని పీఎన్‌బీమెట్‌లైఫ్ సీఈవో, ఎండీ తరుణ్ ఛుగ్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, జమ్ము, చంఢీఘడ్, లక్నో, అహ్మదాబాద్, పుణే 10 నగరాల్లోని 15 బ్రాంచీల్లో వీఆర్ సేవలు అందుబాటులోఉన్నాయి. రెండో దశలో దేశంలోని అన్ని పీఎన్‌బీ మెట్‌లైఫ్ బ్రాంచీలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.