సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘రేషన్ పోర్టబిలిటీ’కి స్పందన అంతంత మాత్రమే అమలవుతోంది. ఎక్కడి నుంచైనా సరుకుల విధానంలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో స్థానికంగా కేటాయించిన షాపుపైనే ఆహార భద్రత లబ్ధి కుటుంబాలు మొగ్గు చూపుతున్నారు. కేవలం నగరానికి వలస వచ్చిన కుటుంబాలు మాత్రమే రాష్ట్ర స్ధాయి పోర్టబిలిటీని వినియోగించుకుంటుండగా, అద్దె నివాస గృహాల కారణంగా ఇళ్లు మారిన పేద కుటుంబాలు ఇతర షాపులల్లో సరుకులు డ్రా చేస్తున్నారు. మిగిలిన కుటుంబాలు తమకు కేటాయించిన షాపుల్లోనే సరుకుల తీసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
రెండేళ్ల క్రితం ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ తరహాలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానాన్ని హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ– పాస్ విధానం అమల్లోకి రావడంతో రేషన్ పోర్టబిలిటీకి శ్రీకారం చుట్టారు. ఈ–పాస్ పద్ధతిలో సరుకుల పంపిణీ అమలు రేషన్ పోర్టబిలిటీకి కలిసి వచ్చింది. నగర చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు చెందిన పేద కుటుంబాలు ఉపాధి నిమిత్తం వలస వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న విషయం విధితమే. రేషన్ పోర్టబిలిటీ అమలు కారణంగా నగరంలో కూడా రేషన్ సరుకులు తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. అయితే పోర్టబిలిటీ విధానంలో సరుకుల డ్రాకు వస్తున్న లబ్ధిదారులుకు బియ్యం మినహా మిగతా సరుకులు ఇచ్చేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. స్టాక్ రాలేదంటూ కిరోసిన్ ఇతరత్రా సరుకులు ఎగవేస్తున్నారు. పైగా ఇతర సబ్సిడీ లేని కిరాణా సరుకులను బలవంతంగా అంటగట్టడం నిత్యకృత్యమైంది. దీంతో సరుకుల డ్రాకు స్థానిక షాపులనే అత్యధికంగా లభ్ధిదారులు ఆశ్రయిస్తున్నారు.
సరుకుల డ్రా ఇలా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లా పౌరసరఫరాల విభాగాల్లో కలిపి మొత్తం 16.95 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వాటిలో ఏప్రిల్ మాసంలో తమకు కేటాయించిన షాపులో 11,88,725 కుటుంబాలు సరుకులు డ్రా చేసుకోగా జిల్లా స్థాయి పోర్టబిలిటీ విధానంలో 3,24,94 కుటుంబాలు, రాష్ట్ర స్థాయి పోర్టబిలిటీ విధానంలో 1,82,017 కుటుంబాలు సరుకులు డ్రా చేసుకున్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment