రేషన్ దుకాణంలో నేషనల్ పోర్టబిలిటీ ట్రయల్ (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘రేషన్ నేషనల్ పోర్టబిలిటీ’కి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ–పాస్‌తో డేటా అనుసంధానం కాకపోవడం సాంకేతిక సమస్యగా తయారైంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారులు వారం రోజులుగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఒకే దేశం.. ఒకే కార్డు’ కింద కేంద్రం నేషనల్ పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టగా... తెలుగు రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆగస్టు ఒకటి నుంచి నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు జూలై 26న ఖైరతాబాద్ సర్కిల్ పరిధి పంజగుట్టలోని ప్రభుత్వ చౌకధరల దుకాణంలో ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఇద్దరు లబ్ధిదారులకు సరుకులు కూడా పంపిణీ చేశారు. కానీ ఈ–పాస్‌తో ఏపీ డేటా అనుసంధానం ఇప్పుడు సమస్యగా మారింది.
పరిధి ఎంత?
రేషన్ నేషనల్ పోర్టబిలిటీ ప్రయోగం పరిధిపై పౌరసరఫరాల శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రయోగం ఎంత వరకు పరిమితం చేయాలనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. నేషనల్ పోర్టబిలిటీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లబ్ధిదారులు నగరంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రయోగ పరిధిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. మళ్లీ ఈ విధానం కూడా కేంద్ర ఆహార భద్రత పరిధిలోని లబ్ధిదారులు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అతని రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఈ విధానంలో బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున కుటుంబానికి 20 కిలోలకు మించకుండా మాత్రమే బియ్యం పంపిణీ చేస్తారు. కిలోకు రూ.3 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్థానికంగా ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు కిలో బియ్యం రూ.1 చొప్పున ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది. బియ్యం కోటాపై పరిమితి లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment