సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు ఉందంటే వారిలో కొండంత ధీమా కలుగుతుంది. అలాంటిది ఇటీవల రద్దయిన రేషన్ కార్డులకు కొత్తగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రీ వెరిఫికేషన్ నిర్వహిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో రేషన్ కార్డులు రద్దయిన వారిలో అర్హులుంటే గుర్తించేందుకు సర్వే చేపట్టారు. తొలగించిన కార్డుల్లో చిరునామా ఆధారంగా కాలనీలో అధికారులు సర్వే చేపట్టి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలిస్తున్నారు.
ప్రజల్లో ఆశలు..
► కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రేషన్ కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తూ ఉండటంతో రద్దయిన తమ రేషన్ కార్డు మళ్లీ వస్తోందని, దీంతో బియ్యం, గోధుమలు ఇతర సరుకులు తెచ్చుకోవచ్చునని అసలైన లబ్ధిదారులు ఆశ పడుతున్నారు.
► 2016 సంవత్సరంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలన జరిపి కార్డులు తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కోర్టు ఆదేశాలతో రద్దయిన కార్డులు మళ్లీ జారీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు మళ్లీ తిరుగుతున్నారు.
► నాటి ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేస్తే పేర్లు కలవడం లేదు. మరి కొందరు తెలిపిన చిరునామాలో ఉండటం లేదు. రీ వెరిఫికేషన్‌లో పేర్లు ఉన్నవారిలో కొందరికి కార్డులు ఉన్నాయి. మరి కొందరు చనిపోయారు.
► బాలానగర్ కేంద్రంగా సివిల్ సప్లై కార్యాలయం పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాలు ఉన్నాయి.
► ఈ మూడు మండలాల్లో 35,200 కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్డుల వెరిఫికేషన్ జరుగుతోంది.
సర్వే ఇలా...
► రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి వారి కోసం డేటాను రేషన్ షాపుల నుంచి సేకరించాలి.
► జాబితాలను రేషన్ డీలర్ల వద్ద ప్రదర్శించాలి.
► రద్దయిన కార్డుదారులకు సంబంధించి వారి చిరునామాను గుర్తించాలి. లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి. రీ వెరిఫికేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.
► ఎవరైనా తిరిగి రేషన్ కార్డు పొందేందుకు అర్హులని తేలితే వెంటనే వారి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. అంతేకాకుండా గతంలో ఎందుకు కార్డును రద్దు చేశారో ఆ కారణాలను సైతం నమోదు చేయాలి.
కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా సర్వే...
► రద్దయిన రేషన్ కార్డుదారులకు మళ్లీ కార్డులను జారీ చేసేందుకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు రీ వెరిఫికేషన్ చేపట్టగా కొందరు అధికారులు మాత్రం ఈ సర్వేను అక్కడక్కడ మాత్రమే చేపడుతూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
► కొందరు అయితే రేషన్ డీలర్ల దగ్గర కూర్చొని ఎన్‌క్వైరీ చేసి వెళ్లి పోతున్నారే తప్ప తమ దగ్గరకు అసలు కార్డు రీ వెరిఫికేషన్ అధికారులు రాలేదని ప్రజలు వాపోతున్నారు.
► అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి అర్హులైన పేద ప్రజలందరికీ రద్దయిన కార్డులు మళ్లీ వచ్చే విధంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రతి లబ్ధిదారుకి రేషన్ కార్డు అందేలా చర్యలు
మా అధికారులు కార్డుల రీ వెరిఫికేషన్‌ను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్కరికీ న్యా యం జరుగుతుంది. అర్హులై న వారందరికీ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అ నుగుణంగా పనిచేస్తున్నాం. రీ వెరిఫికేషన్‌లో కార్డులు ఇచ్చి వారికి రేషన్ అందజేస్తాం.
– డి.నందిని, ఏఎస్‌ఓ, బాలానగర్
Comments
Please login to add a commentAdd a comment